పెరుగుతున్న మహిళాశక్తికి ఇది మరో నిదర్శనం. 2022కి గాను ఇటీవల ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో కృతార్థులైన అభ్యర్థుల్లో మూడోవంతు మంది, మరో మాటలో 34 శాతం ఆడవారే! తొలి 4 ర్యాంకులూ మహిళలవే! ఇంకా చెప్పాలంటే, అగ్రశ్రేణిలో నిలిచిన పాతిక మంది అభ్యర్థుల్లో 14 మంది స్త్రీలే! ఈ లెక్కలన్నీ మారుతున్న ధోరణికి అద్దం పడుతున్నాయి.
ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఈ మూడు దశల పరీక్షలో యువతులు ఇలా అగ్రపీఠిన నిలవడం ఇదే తొలిసారి కాకున్నా, వరుసగా కొన్నేళ్ళుగా వారు ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న తీరు అసాధారణం. అంతేకాక, ఒకే ఏడాది ఇంతమంది యువతులు సివిల్స్‌కు ఎంపికవడం ఇదే ప్రప్రథమం. సివిల్ సర్వీసుల్లో ఏయేటి కాయేడు స్త్రీల వాటా పెరుగుతుండడం సానుకూల ధోరణి. అంతకు మించి ఆనందదాయకం.
గణాంకాలు గమనిస్తే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తున్నవారిలో మహిళల వాటా 2018లో 24 శాతమైంది. 2021లో అది 26 శాతానికి ఎగబాకింది. తాజాగా 2022 పరీక్షల్లో అది గణనీయంగా 34 శాతానికి హెచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే, ఈసారి మొత్తం 933 మంది అభ్యర్థులకు సివిల్స్‌లో చోటు దక్కగా, వారిలో 320 మంది స్త్రీలే. ఇది ఒక్కరోజులో, రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు.
దశాబ్దాల పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పు. అనేక ఇతర రంగాల లాగే సివిల్స్ సైతం ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యమైనదే. 2006 వరకు యూపీఎస్సీ ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో దాదాపు 20 శాతమే మహిళలు. ఇక, ఇంకాస్త వెనక్కి వెళితే, 1980ల్లో, 1990ల తొలినాళ్ళలో వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువే. ఆ గత చరిత్ర మారి, ఈసారి 34 శాతం మహిళలు సివిల్స్ ఉద్యోగానికి లేఖలు అందుకోవడం గణనీయమైన మార్పు.
భారతదేశంలో విస్తృత సివిల్ సర్వీస్ వ్యవస్థలోకి ప్రతిభావంతులైన యువతీ యువకులను ఏటా ప్రవేశపెట్టే యూపీఎస్సీ పరీక్ష అత్యంత కష్టమైనది. చైనాలో జాతీయ కాలేజ్ ప్రవేశపరీక్ష గావో కవో లాంటి ఒకటి, రెండే ప్రపంచంలో ఈ స్థాయి క్లిష్టమైనవంటారు. ఏటా మూడు దశల్లో సాగే ఈ కఠిన పరీక్షకు ఏటా దాదాపు 10 లక్షల మంది లోపు దరఖాస్తు చేసుకుంటే, అందులో 1 శాతం కన్నా తక్కువ మందే రెండో దశ అయిన లిఖిత పరీక్ష (మెయిన్స్)కు చేరుకుంటారని లెక్క.
అలాంటి పోటీ పరీక్షలో గత ఏడాది కూడా సివిల్స్‌లో తొలి 4 ర్యాంకులూ మహిళలకే దక్కాయి. వరుసగా రెండోసారి ఈ ఏడాదీ అదే ఫలితం పునరావృతమవడం విశేషం. గమనించాల్సింది ఏమిటంటే – వైద్యప్రవేశ పరీక్షలు ‘నీట్’లోనూ ఈ ఏడాది యువతులదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో 12వ తరగతి బోర్డ్ పరీక్షా ఫలితాల్లోనూ గత అయిదేళ్ళుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పైచేయి.
సివిల్స్‌లో ప్రథమ స్థానంలో నిల్చిన ఇషితా కిశోర్ మొదలు మూడో స్థానం దక్కిన తెలుగ మ్మాయి ఉమా హారతి సహా సివిల్స్‌లో నెగ్గిన అనేకమంది అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు, జీవితంలోని కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన వారి పట్టుదల, సహనం స్ఫూర్తిదాయకం. కృతనిశ్చయులైతే... కులం, మతం, ప్రాంతం, లింగ దుర్విచక్షణ లాంటి అనేక అవరోధాలను అధిగమించి సమాజంలోని అన్ని వర్గాల నుంచి వనితలు విజేతలుగా అవతరించడం సాధ్యమని ఈ విజయగాథలు ఋజువు చేస్తున్నాయి.
నిష్పాక్షికంగా, అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా సాగే సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు ఈ తరహా విజయాలు సాధిస్తూ, ఉన్నతోద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఒకపక్కన కార్పొరేట్ ప్రపంచం సైతం సీనియర్ హోదాల్లో లింగ వైవిధ్యం సాధించడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ సర్వీసులో ఈ స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం చరిత్రాత్మకమే!
అయితే ఇది చాలదు. నిజానికి, ప్రభుత్వ పాలనలో లింగ సమానత్వంపై యూఎన్‌డీపీ 2021 నివేదిక ప్రకారం అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో స్త్రీల వాటా స్వీడన్‌లో 53 శాతం, ఆస్ట్రేలియాలో 40 శాతం, సింగపూర్ 29 శాతం కాగా, భారత్ వాటా కేవలం 12 శాతమేనట. ప్రస్తుత మహిళా విజయగాథ మరింత కాలం కొనసాగినప్పుడే ఈ లోటు భర్తీ అవుతుంది.
ఇప్పటికీ జమ్ము– కశ్మీర్, జార్ఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అవసరానికి తగ్గ సంఖ్యలో అసలు ఐఏఎస్‌లే లేరన్న పార్లమెంటరీ సంఘం నివేదికను చెవికెక్కించుకోవాలి. అయితే, కేవలం సివిల్స్‌లోనో, మధ్యశ్రేణి ఉద్యోగాల్లోనో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే సరిపోదు.
నేటికీ పితృస్వామిక భావజాలం, ఆడవారు ఇంటికే పరిమితమనే మనస్తత్వం మన సమాజంలో పోలేదన్నది చేదు నిజం. అందుకు తగ్గట్లే... మన జాతీయ శ్రామికశక్తిలో పనిచేసే వయసులోని మహిళల వాటా కూడా తక్కువే. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005లో 35 శాతమున్న వనితల వాటా, 2021లో 25 శాతానికి పడిపోయింది. వెలుగు వెనుకే ఉన్న ఈ చీకటి ఓ విషాదం.
కాకపోతే, మునుపటితో పోలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల సంఖ్య తగ్గింది. ఆధు నిక మహిళ ఒకప్పటితో పోలిస్తే విద్య, ఉద్యోగాల్లో బంధనాలను తెంచుకుంది. ఆటల నుంచి ఆర్మ్›్డ సర్వీసుల దాకా అన్నింటా తాను పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిళ్ళు, పనిప్రదేశాల్లో అభద్రత, నగరాల్లోనూ నాసిరకపు ప్రజారవాణా దుఃస్థితిని మార్చాలి.
లింగ దుర్విచక్ష లేని పనిసంస్కృతిని ప్రోత్సహించాలి. సమాజంలో దుర్లక్షణాలున్నా వాటిని దాటుకొని పడతులు పైకి రావడం సాధ్యమేనని తాజా సివిల్స్ ఫలితాలు ఆశావాదాన్ని ప్రోది చేస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ధోరణి గ్రామాలకూ విస్తరించడం శుభవార్త. ఇలాంటి మహిళా విజేతలు మరింత పెరిగితేనే, మన యువభారతం... నవభారతం అవుతుంది.
నవభారత నారీశక్తి
Published Tue, May 30 2023 12:30 AM | Last Updated on Tue, May 30 2023 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment