సివిల్స్‌ టాపర్‌ ఆదిత్య | UPSC CSE 2024 top 10 rank holders list announced: Aditya Srivastava gets first rank | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ టాపర్‌ ఆదిత్య

Published Wed, Apr 17 2024 2:18 AM | Last Updated on Wed, Apr 17 2024 2:18 PM

UPSC CSE 2024 top 10 rank holders list announced: Aditya Srivastava gets first rank - Sakshi

అనిమేశ్‌ ప్రధాన్ కు రెండో ర్యాంకు  

తెలుగమ్మాయి దోనూరు అనన్యరెడ్డికి మూడో ర్యాంకు  

సివిల్స్‌–2023 ఫలితాలు ప్రకటించిన యూపీఎస్సీ  

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ –2023 తుది ఫలితాలను యూనియన్  పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్‌ ప్రధాన్  సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం.

నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్‌–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్‌–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.  

సివిల్స్‌–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్‌–2023 ఫలితాల పూర్తి వివరాలను  http:// www.upsc. gov. in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు  
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో నెగ్గి, కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. వారి అంకితభావం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని పేర్కొన్నారు. విజేత కృషి, ప్రతిభ దేశ భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. 

మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్‌
►సివిల్స్‌ తొలి ర్యాంకర్‌ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్ లో తన ఆప్షనల్‌గా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్‌) పూర్తిచేశారు.  

►రెండో ర్యాంకర్‌ అనిమేశ్‌ ప్రధాన్  ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్‌ సైన్స్ లో బీటెక్‌ అభ్యసించారు. సివిల్స్‌ మెయిన్స్ లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు.  

►తెలుగు యువతి, సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌(ఆనర్స్‌) జాగ్రఫీ చదివారు. సివిల్స్‌ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్‌ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement