Civils mains exams
-
సివిల్స్ టాపర్ ఆదిత్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్ ప్రధాన్ సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం. నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్–2023 ఫలితాల పూర్తి వివరాలను http:// www.upsc. gov. in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి, కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి అంకితభావం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని పేర్కొన్నారు. విజేత కృషి, ప్రతిభ దేశ భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్ ►సివిల్స్ తొలి ర్యాంకర్ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్ లో తన ఆప్షనల్‌గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్) పూర్తిచేశారు. ►రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్ ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ అభ్యసించారు. సివిల్స్ మెయిన్స్ లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు. ►తెలుగు యువతి, సివిల్స్ మూడో ర్యాంకర్ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఆనర్స్) జాగ్రఫీ చదివారు. సివిల్స్ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ. -
గ్రూప్–1లో ఉమ్మడి సిలబస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్–1 పరీక్షల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తరహా కామన్ సిలబస్‌ను అమలు చేయనున్నారు. దీనిపై ఏపీపీఎస్సీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ కామన్ సిలబస్‌లో 70% యూపీఎస్సీతో సమానమైన అంశాలుంటాయి. మిగిలిన 30% రాష్ట్రానికి సంబంధించిన స్థానిక అంశాలు ఉంటాయి. అభ్యర్థులపై తగ్గనున్న ఒత్తిడి కేంద్ర సివిల్ సర్వీసుల విధులతో సమాన విధులుండే గ్రూప్–1 పోస్టుల భర్తీకి అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఒకే తరహా సిలబస్‌ను అనుసరించాలన్న దానిపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. 2017లో షిల్లాంగ్‌లో రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అధ్యక్షుల జాతీయ సమావేశం స్టాండింగ్ కమిటీలో సివిల్ సర్వీసు నియామకాల పోటీ పరీక్షల్లో ఉమ్మడి పాఠ్యప్రణాళిక కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ ఏడాది జనవరిలో నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం.. ఆయా రాష్ట్రాలు తమ సిలబస్‌లో 70 శాతాన్ని కామన్ సిలబస్‌కు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం సిలబస్‌ను తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలతో రూపొందించుకోవచ్చు. ఉమ్మడి పాఠ్య ప్రణాళిక వల్ల అభ్యర్థులకు మేలు జరగనుంది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలతోపాటు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలకు వేర్వేరు పాఠ్యాంశాలు చదవాల్సిన అవసరం ఉండదు. యూపీఎస్సీ కమిటీ సిఫార్సులు... సివిల్ సర్వీసులకు (రాష్ట్రాల గ్రూప్–1, గ్రూప్–2 సర్వీసులు) సంబంధించి ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉండాలని, మెయిన్స్‌లో ఆరు అంశాలపై పేపర్లుండాలని యూపీఎస్సీ కమిటీ సూచించింది. ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్‌లో రెండు పేపర్లు ఉండాలి. అందులో ఒకదానిలో చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక, న్యాయ, అంతర్జాతీయ సంబంధాలు, మెంటల్ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు వేయాలి. రెండో పేపరులో భారత ఆర్థిక వ్యవస్థ, ప్లానింగ్, భౌగోళిక శాస్త్రం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన విషయాలపై ప్రశ్నలు సంధించాలి. సివిల్స్ మెయిన్ పరీక్షలో... సివిల్ సర్వీస్ మెయిన్ పరీక్షలో ప్రస్తుతం జనరల్ ఇంగ్లిష్‌తోపాటు ఐదు అంశాలపై ఐదు పేపర్లు ఉన్నాయి. యూపీఎస్సీ కమిటీ సిఫార్సుల ప్రకారం జనరల్ ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషకు సంబంధించి ఒక పేపర్ ఉండాలి. వీటితోపాటు వ్యాసం(ఎస్సే)లో ఒక పేపర్, సామాన్య అధ్యయనానికి సంబంధించి మూడు పేపర్లు ఉండాలి. మొత్తం ఆరు పేపర్లను ఒక్కో దానికి 150 చొప్పున 900 మార్కులకు నిర్వహించాలి. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండాలి. మొత్తం 1,000 మార్కులకు మెయిన్స్ రాతపరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్షలో ఐచ్ఛికం(చాయిస్) ఉండదు, అన్ని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయాలి. ఎస్సే పేపర్లో వర్తమాన, సామాజిక, రాజకీయ అంశాలు, సామాజిక, ఆర్థిక విషయాలు, సామాజిక పర్యావరణ విషయాలు, సాంస్కృతిక చారిత్రక విషయాలు, సామాజిక స్పృహ తదితర అంశాలుండాలి. ఆంగ్లం, ప్రాంతీయ భాషా, ఎస్సే పేపర్లు కాకుండా మిగతా మూడు పేపర్లలో ఒకదానిలో భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, భౌగోళిక శాస్త్రం ఉంటాయి. రెండో పేపర్లో భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, ప్రభుత్వ పరిపాలన, పౌరసేవల్లో నైతిక విలువలు ఉంటాయి. ఇక మూడో పేపర్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన విషయాలు ఉంటాయి. 30 శాతం మార్పులు చేస్తే చాలు ఏపీపీఎస్సీ ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రూప్–1 సిలబస్‌కు, యూపీఎస్సీ ప్రతిపాదిత ఉమ్మడి సిలబస్‌కు మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. కామన్ సిలబస్‌లోని అన్ని అంశాలు ఏపీపీఎస్సీ గ్రూప్–1 సిలబస్‌లోని అంశాలు దాదాపు సమానంగానే ఉన్నాయి. ఉమ్మడి సిలబస్‌లో పేర్కొన్న రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇవి 20 శాతం నుంచి 30 శాతం వరకు ఉండొచ్చని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీపీఎస్సీ నియమించిన నిపుణుల కమిటీ ప్రస్తుతం దీనిపై కసరత్తు చేస్తోంది. ఈ నిపుణుల కమిటీ ప్రాథమిక సూచనల ప్రకారం మార్పులు ఇలా ఉండొచ్చు. - ప్రిలిమినరీ పరీక్షను ప్రస్తుతం ఒకే పేపర్‌గా నిర్వహిస్తుండగా ఇకపై దాన్ని రెండు పేపర్లతో నిర్వహిస్తారు. పాఠ్యప్రణాళికలో పెద్దగా మార్పులుండవు. మెయిన్స్‌లోని గణాంక విశ్లేషణ పరీక్షలోని అంశాలు ప్రిలిమినరీ పేపర్లో చేరుతాయి. - కామన్ సిలబస్‌లో ఇంగ్లిష్, ప్రాంతీయ భాషలు, సబ్జెక్టులకు సంబంధించి 4 పేపర్లను కలిపి మొత్తం 900 మార్కులకు నిర్వహించాలని, ఈ మార్కుల నుంచి మెరిట్‌ను తీసుకోవాలని యూపీఎస్సీ కమిటీ సూచించింది. ప్రస్తుతం గ్రూప్–1 మెయిన్స్‌లో ఇంగ్లిష్(అర్హత పేపర్)తోపాటు 5 ఇతర పేపర్లు ఉన్నాయి. కామన్ సిలబస్ ప్రకారం ఇంగ్లిష్‌తోపాటు తెలుగును కూడా జోడించి క్వాలిఫై పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 5 పేపర్లను యధాతథంగా కొనసాగించాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. మెరిట్‌ను నిర్ణయించడానికి ఈ ఐదు పేపర్ల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇకపై విడుదల చేయనున్న గ్రూప్–1 నోటిఫికేషన్ల నుంచే కామన్ సిలబస్‌ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. -
సివిల్స్ మెయిన్స్.. మెరిసేందుకు మార్గాలు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2017 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్ ఎగ్జామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. ప్రిలిమ్స్‌లో విజయం సాధించి మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు.. ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా ప్రిపరేషన్ సాగించి, విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. మెయిన్స్‌కు ఇంకా 82 రోజులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సక్సెస్ సాధించేందుకు విజేతలు, నిపుణుల సలహాలు, సూచనలు.. జీఎస్‌పై ప్రత్యేక దృష్టి జనరల్ స్టడీస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ప్రిపరేషన్ సాగించడం ఎంతో మేలు చేస్తుంది. గత మెయిన్స్ జీఎస్ పేపర్లను విశ్లేషిస్తే.. ఒక అంశంపై అన్నికోణాల్లో నైపుణ్యం ఉంటేనే సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలను కూడా కోర్ అంశాలతో కలిపి అడిగే ధోరణి కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, తాజా పరిణామాలను పరిశీలిస్తూ.. వాటిని కోర్ సిలబస్‌తో అన్వయించుకుంటూ అధ్యయనం చేయాలి. పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకున్న వారికి సైతం ఈ తరహా ప్రిపరేషన్ ఎంతో కలిసొస్తుంది. అభ్యర్థులు సెప్టెంబర్ చివరినాటికి ప్రిపరేషన్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయాన్ని రివిజన్‌కు కేటాయించాలి. పరీక్షకు ముందు వారం రోజుల్లో జనరల్ ఎస్సే, జీఎస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు చేస్తుంది. – వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ. విశ్లేషణ సామర్థ్యం మెయిన్స్‌కు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. జనరల్ స్టడీస్‌లోని ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ పేపర్‌కు సంబంధించిన ప్రశ్నలకు.. ఒక సివిల్ సర్వీస్ అధికారికి ఉండాల్సిన పాలనా దక్షతను ప్రతిబింబించేలా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. – ఆర్.సి.రెడ్డి, డైరెక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ.. అభ్యర్థులు అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించడం వల్ల కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అడిగే ఎస్సే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా రాసే సామర్థ్యం లభిస్తుంది. జీఎస్ పేపర్లు, ఆప్షనల్ పేపర్‌కు అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక అంశాన్ని విశ్లేషించగలిగే నైపుణ్యం కూడా సొంతం చేసుకోవాలి. ఆప్షనల్ పేపర్‌కు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా సిలబస్‌ను, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? వాటి ద్వారా ఎలాంటి నైపుణ్యాలను పరీక్షిస్తున్నారు? అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్‌ను మలచుకోవాలి. – శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత చెదరకుండా చదవడాన్ని అలవరచుకోవాలి. సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ కొనసాగించాలి. రోజూ ఆయా సబ్జెక్టులను చదివే సమయంలో.. ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. సబ్జెక్టుకు సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ చదువుతూ.. ముఖ్యమైన పాయింట్లను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఇది రివిజన్ సమయంలో టైమ్ మేనేజ్మెంట్ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది. కాంటెంపరరీ అంశాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని కోర్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. తద్వారా జనరల్ స్టడీస్ పేపర్లకు అత్యున్నతంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. రోజూ అన్ని పేపర్లకు సంబంధించిన సబ్జెక్టులను చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. – ఎం.మనుచౌదరి, సివిల్స్–2016 విజేత (36వ ర్యాంకు). కాన్సెప్ట్ ఓరియెంటేషన్ ప్రిపరేషన్లో భాగంగా సిలబస్‌లోని అంశాలకు సంబంధించి బేసిక్స్, కాన్సెప్ట్స్, నేపథ్యంపై తొలుత అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే విషయంలో ఈ దృక్పథం ఎంతో అవసరం. జనరల్ ఎస్సే.. కోర్, కాంటెంపరరీ అంశాల సమ్మిళితంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రిపరేషన్ సమయంలోనే రివిజన్‌కు ఉపకరించే విధంగా షార్ట్ నోట్స్, పాయింటర్స్, గ్రాఫికల్ మెథడ్స్ వంటి షార్ట్‌కట్ టూల్స్‌ను అనుసరించాలి. – పి.అన్వేష రెడ్డి, సివిల్స్–2016, 80వ ర్యాంకు. రైటింగ్ ప్రాక్టీస్ కీలకం సివిల్స్ మెయిన్స్‌లో సమాధానాల ప్రజెంటేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుబాటులో ఉన్న వ్యవధిలోనే సదరు ప్రశ్నకు సంబంధించి ముఖ్యాంశాలను రాయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు రోజూ ప్రిపరేషన్తోపాటు రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇది శాస్త్రీయంగా ఉండాలి. నిపుణులు రూపొందించిన ఒక ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసుకుని మూడు గంటల వ్యవధిలో సొంతంగా సమాధానాలు రాయాలి. ఫలితంగా టైం మేనేజ్మెంట్పై అవగాహన ఏర్పడుతుంది. మెరుగుపరచుకోవాల్సిన అంశాలేంటనే దానిపైనా స్పష్టత ఏర్పడుతుంది. రోజూ ఒక మాక్‌టెస్ట్‌కు 3 గంటలు కేటాయించడం కష్టం కాబట్టి, కనీసం ఒక పేపర్‌కు సంబంధించి ఆ రోజు చదివిన అంశానికి చెందిన ప్రశ్నకు పరీక్షలో లభించే సమయం లోపు సమాధానాలు రాసి, స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. – పవన్ సమీర్, సివిల్స్–2016 విజేత (142వ ర్యాంకు). ఆప్షనల్‌కు ప్రత్యేక సమయం మెయిన్స్‌కు ప్రిపరేషన్లో ఆప్షనల్ సబ్జెక్టుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం చాలా అవసరం. అకడమిక్ నేపథ్యానికి సంబంధం లేని ఆప్షనల్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. ముందుగా సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. వాటిలో తమకు అనుకూలంగా, సులువుగా ఉండే అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. అంతేకాకుండా ఆప్షనల్‌కు సంబంధించిన అంశాలను సమకాలీన అంశాలతో సమ్మిళితం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. కొన్ని ఆప్షనల్స్ సిలబస్ కొంత విస్తృతంగా ఉంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా సదరు ఆప్షనల్‌కు సంబంధించి అధిక వెయిటేజీ లభిస్తున్న అంశాలను గుర్తించవచ్చు. వీటికి కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి, ప్రిపరేషన్ కొనసాగించడం మేలు చేస్తుంది. – ఎస్.మాధవి, సివిల్స్–2016, 104వ ర్యాంకు. -
సివిల్స్ మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేరకు?
సివిల్స్ మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేరకు ఉంటుందో తెలపండి? - ప్రవళిక, ఫిల్మ్‌నగర్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : మారిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతో ఉంది. చాలామంది అభ్యర్థులకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉన్నా ఇంగ్లిష్ రాకపోవడం వల్ల మార్కులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన విద్యార్థులు ఈ అంశంలో వెనుకంజలో ఉంటున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అభ్యర్థులకు హిందీలో లేదంటే ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంటుంది. కాబట్టి చక్కటి ఇంగ్లిష్ రావడానికి రోజూ హిందూ దినపత్రికను చదవడంతోపాటు లోక్‌సభ, రాజ్యసభ, బీబీసీ, ఎన్డీటీవీ వంటి న్యూస్ చానెళ్లను రోజూ అరగంట సేపైనా చూడాలి. ఆల్ ఇండియా రేడియోను కూడా వినొచ్చు. వీటిల్లో మంచి ఉచ్ఛారణతో కూడిన ఇంగ్లిష్ ఉంటుంది. అంతేకాకుండా వివిధ అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రిపరేషన్ కోణంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. సివిల్స్ మెయిన్స్‌లో పాపులర్ ఆప్షన్స్ ఏవి? - భువన, సనత్‌నగర్ మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి మూడు గంటలు. జాతీయస్థాయిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగా పాపులర్ అని చెప్పొచ్చు. ఇవేకాకుండా హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, ఆంత్రోపాలజీ వంటి సబ్జెక్టులను ఎక్కువమంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. కోచింగ్ సదుపాయం అందుబాటులో ఉండటంతోపాటు కొన్ని సబ్జెక్టుల సిలబస్ తక్కువ ఉండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాల విద్యార్థులు తమ మాతృభాషల సాహిత్యాన్ని ఎంచుకుని కూడా పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుంటున్నారు. ఆప్షనల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. మారిన విధానంలో చాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్న లో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా, కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఇన్పుట్స్: డా.జె.బి.కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ సివిల్స్ 2013 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్, జీకేలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి? - కె.రమేశ్, మెహదీపట్నం సివిల్స్-2013 ప్రిలిమ్స్‌లో కరెంటు అఫైర్స్, స్టాండర్డ్ జీకేలకు ప్రాధాన్యం బాగా తగ్గింది. ఈ విభాగాల నుంచి ఒకట్రెండు ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. మొత్తంమీద చూస్తే పేపర్-1 గతంతో పోలిస్తే తేలిగ్గా ఉంది. పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో రీడింగ్ కాంప్రెహెన్షన్ పరిధిని తగ్గించి బేసిక్ న్యూమరసీ విభాగం నుంచి ప్రశ్నల సంఖ్యను పెంచారు. మొత్తంగా ఈ పేపర్ మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. పేపర్-1లో 100 ప్రశ్నలు, 200 మార్కులకు ఇచ్చారు. అలాగే పేపర్-1లో హిస్టరీ నుంచి 15 ప్రశ్నలు, పాలిటీ 19, జాగ్రఫీ, ఎకాలజీల నుంచి 27, సైన్స్ 21, ఎకానమీ నుంచి 18 ప్రశ్నలు వచ్చాయి. సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్ 1లో సైన్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో తెలపండి? - పి.సుదర్శన్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు తేలిగ్గా సమాధానాలు గుర్తించేవిగా ఉన్నాయి. ప్రాథమిక అంశాలపైన ఎక్కువగా అడిగారు. ఫ్రిక్షన్, ఆప్టికల్ ఇల్యూజన్, రెయిన్బో తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. సమకాలీన అంశమైన హిగ్స్ బోసన్ పార్టికల్పై ప్రశ్న వచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం గుర్తించగలిగేలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. Ex: Ball bearings are used in bicycles, cars, etc., because a) the actual area of contact between the wheel and axle is increased b) the effective area of contact between wheel and axle is decreased c) the effective area of contact between the wheel and axle is increased d) None of the above statements is correct జవాబు: c సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి ప్రశ్నలు దాదాపు కనుమరుగయ్యాయి. బయాలజీ విభాగం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. కాన్సెప్ట్లపై పట్టున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించగలిగేలా ఉన్నాయి. - ఇన్పుట్స్: ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, సి.హరికృష్ణ, సి.హెచ్.మోహన్, సీనియర్ ఫ్యాకల్టీ -
సివిల్స్ మెయిన్స్ పరీక్ష తీరు మారింది.. ప్రిపరేషన్ శైలి మారాల్సిందే...
ఎంతో మంది అభ్యర్థుల్లో ఆసక్తిని, ఆందోళనను పెంచిన సివిల్స్ మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 2న ప్రారంభమై డిసెంబర్ 8న ముగిశాయి. మారిన విధానంలో తొలిసారి నిర్వహించిన మెయిన్స్ పరీక్షల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? ఇటు పరీక్ష లు రాసిన అభ్యర్థులు, అటు సివిల్స్ ఫ్యాకల్టీ ఏమంటున్నారు? మొత్తం మీద యూపీఎస్సీ మార్పులను ఆహ్వానించవచ్చా? వచ్చే ఏడాది పరీక్షకు సిద్ధమయ్యేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవాటిపై విశ్లేషణ.. సులువుగానే వ్యాస రచన.. ఎస్సేలో నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న మహాత్మాగాంధీ ప్రసిద్ధ కొటేషన్‌పై ఉంది. అది ‘నీవు ఇతరుల్లో ఏ మార్పును అయితే కోరుకుంటున్నావో.. ముందు ఆ మార్పు నీలోనే మొదలుకావాలి’. ఈ ప్రశ్నకు అభ్యర్థులు మూడు, నాలుగు పేజీల కంటే ఎక్కువ సమాధానం రాయలేరు. మరో ప్రశ్న ఎకానమీపై ఉంది. ఇంకో ప్రశ్న మనిషి ఆలోచనలకు సంబంధించింది. బ్రిటిష్‌వారు మనదేశాన్ని వదిలివెళ్లిపోయినా వారి ఆలోచనలనే మనం అనుసరిస్తున్నాం. ఇది దేశాభివృద్ధికి ప్రతిబంధకమా? ఈ ప్రశ్నకు సమాధానం సంతృప్తికరంగా రాయలేం. చివరి ప్రశ్న సైన్స్ అండ్ టెక్నాలజీపై ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ప్రశ్నకు సమాధానం రాశారు. శాస్త్ర, సాంకేతిక రంగ ప్రయోజనాలను నిత్య జీవితం నుంచి మొదలుపెట్టి ఏడు లేదా ఎనిమిది రంగాల్లో దేశాభివృద్ధి, రక్షణ, సైబర్ సెక్యూరిటీ ఇలా వివిధ రంగాల్లో దాని ఉపయోగాలను వివరిస్తే మంచి మార్కులు పొందొచ్చు. ఇందులో అభ్యర్థి సృజన, ఒరిజినాలిటీ, విషయపరిజ్ఞానం, మానసిక సంతులన, ఒక అంశాన్ని సర్వ కోణాల నుంచి దాని పర్యవసానాలను ఆలోచించి, విశ్లేషించి రాయగల నేర్పు పరిశీలిస్తారు. అభ్యర్థి తన అంతరంగాన్ని అక్షరీకరించి సమాధానం రాయాలి. తన జీవిత అనుభవాలను సొంతంగా రాయగలిగేలా ఉండాలి. విస్తృతమైన అధ్యయనం, సాహిత్యం, సహనం, పురాణాలు, సమకాలీన రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పట్టు ఉన్నవారు ఈ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయొచ్చు. జనరల్ ఇంగ్లిష్.. ఎంతో కష్టం.. అర్హత పరీక్షగా నిర్వహించే జనరల్ ఇంగ్లిష్ పేపర్ కఠినంగా ఉంది. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చదివినవాళ్లు కూడా ఆన్సర్ చేయలేరేమో అన్నంత కష్టంగా ఉంది. ఇంత కఠినంగా ఇవ్వడం వల్ల ప్రాంతీయ భాషల్లో సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులకు అశనిపాతంగా మారే ఆస్కారం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఇబ్బందికరమని నిపుణులు పేర్కొంటున్నారు. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని కఠినంగా ఇవ్వడం ద్వారా ఇంగ్లిష్‌పై తప్పనిసరిగా పట్టు సాధించాల్సిందేనని యూపీఎస్సీ స్పష్టం చేసిందని అంటున్నారు. కాబట్టి అభ్యర్థులు యూపీఎస్సీ మార్పులకనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది పరీక్షలు రాయనున్నవారు ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలా అయితేనే జనరల్ ఇంగ్లిష్ అనే హార్డిల్ను దాటగలరు. లేకుంటే సబ్జెక్టులపై ఎంత పట్టున్నా.. అర్హత పరీక్షగా నిర్దేశించిన ఇంగ్లిష్‌లోనే కనీస మార్కులు సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్ స్టడీస్ పేపర్-1 పేపర్-1లో హిస్టరీ నుంచి 14 ప్రశ్నల వరకు అడిగారు. ఒక్కొక్క ప్రశ్నకు పది మార్కులు. హిస్టరీ నుంచే 140 మార్కులు సాధించే అవకాశం ఉంది. పైగా ఈ పేపర్లోని ప్రశ్నలన్నీ తప్పనిసరిగా రాయాలి. ఛాయిస్ లేదు. ఈ ప్రశ్నలన్నీ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మాదిరిగా పది మార్కుల ప్రశ్నలే. ప్రశ్నల ప్రామాణికత విషయంలో తేడా ఉంది. ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక దృక్పథంలో చరిత్ర నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా: దేవాలయ వాస్తు కళా వికాసంలో చోళుల వాస్తు కళను అత్యున్నతమైన దశగా ఎందుకు భావిస్తారు? అని ఇచ్చారు. డల్హౌసీని ఆధునిక భారత నిర్మాతగా నిరూపించమని అడిగారు. ఈ ప్రశ్నల సరళిని బట్టి చూస్తే అభ్యర్థులు గతంలో మాదిరి హిస్టరీ విషయంలో సెలెక్టివ్ విధానాన్ని అనుసరించడం సాధ్యం కాదు. అణు విద్యుత్, చమురు, సహజవాయువుకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దానిపై ప్రశ్నలు అడిగారు. సదరన్ స్టేట్స్లో పంచదార మిల్లులు ఎక్కువగా ఉండటానికి, పత్తి, వస్త్ర పరిశ్రమలు వికేంద్రీకృతం కావడానికి గల కారణాలను విశ్లేషించండి? పశ్చిమ కనుమల్లో నదులు డెల్టాలను ఏర్పరచకపోవడానికి కారణాలేంటి? వంటి జాగ్రఫీ సంబంధిత ప్రశ్నలు అడిగారు. తూర్పు కోస్తా తీరంలో ఫైలిన్ సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా తుపానులకు ఎలా పేర్లు పెడతారు వివరించండి? వంటి ప్రశ్నల తీరును చూస్తే ప్రశ్నలన్నీ ప్రస్తుత వర్తమాన వ్యవహారాలపైనే ఉంటున్నాయి. చిన్నరాష్ట్రాలపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రాంతీయవాదం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. వివరించండి? ప్రపంచీకరణ భారతదేశంలో ఏజ్డ్ పాపులేషన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? భారతదేశంలో పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఎదురయ్యే సామాజిక సమస్యలను చర్చించండి? వంటి ప్రశ్నలు కూడా సమకాలీన పరిస్థితులపైనే ఉన్నాయి. జనరల్ స్టడీస్ పేపర్-2 పేపర్-2లో భాగంగా ఇచ్చిన ప్రశ్నలు ఎకానమీని బాగా అధ్యయనం చేసిన వారికి సులువుగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు చక్కని సమాధానం రాయాలంటే ఆర్థిక సంఘం, సెబీ, మధ్యాహ్న భోజన పథకం, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్‌డ పథకాలు, ఎలక్ట్రానిక్ నగదు బదిలీ, మిలీనియం వృద్ధి లక్ష్యాలు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, పురా, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులు, సూక్ష్మ రుణ సంస్థలు వంటి అంశాలపై అవగాహన అవసరం. ఆయా అంశాల పట్ల అవగాహనే కాకుండా వాటి పనితీరుకనుగుణంగా విమర్శనాత్మక పరిశీలన అధ్యయనం ఉండాలి. స్థానిక ప్రభుత్వాల ఫైనాన్‌సను పటిష్టపరిచే క్రమంలో 13వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇంతకుముందు సిఫార్సుల కంటే ఏ విధంగా భిన్నమైనవి అనే ప్రశ్నకు సమాధానం రాయాలంటే ఇచ్చిన అంశానికి సంబంధించి వివిధ ఆర్థిక సంఘాల సిఫార్సులను అధ్యయనం చేసి ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి మిలీనియం వృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు పాత్ర, విధులలో తేడా లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈ పేపర్లో ఎకానమీకి సంబంధించి పది ప్రశ్నలు ఉన్నాయి. 200 పదాల పరిమితి కలిగిన ప్రతి ప్రశ్నకు 10 మార్కులు నిర్దేశించారు. నిర్దేశిత సిలబస్‌లోనే ఉన్నందువల్ల ఈ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు ఇవ్వొచ్చు. అదేవిధంగా పాలిటీ విభాగంలో మనదేశానికి వివిధ దేశాలతో ఉన్న అంతర్జాతీయ సంబంధాలపై ప్రశ్నలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మాల్దీవుల్లో జరిగిన పరిణామాలు.. మన దేశంపై ప్రభావం/సంబంధం వంటి ప్రశ్నలు ఇచ్చారు. వీటితోపాటు ఎంత బలమైన లోక్‌పాల్ బిల్లు ఉన్నా అవినీతిని నియంత్రించలేకపోవచ్చు. చర్చించండి? 2014లో అప్ఘానిస్థాన్ నుంచి అంతర్జాతీయ బలగాలను ఉపసంహరించాలనుకుంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే ప్రశ్నలను చూస్తే ప్రశ్నలన్నీ లింక్ బేస్డ్గా ఉంటున్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గతంతో పోలిస్తే ఈ ఏడాది పేపర్-1 అంత కష్టంగా లేదు. రెండో పేపర్ గతంలో మాదిరిగానే సాధారణ స్థాయిలోనే ఉంది. అయితే చాలా ప్రశ్నలు అభ్యర్థులకు అర్థం కాకుండా ఉన్నాయి. ప్రశ్న అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. సమాధానం రాయడానికి అందుబాటులో ఉన్న సమయం అసలు సరిపోదు. ఇంగ్లిష్‌లో ప్రశ్న అర్థం కాకుంటే హిందీలో చదవడానికి ఇబ్బందే. ఉదాహరణకు పేపర్-1లో 1 ఏలో ఇచ్చిన ప్రశ్నలో స్పష్టత లేదు. అదేవిధంగా 1.ఇలో ఉన్న ప్రశ్న పూర్తిగా తప్పు. సివిల్స్ మెయిన్స్ రాసినవారిలో సగం మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్తోనే పరీక్ష రాశారు. మిగిలిన ఆప్షనల్స్‌తో పోలిస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కష్టంగా ఉంది. తెలుగు సాహిత్యం లాంటి కొన్ని ఆప్షనల్స్ ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా, సులువుగా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం బెటర్‌గానే ఉందని చెప్పొచ్చు. జాగ్రఫీ ఆప్షనల్ జాగ్రఫీలో 10, 15, 25 మార్కుల ప్రశ్నలు ఇచ్చారు. 30 మార్కుల ప్రశ్నలు ఇవ్వలేదు. గతంలో 30 మార్కుల ప్రశ్నలు ఉండేవి. ముఖ్యంగా ఫిజికల్ జాగ్రఫీ చాలా డెప్త్‌గా ఉంది. అభ్యర్థులకు కొంచెం కష్టంగా అనిపించింది. ఉదాహరణకు పేపర్-1లో స్థానిక పవనాలు ప్రాంత శీతోష్ణస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?, సీహెచ్‌సీలు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావానికి కారణమవుతాయి? ఉదాహరణలివ్వండి వంటి ప్రశ్నలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లో లేని కొన్ని ప్రశ్నలను కూడా ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు స్పష్టతతో లేవు. ప్రశ్నలన్నీ కూడా వివరించండి, విశ్లేషించండి, ఉదాహరణలివ్వండి, కారణాలేమిటి? ఇలా అభ్యర్థిలోని విషయ పరిజ్ఞానాన్ని, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేసేలా ఉన్నాయి. పేపర్-1లో ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి చట్టపరమైన చర్యలు ఏమి తీసుకున్నారు? అనే ప్రశ్నలో స్పష్టత లేదు. పేపర్-1 సెక్షన్-బీలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ప్రశ్నలన్నీ దాదాపు వర్తమాన వ్యవహారాలపైనే ఉన్నాయి. పేపర్-2 మాత్రం జనరల్ స్టడీస్ పేపర్లా ఉంది. మ్యాప్ పాయింటింగ్ సులువుగా ఇచ్చారు. దీన్ని 20 మార్కులకు రెండుగా (10 మార్కుల చొప్పున) విభజించి అడిగారు. ఇకపోతే ప్రశ్నలన్నీ ప్రస్తుత పరిణామాలపైనే ఉన్నాయి. సబ్జెక్టుపై పట్టు ఉన్నవారు సులువుగా రాయొచ్చు. పేపర్-1 జాగ్రఫీలో భాగంగా అడిగినప్రశ్నలన్నీ ఎక్కువ సమస్యలు, రీజనింగ్, లాజికల్, లింక్డ్గా ఉన్నాయి. వర్తమాన వ్యవహారాలపై అభ్యర్థి విశ్లేషణాత్మక శక్తిని పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. హిస్టరీ ఆప్షనల్ హిస్టరీ ఆప్షనల్ విషయంలోనూ ఈసారి కొన్ని మార్పులు ఉన్నాయి. వాటిని గుర్తిస్తే దానికనుగుణంగా ప్రిపరేషన్‌ను మార్చుకునే అవకాశముంటుంది. 250 మార్కుల చొప్పున రెండు పేపర్లుగా హిస్టరీ ఆప్షనల్ ఉంది. అందులో పేపర్-1లో కీలకంగా చెప్పుకోవాల్సింది మ్యాప్ పాయింటింగ్. దీనికి 50 మార్కులు కేటాయించారు. గతంలో ప్రదేశాల పేర్లు ఇచ్చి వాటిని మ్యాప్‌లో గుర్తించమనేవారు. అంతేకాకుండా మూడు నుంచి నాలుగు వాక్యాల వివరణ రాయాల్సి ఉండేది. ఈసారి పాయింట్లను గుర్తించిన మ్యాప్ ఇచ్చి, ఆ పాయింట్లో ఉండే ప్రాంతాన్ని కనుగొని, దానిపై వివరణ రాయమని అడిగారు. అయితే క్లూగా అది ఏ రకమైన ప్రాంతం అనే అంశాన్ని తెలిపారు. ఉదాహరణకు నియోలిథిక్ సైట్ అని, ఓడరేవు, ప్రీ హరప్పన్ స్థావరం అని ప్రతి పాయింట్‌కు క్లూ ఇచ్చారు. మ్యాప్ మీద, ఆయా ప్రదేశాల మీద పూర్తి అవగాహన ఉంటేనే సులువుగా వీటికి సమాధానం రాయొచ్చు. మిగిలిన ప్రశ్నల విషయానికొస్తే గత ఆప్షనల్ ప్రశ్నలకు, ఇప్పుడిచ్చిన ప్రశ్నలకు పెద్ద వ్యత్యాసం లేదు. ప్రశ్నలన్నీ అధికంగా రాజకీయేతర అంశాల నుంచి అడిగారు. అయితే ఏ ప్రశ్నకు రెడీమేడ్ సమాధానం లభించదు. ప్రశ్న సరళిని బట్టి అభ్యర్థి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రశ్నకనుగుణంగా మార్చి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రాచీన భారతదేశంలో బ్యాంకింగ్, వడ్డీ వ్యాపార విధానాన్ని సమకాలీన ఆధారాల సహాయంతో వివరించమని అడిగారు. అదేవిధంగా లిఖిత, శాసనాధారాలను దృష్టిలో ఉంచుకుని ప్రాచీన భారత దేశంలో భూ యాజమాన్యాన్ని సమీక్షించండి? అనే ప్రశ్న ఇచ్చారు. మొత్తం మీద చరిత్రలోని విభాగం ఏదైనా ప్రశ్నల తీరు దాదాపు ఇదే రీతిగా ఉంది. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు అధ్యయనం సమయంలోనే ఆయా అంశాలపై ప్రశ్నలు ఏవిధంగా అడిగే అవకాశముంటుందో కొంత మేరకు ఊహించాలి. దానికనుగుణంగా పరిపూర్ణంగా సిద్ధమైతే ప్రశ్నలు ఎలా వచ్చినా అప్పటికప్పుడే సమాధానాన్ని రాయొచ్చు. మొత్తం మీద ఈ కొత్త సిలబస్ హిస్టరీ ఆప్షనల్‌గా ఉన్న అభ్యర్థులకు చాలామందికి అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. గతేడాది కంటే ప్రశ్నల సంఖ్య పెరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి అభ్యర్థులకు సమయం సరిపోలేదు. ముందునుంచీ రైటింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్లు, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉన్నవారు మినహాయించి మిగిలినవారు పోటీలో వెనుకంజలో ఉన్నట్లే. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకొంటేనే విజయం సాధ్యం. జనరల్ స్టడీస్ పేపర్-3 జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకనమిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే అంశాలు ఉన్నాయి. వీటి నుంచి 25 ప్రశ్నలు అడిగారు. వీటిలో ఎకానమీ నుంచి 12 ప్రశ్నలు రాగా, మిగిలిన అంశాల నుంచి 13 ప్రశ్నలు ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, మేథోసంపత్తి హక్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రశ్నలన్నీ దాదాపు సమకాలీన అంశాలపైనే ఉండటం గమనార్హం. మేథో సంపత్తి హక్కులు అనే అంశంలో 1970 నాటి భారత పేటెంట్ చట్టానికి 2005లో జరిగిన సవరణలకు కారణాలు అడుగుతూనే నోవార్టిస్ ఫైల్ చేసిన పేటెంట్స్‌ను తిరస్కరించడంలో సుప్రీంకోర్టు ఈ సవరణను ఎలా ఉపయోగించుకుంది వివరించమని అడిగారు. అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ, క్రికెట్లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ మొదలైన వాటిని వివరించండి? వంటి ప్రశ్నలు ఇచ్చారు. సిలబస్‌లోని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో భాగంగా అక్రమ మైనింగ్ అంటే ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. ప్రస్తుత సమకాలీన అంశాల్లో మరొకటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. వాటి ద్వారా భద్రత ప్రభావాలపై ప్రశ్న కూడా ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా సైబర్ వార్ఫేర్ అనేది ఉగ్రవాదం కంటే ఏ విధంగా తీవ్రమైంది? భారత్ ఏ విధంగా దాని ప్రభావానికి గురవుతుందని, భారత్‌లో ఈ అంశానికి చెందిన సంసిద్ధత ఎలా ఉందని అని అడిగారు? దాదాపు ఇలా అన్ని ప్రశ్నలు సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నాయి. పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇచ్చిన రెండు ప్రశ్నలు వైద్య రంగానికి సంబంధించినవి. ఆ రెండు ప్రశ్నలు చాలా ఇన్‌డెప్త్‌గా, వైద్య రంగంలో అసాధారణమైన పట్టు ఉన్నవారు తప్పతే మిగిలినవారు ఆన్సర్ చేయలేనివిధంగా ఉన్నాయి. ప్రశ్నలన్నీ సమకాలీన సమస్యలపైన, అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ఉన్నాయి. ఇది మంచి ధోరణి. దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా గుర్తించాలి. అభ్యర్థి సమగ్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేసేలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఏ ఇబ్బంది లేకుండా జవాబులు ఇవ్వడానికి ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలతోపాటు దానితో ముడిపడి ఉన్న అన్ని సమకాలీన అంశాలు తెలిసి ఉండాలి. ఇందుకోసం దినపత్రికల్లో వచ్చే విశ్లేషకుల ఆర్టికల్స్ తప్పనిసరిగా చదవడం అలవాటు చేసుకోవాలి. జనరల్ స్టడీస్ పేపర్-3లో భాగంగా ఎకానమీకి సంబంధించి ఇచ్చిన ప్రశ్నలు వర్తమాన అంశాలకు అనుగుణంగా ఇచ్చారు. ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలకు జవాబు రాయాలంటే విద్యార్థులకు కాన్సెప్ట్ పట్ల అవగాహన తప్పనిసరి. ఇచ్చిన ప్రతి ప్రశ్నను వర్తమాన అంశాల ప్రాతిపదికగా జవాబు రాసినప్పుడు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. సిలబస్కనుగుణంగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం), సమ్మిళిత వృద్ధి, నూతన కంపెనీల బిల్లు 2013, పన్ను వ్యయం, ఆహార భద్రతా బిల్లు, వ్యవసాయ సబ్సిడీలు, పింక్ రివల్యూషన్, ప్రపంచీకరణ, భూ సంస్కరణలు, వ్యవసాయ ఉత్పాదకత, పేదరికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగం, వస్తు, సేవలపై పన్నులాంటి కాన్సెప్ట్‌ల ఆధారంగా ప్రశ్నలను రూపొందించారు. ప్రతి కాన్సెప్ట్‌ను ఈ పేపర్లో కూడా వర్తమాన అంశాలకు అన్వయించి ప్రశ్నగా రూపొందించారు. సిలబస్‌లో వివిధ కాన్సెప్ట్‌లను అధ్యయనం చేసే క్రమంలో వాటిని వివిధ అంశాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేసినవారికి ఈ ప్రశ్నలు కష్టం కావు. రాబోయే కాలంలో సివిల్స్ మెయిన్సకు హాజరయ్యే అభ్యర్థులు ఎకానమీని అధ్యయనం చేసే క్రమంలో కాన్సెప్ట్‌పై అవగాహనతో పాటు వాటిని వివిధ అంశాలకు అన్వయించుకుంటూ అధ్యయనం చేయాలి. ప్రతి ప్రశ్నకు సంబంధించిన జవాబు వాస్తవికతకు దగ్గరగా చూపించే క్రమంలో డేటాపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన జవాబును 200 పదాల పరిమితిలో పాటిస్తూ సమయ పరిమితిలోగా అన్ని ప్రశ్నలకు జవాబు రాసే విధంగా సంసిద్ధులు కావాలి. జనరల్ స్టడీస్ పేపర్-4 పేపర్-4లో మొత్తం 25 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 200 పదాలు రాయాలి. ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకొని, ఏం రాయాలో ఆలోచించుకుని, సమాధానాన్ని మనసులోనే రూపొందించుకుని ఆన్సర్ రాయాలి. ఒక్కో ప్రశ్నకు గరిష్టంగా ఏడు నిమిషాల సమయం మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎగ్జామినర్‌ను ఆకట్టుకునేలా సమాధానం రాయడం కత్తి మీద సామే. చాయిస్ కూడా లేదు. మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. జనరల్ స్టడీస్‌లో అన్ని పేపర్లకు చాలా మంది అభ్యర్థులు 10 నుంచి 15 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వగలిగారు! గతంలో మెయిన్స్ పరీక్ష ల్లో 200 పదాల ప్రశ్నకు జవాబు రాయడానికి 12 నిమిషాల సమయం లభిస్తే ఈసారి ఏడు నిమిషాల సమయం మాత్రమే లభించింది. ఇంత తక్కువ సమయంలో ప్రశ్నను అర్థం చేసుకుని, సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా సమాధానం రాయడం చాలా కష్టం. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీలో సెక్షన్ -ఏ, సెక్షన్-బీ అన్నీ కేస్ స్టడీస్. మొత్తం 250 మార్కుల పేపర్లో 150 మార్కులు కేస్ స్టడీల నుంచే ఉన్నాయి. అయితే సిలబస్‌లో ఉన్న ఏడు చాప్టర్లలో ఒక చాప్టర్‌కు మాత్రమే సగానికి పైగా వెయిటేజ్ ఇచ్చి, మిగిలినవాటికి ఇవ్వలేదు. ఇన్పుట్స్ జాగ్రఫీ: గురజాల శ్రీనివాసరావు జీఎస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్: డాక్టర్ బి.జె.బి.కృపాదానం. ఎస్సే: బి.కృష్ణారెడ్డి ఎకానమీ: తమ్మా కోటిరెడ్డి హిస్టరీ: యాకూబ్‌బాష సైన్స అండ్ టెక్నాలజీ: సి.హరికృష్ణ సివిల్స్ మెయిన్స్-2013 ప్రశ్నపత్రాలను www.sakshieducation.comలో చూడొచ్చు.