సివిల్స్ మెయిన్స్.. మెరిసేందుకు మార్గాలు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2017 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్ ఎగ్జామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. ప్రిలిమ్స్‌లో విజయం సాధించి మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు.. ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా ప్రిపరేషన్ సాగించి, విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. మెయిన్స్‌కు ఇంకా 82 రోజులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సక్సెస్ సాధించేందుకు విజేతలు, నిపుణుల సలహాలు, సూచనలు..
జీఎస్‌పై ప్రత్యేక దృష్టి
జనరల్ స్టడీస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ప్రిపరేషన్ సాగించడం ఎంతో మేలు చేస్తుంది. గత మెయిన్స్ జీఎస్ పేపర్లను విశ్లేషిస్తే.. ఒక అంశంపై అన్నికోణాల్లో నైపుణ్యం ఉంటేనే సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలను కూడా కోర్ అంశాలతో కలిపి అడిగే ధోరణి కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, తాజా పరిణామాలను పరిశీలిస్తూ.. వాటిని కోర్ సిలబస్‌తో అన్వయించుకుంటూ అధ్యయనం చేయాలి. పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకున్న వారికి సైతం ఈ తరహా ప్రిపరేషన్ ఎంతో కలిసొస్తుంది. అభ్యర్థులు సెప్టెంబర్ చివరినాటికి ప్రిపరేషన్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయాన్ని రివిజన్‌కు కేటాయించాలి. పరీక్షకు ముందు వారం రోజుల్లో జనరల్ ఎస్సే, జీఎస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు చేస్తుంది.
– వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ.
విశ్లేషణ సామర్థ్యం
మెయిన్స్‌కు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. జనరల్ స్టడీస్‌లోని ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ పేపర్‌కు సంబంధించిన ప్రశ్నలకు.. ఒక సివిల్ సర్వీస్ అధికారికి ఉండాల్సిన పాలనా దక్షతను ప్రతిబింబించేలా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
– ఆర్.సి.రెడ్డి, డైరెక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ..
అభ్యర్థులు అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించడం వల్ల కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అడిగే ఎస్సే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా రాసే సామర్థ్యం లభిస్తుంది. జీఎస్ పేపర్లు, ఆప్షనల్ పేపర్‌కు అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక అంశాన్ని విశ్లేషించగలిగే నైపుణ్యం కూడా సొంతం చేసుకోవాలి. ఆప్షనల్ పేపర్‌కు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా సిలబస్‌ను, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? వాటి ద్వారా ఎలాంటి నైపుణ్యాలను పరీక్షిస్తున్నారు? అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్‌ను మలచుకోవాలి.
– శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ.
ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత
సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత చెదరకుండా చదవడాన్ని అలవరచుకోవాలి. సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ కొనసాగించాలి. రోజూ ఆయా సబ్జెక్టులను చదివే సమయంలో.. ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. సబ్జెక్టుకు సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ చదువుతూ.. ముఖ్యమైన పాయింట్లను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఇది రివిజన్ సమయంలో టైమ్ మేనేజ్‌మెంట్ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది. కాంటెంపరరీ అంశాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని కోర్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. తద్వారా జనరల్ స్టడీస్ పేపర్లకు అత్యున్నతంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. రోజూ అన్ని పేపర్లకు సంబంధించిన సబ్జెక్టులను చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
– ఎం.మనుచౌదరి, సివిల్స్–2016
విజేత (36వ ర్యాంకు).
కాన్సెప్ట్ ఓరియెంటేషన్
ప్రిపరేషన్‌లో భాగంగా సిలబస్‌లోని అంశాలకు సంబంధించి బేసిక్స్, కాన్సెప్ట్స్, నేపథ్యంపై తొలుత అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే విషయంలో ఈ దృక్పథం ఎంతో అవసరం. జనరల్ ఎస్సే.. కోర్, కాంటెంపరరీ అంశాల సమ్మిళితంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రిపరేషన్ సమయంలోనే రివిజన్‌కు ఉపకరించే విధంగా షార్ట్ నోట్స్, పాయింటర్స్, గ్రాఫికల్ మెథడ్స్ వంటి షార్ట్‌కట్ టూల్స్‌ను అనుసరించాలి.
– పి.అన్వేష రెడ్డి, సివిల్స్–2016, 80వ ర్యాంకు.
రైటింగ్ ప్రాక్టీస్ కీలకం
సివిల్స్ మెయిన్స్‌లో సమాధానాల ప్రజెంటేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుబాటులో ఉన్న వ్యవధిలోనే సదరు ప్రశ్నకు సంబంధించి ముఖ్యాంశాలను రాయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు రోజూ ప్రిపరేషన్‌తోపాటు రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇది శాస్త్రీయంగా ఉండాలి. నిపుణులు రూపొందించిన ఒక ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసుకుని మూడు గంటల వ్యవధిలో సొంతంగా సమాధానాలు రాయాలి. ఫలితంగా టైం మేనేజ్‌మెంట్‌పై అవగాహన ఏర్పడుతుంది. మెరుగుపరచుకోవాల్సిన అంశాలేంటనే దానిపైనా స్పష్టత ఏర్పడుతుంది. రోజూ ఒక మాక్‌టెస్ట్‌కు 3 గంటలు కేటాయించడం కష్టం కాబట్టి, కనీసం ఒక పేపర్‌కు సంబంధించి ఆ రోజు చదివిన అంశానికి చెందిన ప్రశ్నకు పరీక్షలో లభించే సమయం లోపు సమాధానాలు రాసి, స్వీయ విశ్లేషణ చేసుకోవాలి.
– పవన్ సమీర్, సివిల్స్–2016 విజేత
(142వ ర్యాంకు).
ఆప్షనల్‌కు ప్రత్యేక సమయం
మెయిన్స్‌కు ప్రిపరేషన్‌లో ఆప్షనల్ సబ్జెక్టుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం చాలా అవసరం. అకడమిక్ నేపథ్యానికి సంబంధం లేని ఆప్షనల్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. ముందుగా సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. వాటిలో తమకు అనుకూలంగా, సులువుగా ఉండే అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. అంతేకాకుండా ఆప్షనల్‌కు సంబంధించిన అంశాలను సమకాలీన అంశాలతో సమ్మిళితం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. కొన్ని ఆప్షనల్స్ సిలబస్ కొంత విస్తృతంగా ఉంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా సదరు ఆప్షనల్‌కు సంబంధించి అధిక వెయిటేజీ లభిస్తున్న అంశాలను గుర్తించవచ్చు. వీటికి కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి, ప్రిపరేషన్ కొనసాగించడం మేలు చేస్తుంది.
– ఎస్.మాధవి, సివిల్స్–2016, 104వ ర్యాంకు.