సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్–1 పరీక్షల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తరహా కామన్ సిలబస్‌ను అమలు చేయనున్నారు. దీనిపై ఏపీపీఎస్సీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ కామన్ సిలబస్‌లో 70% యూపీఎస్సీతో సమానమైన అంశాలుంటాయి. మిగిలిన 30% రాష్ట్రానికి సంబంధించిన స్థానిక అంశాలు ఉంటాయి.
అభ్యర్థులపై తగ్గనున్న ఒత్తిడి
కేంద్ర సివిల్ సర్వీసుల విధులతో సమాన విధులుండే గ్రూప్–1 పోస్టుల భర్తీకి అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఒకే తరహా సిలబస్‌ను అనుసరించాలన్న దానిపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. 2017లో షిల్లాంగ్‌లో రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అధ్యక్షుల జాతీయ సమావేశం స్టాండింగ్ కమిటీలో సివిల్ సర్వీసు నియామకాల పోటీ పరీక్షల్లో ఉమ్మడి పాఠ్యప్రణాళిక కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ ఏడాది జనవరిలో నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం.. ఆయా రాష్ట్రాలు తమ సిలబస్‌లో 70 శాతాన్ని కామన్ సిలబస్‌కు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం సిలబస్‌ను తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలతో రూపొందించుకోవచ్చు. ఉమ్మడి పాఠ్య ప్రణాళిక వల్ల అభ్యర్థులకు మేలు జరగనుంది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలతోపాటు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలకు వేర్వేరు పాఠ్యాంశాలు చదవాల్సిన అవసరం ఉండదు.
యూపీఎస్సీ కమిటీ సిఫార్సులు...
సివిల్ సర్వీసులకు (రాష్ట్రాల గ్రూప్–1, గ్రూప్–2 సర్వీసులు) సంబంధించి ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉండాలని, మెయిన్స్‌లో ఆరు అంశాలపై పేపర్లుండాలని యూపీఎస్సీ కమిటీ సూచించింది. ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్‌లో రెండు పేపర్లు ఉండాలి. అందులో ఒకదానిలో చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక, న్యాయ, అంతర్జాతీయ సంబంధాలు, మెంటల్ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు వేయాలి. రెండో పేపరులో భారత ఆర్థిక వ్యవస్థ, ప్లానింగ్, భౌగోళిక శాస్త్రం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన విషయాలపై ప్రశ్నలు సంధించాలి.
సివిల్స్ మెయిన్ పరీక్షలో...
సివిల్ సర్వీస్ మెయిన్ పరీక్షలో ప్రస్తుతం జనరల్ ఇంగ్లిష్‌తోపాటు ఐదు అంశాలపై ఐదు పేపర్లు ఉన్నాయి. యూపీఎస్సీ కమిటీ సిఫార్సుల ప్రకారం జనరల్ ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషకు సంబంధించి ఒక పేపర్ ఉండాలి. వీటితోపాటు వ్యాసం(ఎస్సే)లో ఒక పేపర్, సామాన్య అధ్యయనానికి సంబంధించి మూడు పేపర్లు ఉండాలి. మొత్తం ఆరు పేపర్లను ఒక్కో దానికి 150 చొప్పున 900 మార్కులకు నిర్వహించాలి. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండాలి. మొత్తం 1,000 మార్కులకు మెయిన్స్ రాతపరీక్ష నిర్వహించాలి.
ఈ పరీక్షలో ఐచ్ఛికం(చాయిస్) ఉండదు, అన్ని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయాలి. ఎస్సే పేపర్‌లో వర్తమాన, సామాజిక, రాజకీయ అంశాలు, సామాజిక, ఆర్థిక విషయాలు, సామాజిక పర్యావరణ విషయాలు, సాంస్కృతిక చారిత్రక విషయాలు, సామాజిక స్పృహ తదితర అంశాలుండాలి. ఆంగ్లం, ప్రాంతీయ భాషా, ఎస్సే పేపర్లు కాకుండా మిగతా మూడు పేపర్లలో ఒకదానిలో భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, భౌగోళిక శాస్త్రం ఉంటాయి. రెండో పేపర్‌లో భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, ప్రభుత్వ పరిపాలన, పౌరసేవల్లో నైతిక విలువలు ఉంటాయి. ఇక మూడో పేపర్‌లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన విషయాలు ఉంటాయి.
30 శాతం మార్పులు చేస్తే చాలు
ఏపీపీఎస్సీ ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రూప్–1 సిలబస్‌కు, యూపీఎస్సీ ప్రతిపాదిత ఉమ్మడి సిలబస్‌కు మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. కామన్ సిలబస్‌లోని అన్ని అంశాలు ఏపీపీఎస్సీ గ్రూప్–1 సిలబస్‌లోని అంశాలు దాదాపు సమానంగానే ఉన్నాయి. ఉమ్మడి సిలబస్‌లో పేర్కొన్న రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇవి 20 శాతం నుంచి 30 శాతం వరకు ఉండొచ్చని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీపీఎస్సీ నియమించిన నిపుణుల కమిటీ ప్రస్తుతం దీనిపై కసరత్తు చేస్తోంది. ఈ నిపుణుల కమిటీ ప్రాథమిక సూచనల ప్రకారం మార్పులు ఇలా ఉండొచ్చు.
- ప్రిలిమినరీ పరీక్షను ప్రస్తుతం ఒకే పేపర్‌గా నిర్వహిస్తుండగా ఇకపై దాన్ని రెండు పేపర్లతో నిర్వహిస్తారు. పాఠ్యప్రణాళికలో పెద్దగా మార్పులుండవు. మెయిన్స్‌లోని గణాంక విశ్లేషణ పరీక్షలోని అంశాలు ప్రిలిమినరీ పేపర్‌లో చేరుతాయి.
- కామన్ సిలబస్‌లో ఇంగ్లిష్, ప్రాంతీయ భాషలు, సబ్జెక్టులకు సంబంధించి 4 పేపర్లను కలిపి మొత్తం 900 మార్కులకు నిర్వహించాలని, ఈ మార్కుల నుంచి మెరిట్‌ను తీసుకోవాలని యూపీఎస్సీ కమిటీ సూచించింది. ప్రస్తుతం గ్రూప్–1 మెయిన్స్‌లో ఇంగ్లిష్(అర్హత పేపర్)తోపాటు 5 ఇతర పేపర్లు ఉన్నాయి. కామన్ సిలబస్ ప్రకారం ఇంగ్లిష్‌తోపాటు తెలుగును కూడా జోడించి క్వాలిఫై పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 5 పేపర్లను యధాతథంగా కొనసాగించాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. మెరిట్‌ను నిర్ణయించడానికి ఈ ఐదు పేపర్ల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇకపై విడుదల చేయనున్న గ్రూప్–1 నోటిఫికేషన్ల నుంచే కామన్ సిలబస్‌ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది.
గ్రూప్–1లో ఉమ్మడి సిలబస్
Published Sat, May 12 2018 4:53 AM | Last Updated on Sat, May 12 2018 4:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment