సివిల్స్ మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేరకు?
సివిల్స్ మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేరకు ఉంటుందో తెలపండి?
- ప్రవళిక, ఫిల్మ్‌నగర్
కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : మారిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతో ఉంది. చాలామంది అభ్యర్థులకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉన్నా ఇంగ్లిష్ రాకపోవడం వల్ల మార్కులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన విద్యార్థులు ఈ అంశంలో వెనుకంజలో ఉంటున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అభ్యర్థులకు హిందీలో లేదంటే ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంటుంది. కాబట్టి చక్కటి ఇంగ్లిష్ రావడానికి రోజూ హిందూ దినపత్రికను చదవడంతోపాటు లోక్‌సభ, రాజ్యసభ, బీబీసీ, ఎన్‌డీటీవీ వంటి న్యూస్ చానెళ్లను రోజూ అరగంట సేపైనా చూడాలి. ఆల్ ఇండియా రేడియోను కూడా వినొచ్చు. వీటిల్లో మంచి ఉచ్ఛారణతో కూడిన ఇంగ్లిష్ ఉంటుంది. అంతేకాకుండా వివిధ అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రిపరేషన్ కోణంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది.
సివిల్స్ మెయిన్స్‌లో పాపులర్ ఆప్షన్స్ ఏవి?
- భువన, సనత్‌నగర్
మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి మూడు గంటలు. జాతీయస్థాయిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగా పాపులర్ అని చెప్పొచ్చు. ఇవేకాకుండా హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, ఆంత్రోపాలజీ వంటి సబ్జెక్టులను ఎక్కువమంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. కోచింగ్ సదుపాయం అందుబాటులో ఉండటంతోపాటు కొన్ని సబ్జెక్టుల సిలబస్ తక్కువ ఉండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాల విద్యార్థులు తమ మాతృభాషల సాహిత్యాన్ని ఎంచుకుని కూడా పరీక్షలు రాస్తున్నారు.
మన రాష్ట్ర విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుంటున్నారు. ఆప్షనల్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. మారిన విధానంలో చాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్న లో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా, కూలంకషంగా అధ్యయనం చేయాలి.
ఇన్‌పుట్స్: డా.జె.బి.కృపాదానం,
సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
సివిల్స్ 2013 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్, జీకేలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి? - కె.రమేశ్, మెహదీపట్నం
సివిల్స్-2013 ప్రిలిమ్స్‌లో కరెంటు అఫైర్స్, స్టాండర్డ్ జీకేలకు ప్రాధాన్యం బాగా తగ్గింది. ఈ విభాగాల నుంచి ఒకట్రెండు ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. మొత్తంమీద చూస్తే పేపర్-1 గతంతో పోలిస్తే తేలిగ్గా ఉంది. పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో రీడింగ్ కాంప్రెహెన్షన్ పరిధిని తగ్గించి బేసిక్ న్యూమరసీ విభాగం నుంచి ప్రశ్నల సంఖ్యను పెంచారు. మొత్తంగా ఈ పేపర్ మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. పేపర్-1లో 100 ప్రశ్నలు, 200 మార్కులకు ఇచ్చారు. అలాగే పేపర్-1లో హిస్టరీ నుంచి 15 ప్రశ్నలు, పాలిటీ 19, జాగ్రఫీ, ఎకాలజీల నుంచి 27, సైన్స్ 21, ఎకానమీ నుంచి 18 ప్రశ్నలు వచ్చాయి.
సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్ 1లో సైన్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో తెలపండి?
- పి.సుదర్శన్, ఉస్మానియా యూనివర్సిటీ
ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు తేలిగ్గా సమాధానాలు గుర్తించేవిగా ఉన్నాయి. ప్రాథమిక అంశాలపైన ఎక్కువగా అడిగారు. ఫ్రిక్షన్, ఆప్టికల్ ఇల్యూజన్, రెయిన్‌బో తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. సమకాలీన అంశమైన హిగ్స్ బోసన్ పార్టికల్‌పై ప్రశ్న వచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం గుర్తించగలిగేలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
Ex: Ball bearings are used in bicycles, cars, etc., because
a) the actual area of contact between the wheel and axle is increased
b) the effective area of contact between wheel and axle is decreased
c) the effective area of contact between the wheel and axle is increased
d) None of the above statements is correct
జవాబు: c
సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి ప్రశ్నలు దాదాపు కనుమరుగయ్యాయి. బయాలజీ విభాగం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. కాన్సెప్ట్‌లపై పట్టున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించగలిగేలా ఉన్నాయి.
- ఇన్‌పుట్స్: ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి,
సి.హరికృష్ణ,
సి.హెచ్.మోహన్,
సీనియర్ ఫ్యాకల్టీ