చిన్నతనంలోనే ఉన్నత లక్ష్యం పెట్టుకున్నాడు. అకుంఠిత దీక్షతో ప్రణాళికాబద్ధంగా చదివాడు. చివరికి అనుకున్నది సాధించాడు.. సిక్కోలు కుర్రాడు కమల్ సుహాస్. దీక్ష, పట్టుదల ఉంటే ఎంత కష్టమైనా సాధించవచ్చని నిరూపిస్తూ అత్యంత కఠినమైన ఎన్డీయేలో మూడేళ్ల కఠోర శిక్షణను పూర్తి చేసి భారత సైన్యంలో నేరుగా లెఫ్టినెంట్ అధికారి హోదాలో సేవలకు సిద్ధమై జిల్లా కీర్తిని ఇనుమడింప జేశాడు.
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడీ కుర్రాడు. ఆర్మీపై బాల్యం నుంచే ప్రేమను పెంచుకున్న సిక్కోలు యువకుడు మునుకోటి కమల్ సుహాస్ తన కలల కొలువును కష్టపడి సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు అకుంఠితమైన దీక్ష, పట్టుదలకు నిరంతర సాధన తోడుగా లక్ష్యాన్ని ఛేదించాడు. సైనిక్ స్కూల్‌లో చేరి అటు చదువుతోపాటు ఇటు ఆర్మీ సన్నద్ధతపై ప్రత్యేకంగా దృష్టిసారించాడు. యూపీఎస్సీ ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలో ఆలిండియా 202 ర్యాంకు సాధించి శభాష్ అనిపించాడు. ఎయిర్‌ఫోర్స్ అవకాశాన్ని వదులకుని ఆర్మీని తన ఛాయిస్‌గా ఎంచుకున్న సిక్కోలు తేజం మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుని పోస్టింగ్‌కు సిద్ధమయ్యాడు. కమల్ సుహాస్ తన 20 ఏళ్ల ప్రాయంలోనే.. 2023 జనవరి 5వ తేదీన డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలటరీ అకాడమీలో ఆర్మీ లెఫ్టినెంట్ హాదాలో విధుల్లో చేరనున్నాడు.
ఇల్లిసిపురం నుంచి డెహ్రాడూన్ వరకు..
శ్రీకాకుళం నగరంలోని ఇల్లిసుపురంలోని భద్రమ్మగుడి సమీపంలోని నివాసం ఉంటున్న మునుకోటి ఉమాశంకర్, మాధవి దంపతుల కుమారుడు కమల్ సుహాస్. తండ్రి ఉమాశంకర్ పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్ హోదాలో శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తుండగా, తల్లి మాధవి వ్యాపారం చేస్తున్నారు. కమల్ అక్క హర్షిత అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు. చిరుప్రాయంలోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కమల్ అందుకు సైనిక్ స్కూల్ దోహదపడుతుందని భావించి ప్రవేశ పరీక్ష రాశాడు. టాప్ మార్కులు సాధించి విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో 6వ తరగతిలో చేరాడు. అక్కడ సీబీఎస్సీ సిలబస్‌తో 6వ తరగతి నుంచి +12(ఇంటర్) వరకు చదువుకున్నాడు. అదే సమయంలో ఆర్మీపై ప్రత్యేకంగా దృష్టిసారించిన కమల్ పోటీపరీక్షలకు సైతం సన్నద్ధమయ్యాడు. చదువులోను టాపర్‌గా నిలుస్తూ వచ్చాడు. 10వ తరగతిలో 98 శాతం ఉత్తీర్ణతను సాధించిన కమల్ +12లోను 98 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్‌లో 100 మార్కులు సాధించి శభాష్ అనిపించాడు.
ఎన్‌డీఏ పరీక్షలో బెస్ట్ ర్యాంకు సాధించి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్ష 2019లో జరిగింది. ఆలిండియా స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షలో మునుకోటి కమల్ సుహాస్ 202వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచాడు. అయితే త్రివిధ దళాలను ఎంచుకునే క్రమంలో కమల్‌కు ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా అవకాశం లభించినప్పటికీ.. తన చిరకాల కోరికైన ఆర్మీనే తన బెస్ట్ ఛాయిస్‌గా ఎంచుకున్నాడు. అనంతరం పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్లపాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కమల్ సుహాస్ పోస్టింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు. 2023 జనవరి 5వ తేదీన డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరనున్నాడు.
చిన్ననాటి కల నెరవేర్చుకున్నాడు..
ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరనున్న కుమారుడి తల్లిదండ్రులుగా మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. చాలా గర్వంగా ఉంది. మా కుమారుడు చిన్నప్పుడే దేశానికి సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇండియన్ ఆర్మీ వాడి కల. అందుకోసం సైనిక్ స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే యూపీఎస్సీ ఎన్‌డీఏ పరీక్షకు సన్నద్ధమై అని విభాగాల్లో మెరిట్ సాధించాడు. వచ్చేనెల 5వ తేదీన విధుల్లో చేరబోతున్నాడు. దేశ రక్షణలో మమేకం అవ్వబోతున్నాడు.
– మునుకోటి కమల్ సుహాస్ తల్లిదండ్రులు ఉమాశంకర్, మాధవి
అభినందించిన కలెక్టర్..
సోమవారం మునుకోటి కమల్ సుహాస్‌ను కలె క్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ ఆర్మీలో సిపాయిలతోపాటు ఉన్నతస్థాయి హోదాలో ఉద్యోగం చేసే అవకాశం సిక్కోలు సొంతం చేసుకోవడం జిల్లాకు గర్వకారణంగా ఉందని కలెక్టర్ అభినందించారు. అలాగే నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ కె.వెంకట్ ఉజ్వల్, సెట్‌శ్రీ సీఈఓ బీవీ ప్రసాదరావు, ఎన్‌సీసీ అధికారులు, స్థానిక డిఫెన్స్ అకాడమీ సంస్థల ప్రతినిధులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment