పోలాకి: ఉపాధికోసం మధ్యవర్తిని నమ్మి మలేసియా వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకార యువకులు ఎనిమిదిమంది అక్కడ మోసపోయి తిరిగిరాలేక అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి వారి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు..
పోలాకి మండలం గుప్పెడుపేటకు చెందిన రట్టి యర్రయ్య, నందుపల్లి యల్లయ్య, నందుపల్లి దుర్గయ్య, నందుపల్లి చిన్నారావు, బుడగట్ల లక్ష్మయ్య, సంతబొమ్మాళి మండలం సంధిపేటకు చెందిన బొంగు జయరాం, పప్పల లోకేశ్వరరావు, కుత్తుమ సంతోష్‌కుమార్ చెన్నైకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా చెరో రూ.70 వేలు చెల్లించి ఫిబ్రవరి 12న మలేసియా వెళ్లారు. వారికి అక్కడ నెగిరిసెంబిలన్ ప్రాంతంలో ఆల్-సాలెమ్-మజు రెస్టారెంట్‌లో పని అప్పగించారు. ఆ తరువాత మధ్యవర్తి, అక్కడికి తీసుకెళ్లిన కన్సెల్టెన్సీవారు కనిపించకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన యువకులు ఇక్కడి కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. విపరీతమైన పని ఒత్తిడి, కంటిమీద కునుకు, కడుపు నిండా తిండిలేవంటూ అక్కడ పడుతున్న బాధలు వివరించారు.
దీనిపై ఆ మత్స్యకార యువకుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నెలరోజుల కిందట మలేసియాలో చిక్కుకున్న యువకులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎంపీలతో పాటు కొందరు నాయకులను కలసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వారు వాపోతున్నారు. వారు బుధవారం పోలాకి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి తమవారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిపై తహశీల్దార్ జెన్ని రామారావు మాట్లాడుతూ కుటుంబసభ్యుల వివరాలు, బాధితుల పాస్‌పోర్ట్, వీసా, ఆధార్ కార్డులు తదితర నకళ్లతో కూడిన సమగ్ర సమాచారం సేకరించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.
మలేసియాలో చిక్కుకున్న సిక్కోలు యువకులు
Published Thu, May 14 2015 7:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement