sikkolu youth
-
సిక్కోలు కుర్రాడు.. కలల కొలువు సాధించాడు ఇలా..
చిన్నతనంలోనే ఉన్నత లక్ష్యం పెట్టుకున్నాడు. అకుంఠిత దీక్షతో ప్రణాళికాబద్ధంగా చదివాడు. చివరికి అనుకున్నది సాధించాడు.. సిక్కోలు కుర్రాడు కమల్ సుహాస్. దీక్ష, పట్టుదల ఉంటే ఎంత కష్టమైనా సాధించవచ్చని నిరూపిస్తూ అత్యంత కఠినమైన ఎన్డీయేలో మూడేళ్ల కఠోర శిక్షణను పూర్తి చేసి భారత సైన్యంలో నేరుగా లెఫ్టినెంట్ అధికారి హోదాలో సేవలకు సిద్ధమై జిల్లా కీర్తిని ఇనుమడింప జేశాడు. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడీ కుర్రాడు. ఆర్మీపై బాల్యం నుంచే ప్రేమను పెంచుకున్న సిక్కోలు యువకుడు మునుకోటి కమల్ సుహాస్ తన కలల కొలువును కష్టపడి సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు అకుంఠితమైన దీక్ష, పట్టుదలకు నిరంతర సాధన తోడుగా లక్ష్యాన్ని ఛేదించాడు. సైనిక్ స్కూల్లో చేరి అటు చదువుతోపాటు ఇటు ఆర్మీ సన్నద్ధతపై ప్రత్యేకంగా దృష్టిసారించాడు. యూపీఎస్సీ ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో ఆలిండియా 202 ర్యాంకు సాధించి శభాష్ అనిపించాడు. ఎయిర్‌ఫోర్స్ అవకాశాన్ని వదులకుని ఆర్మీని తన ఛాయిస్‌గా ఎంచుకున్న సిక్కోలు తేజం మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుని పోస్టింగ్‌కు సిద్ధమయ్యాడు. కమల్ సుహాస్ తన 20 ఏళ్ల ప్రాయంలోనే.. 2023 జనవరి 5వ తేదీన డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలటరీ అకాడమీలో ఆర్మీ లెఫ్టినెంట్ హాదాలో విధుల్లో చేరనున్నాడు. ఇల్లిసిపురం నుంచి డెహ్రాడూన్ వరకు.. శ్రీకాకుళం నగరంలోని ఇల్లిసుపురంలోని భద్రమ్మగుడి సమీపంలోని నివాసం ఉంటున్న మునుకోటి ఉమాశంకర్, మాధవి దంపతుల కుమారుడు కమల్ సుహాస్. తండ్రి ఉమాశంకర్ పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్ హోదాలో శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తుండగా, తల్లి మాధవి వ్యాపారం చేస్తున్నారు. కమల్ అక్క హర్షిత అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు. చిరుప్రాయంలోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కమల్ అందుకు సైనిక్ స్కూల్ దోహదపడుతుందని భావించి ప్రవేశ పరీక్ష రాశాడు. టాప్ మార్కులు సాధించి విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 6వ తరగతిలో చేరాడు. అక్కడ సీబీఎస్సీ సిలబస్‌తో 6వ తరగతి నుంచి +12(ఇంటర్) వరకు చదువుకున్నాడు. అదే సమయంలో ఆర్మీపై ప్రత్యేకంగా దృష్టిసారించిన కమల్ పోటీపరీక్షలకు సైతం సన్నద్ధమయ్యాడు. చదువులోను టాపర్‌గా నిలుస్తూ వచ్చాడు. 10వ తరగతిలో 98 శాతం ఉత్తీర్ణతను సాధించిన కమల్ +12లోను 98 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్‌లో 100 మార్కులు సాధించి శభాష్ అనిపించాడు. ఎన్డీఏ పరీక్షలో బెస్ట్ ర్యాంకు సాధించి.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష 2019లో జరిగింది. ఆలిండియా స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షలో మునుకోటి కమల్ సుహాస్ 202వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచాడు. అయితే త్రివిధ దళాలను ఎంచుకునే క్రమంలో కమల్‌కు ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా అవకాశం లభించినప్పటికీ.. తన చిరకాల కోరికైన ఆర్మీనే తన బెస్ట్ ఛాయిస్‌గా ఎంచుకున్నాడు. అనంతరం పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్లపాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కమల్ సుహాస్ పోస్టింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు. 2023 జనవరి 5వ తేదీన డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరనున్నాడు. చిన్ననాటి కల నెరవేర్చుకున్నాడు.. ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరనున్న కుమారుడి తల్లిదండ్రులుగా మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. చాలా గర్వంగా ఉంది. మా కుమారుడు చిన్నప్పుడే దేశానికి సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇండియన్ ఆర్మీ వాడి కల. అందుకోసం సైనిక్ స్కూల్లో చదువుతున్న సమయంలోనే యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమై అని విభాగాల్లో మెరిట్ సాధించాడు. వచ్చేనెల 5వ తేదీన విధుల్లో చేరబోతున్నాడు. దేశ రక్షణలో మమేకం అవ్వబోతున్నాడు. – మునుకోటి కమల్ సుహాస్ తల్లిదండ్రులు ఉమాశంకర్, మాధవి అభినందించిన కలెక్టర్.. సోమవారం మునుకోటి కమల్ సుహాస్‌ను కలె క్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ ఆర్మీలో సిపాయిలతోపాటు ఉన్నతస్థాయి హోదాలో ఉద్యోగం చేసే అవకాశం సిక్కోలు సొంతం చేసుకోవడం జిల్లాకు గర్వకారణంగా ఉందని కలెక్టర్ అభినందించారు. అలాగే నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ కె.వెంకట్ ఉజ్వల్, సెట్‌శ్రీ సీఈఓ బీవీ ప్రసాదరావు, ఎన్సీసీ అధికారులు, స్థానిక డిఫెన్స్ అకాడమీ సంస్థల ప్రతినిధులు అభినందించారు. -
నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్‌లో.. సిక్కోలు కుర్రాడి ప్రతిభ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సిక్కోలు యువకుడు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్‌లో ఓ బృందానికి ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభ చాటారు. సుదూర గ్రహాలు, ఉపగ్రహాల ఉపరితలాలపై ఖనిజాలను ఎలా సమకూర్చుకోవాలి? వెనక్కి ఎలా తీసుకోవాలి? అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎలా దోహదపడతాయి? అన్న అంశాలపై వర్చువల్ విధానంలో రోబోటిక్ సాప్ట్వేర్ తయారీపై నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్ సంస్థ పోటీ నిర్వహించింది. ఈ చాలెంజ్‌లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్ ప్రాతినిధ్యం వహించిన బృందం విశ్వవిజేతగా నిలిచింది. ఈ బృందంలో అలెంసాండ్రో డిఫవా, వెక్టర్ లోపెజ్, డేవిడ్ ఫెర్నాండెజ్ లోపెజ్, ఫియర్ ఫెర్న్బాచ్, లూకా మర్కియాని, ఆద్రియా రోయజ్ మొరెనో, నాసిన్ మిగేల్ బాన్యోస్ సభ్యులుగా ఉన్నారు. విజేతగా నిలిచిన వీరు రూ.1.30 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. సాయికిశోర్ ప్రస్తుతం స్పెయిన్‌లో పాల్ రోబోటిక్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన సహోద్యోగులతో కలిసి ఒలంపస్ మోన్స్ బృందంగా ఏర్పడి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. 114 బృందాలను అధిగమించి.. మల్టీ–రోబో బృందం అంతరిక్షంలోకి వెళ్లాక ఎలా పనిచేయాలి? ఎంత త్వరగా ఖనిజాన్ని సేకరించాలి? జీపీఎస్ వ్యవస్థ లేకుండా మొత్తం పనిచేసి, తిరిగి లొకేషన్‌కు వచ్చేలా ఈ బృందం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ప్రకారం.. చంద్రునిపై ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో ఒక రోబో వెతుకుతుంది.. ఇంకొకటి లొకేషన్‌కు వెళ్లి ఖనిజాలను తవ్వి, ఇంకో రోబో మీద మినరల్ వేస్తుంది.. లోడ్ చేసిన రోబో హోమ్ బేస్ లొకేషన్‌కు వచ్చి అన్లోడింగ్ చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా 114 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో 22 బృందాలు ఫైనల్‌కు వచ్చాయి. తుది పోరులో స్పెయిన్‌కు చెందిన ఒలంపస్ మోన్స్ బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పోటీలో నాసా ఇన్నోవేషన్ అవార్డు కూడా చేజిక్కించుకుంది. ఈ బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్ సభ్యుడిగా ఉండటం రాష్ట్రానికి గర్వకారణం. రెండేళ్లు కష్టపడ్డాం ఈ ఛాలెంజ్ కోసం మేం రెండేళ్లు కష్టపడ్డాం. ఇందులో స్కౌట్స్ అనే రకం రోబో మినరల్‌ను వెతుకుతుంది. ఎక్స్కవేటర్ అనే రోబో తవ్వకాలు చేసి, హౌలర్ అనే రోబోలో లోడింగ్ చేస్తుంది. మంచు, నీరు, అమ్మోనియా, కార్బన్ డై ఆక్సైడ్, ఈథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, మంచు, ఇసుకను సమర్థంగా తవ్వకాలు చేసి, తీసుకొచ్చేందుకు ఈ సాఫ్ట్వేర్ రూపొందించాం. దీనిని భవిష్యత్‌లో నాసా మిషన్ వినియోగించే అవకాశం ఉంది. – కొత్తకోట సాయికిశోర్, శ్రీకాకుళం -
మలేసియాలో చిక్కుకున్న సిక్కోలు యువకులు
పోలాకి: ఉపాధికోసం మధ్యవర్తిని నమ్మి మలేసియా వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకార యువకులు ఎనిమిదిమంది అక్కడ మోసపోయి తిరిగిరాలేక అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి వారి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. పోలాకి మండలం గుప్పెడుపేటకు చెందిన రట్టి యర్రయ్య, నందుపల్లి యల్లయ్య, నందుపల్లి దుర్గయ్య, నందుపల్లి చిన్నారావు, బుడగట్ల లక్ష్మయ్య, సంతబొమ్మాళి మండలం సంధిపేటకు చెందిన బొంగు జయరాం, పప్పల లోకేశ్వరరావు, కుత్తుమ సంతోష్‌కుమార్ చెన్నైకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా చెరో రూ.70 వేలు చెల్లించి ఫిబ్రవరి 12న మలేసియా వెళ్లారు. వారికి అక్కడ నెగిరిసెంబిలన్ ప్రాంతంలో ఆల్-సాలెమ్-మజు రెస్టారెంట్లో పని అప్పగించారు. ఆ తరువాత మధ్యవర్తి, అక్కడికి తీసుకెళ్లిన కన్సెల్టెన్సీవారు కనిపించకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన యువకులు ఇక్కడి కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారం అందించారు. విపరీతమైన పని ఒత్తిడి, కంటిమీద కునుకు, కడుపు నిండా తిండిలేవంటూ అక్కడ పడుతున్న బాధలు వివరించారు. దీనిపై ఆ మత్స్యకార యువకుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నెలరోజుల కిందట మలేసియాలో చిక్కుకున్న యువకులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎంపీలతో పాటు కొందరు నాయకులను కలసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వారు వాపోతున్నారు. వారు బుధవారం పోలాకి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి తమవారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిపై తహశీల్దార్ జెన్ని రామారావు మాట్లాడుతూ కుటుంబసభ్యుల వివరాలు, బాధితుల పాస్‌పోర్ట్, వీసా, ఆధార్ కార్డులు తదితర నకళ్లతో కూడిన సమగ్ర సమాచారం సేకరించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.