polaki
-
మాస్ డ్యాన్సర్.. పోలకి విజయ్
ఊ అంటావా...మార్ ముంత వరకూ అనేక హిట్ సాంగ్స్‌కి మాస్ స్టెప్పులు ఏజాస్ మాస్టర్ పరిచయంతో ఇండస్ట్రీకి రణ్వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు ‘సాక్షి’తో కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ పుష్ప–1 లో ఊ అంటావా మావా... ఊహూ అంటావా మావ.. పుష్ప–2 లో పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మార్ముంత చోడ్ చింత.. మ్యాడ్ చిత్రంలో కళ్లజోడు కాలేజీపాప.. కాలేజ్ పోతున్నది.. కోట బొమ్మాళి చిత్రంలోని లింగిడి, లింగిడి.. ఇలాంటి పాటలు వింటుంటే స్టెప్పులు వేయాలనే ఆలోచన తప్పక వస్తుంది.. అలాంటి పాటలకు కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు.. మన తెలుగబ్బాయే.. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు.. కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని టాలీవుడ్ టు బాలీవుడ్‌కు పాగా వేసిన మన తెలుగు కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ డెడికేషన్‌కి టాలీవుడ్ అగ్రహీరోలు ఫిదా అవుతున్నారు. స్టెప్పులు వేస్తే.. క్లాస్ టు మాస్ జనాలు ఉర్రూతలూగేలా చేస్తున్న పోలకి విజయ్ జీవితం ఓ ఇన్స్పిరేషన్లా ఉంటుంది.. ఈ నేపథ్యంలో విజయ్ ‘సాక్షి’తో పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా పలాస. చిన్నతనంలోనే అమ్మ నాన్మ చనిపోయారు. అమ్మమ్మ, తాతమ్మల దగ్గరే పెరిగాను. చిన్నతనం నుండే నటన అంటే ఇష్టం. ఆర్టిస్ట్ అవుదామనే కల ఉండేది. కానీ డ్యాన్స్‌లు సైతం బాగా వేసేవాడిని. అలా నటన, డ్యాన్స్‌లలో స్వతహాగా మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాను. అమ్మమ్మ, తాతయ్యలకు భారం కాకూడదని బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడ ఎవరూ తెలియదు. ఎవరిని కలవాలో తెలియదు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ.. కషే్టఫలి అనేది నమ్మాను. ఎన్నికష్టాలు వచి్చనా నా ప్రయాణాన్ని ఆపలేదు. పనులు చేస్తూ జీవనం గడుపుతూ అక్కడక్కడా నాకు తెలిసిన డ్యాన్స్‌లు వేసేవాడిని.ఏజాస్ మాస్టర్ పరిచయం..పని, డ్యాన్స్‌లు తప్ప వేరే వ్యాకపం ఉండేది కాదు.. అలా నా అభిలాషను మెచ్చి ఓ అజ్ఞాతవ్యక్తి ఓ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్లాడు. ఏజాస్ మాస్టర్ స్వర్ణలత మాస్టర్ అసిస్టెంట్. అలా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో చేరాను. చాలా మెళకువలు నేర్చుకున్నాను. నన్ను ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లిన ఆ అజ్ఞాతవాసి మరలా కనిపించలేదు.డ్యాన్సర్‌గా ఇండస్ట్రీకి..డ్యాన్స్‌లో మంచి పట్టు సాధించాక 2015లో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కార్డ్‌ను తీసుకున్నాను. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేసే సమయంలో తోటిడ్యాన్సర్స్ నీలో మంచి టాలెంట్ ఉంది. కొరియోగ్రాఫర్‌గా చేయమని సలహా ఇచ్చారు. కొన్ని డ్యాన్స్ విడియోస్ చేశాక ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయిరాజేష్ నిర్మాణంలోని సంపూర్ణే‹Ùబాబు ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో అవకాశం వచి్చంది. ఆ తర్వాత నేను పుట్టిన పలాస పేరుతో కరుణసాగర్ దర్శకత్వంలోని ‘పలాస’ చిత్రంలో నాదీ నక్కిలీసు గొలుసు పాటకు కొరియోగ్రఫీ చేశాను. ఈ పాటకు మంచి పేరు వచి్చంది. అలా కొరియోగ్రాఫర్‌గా స్థానాన్ని నిలబెట్టుకున్నాను.పుష్పతో మరోమెట్టు.. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఊ అంటావా పాటకు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి చేశాను. ఈ పాట దేశంతోపాటు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. పుష్ప–2లో పుష్ప, జాతర పాటకూ కొరియోగ్రఫీ చేశాను. రవితేజ, శర్వానంద్, విజయ్‌దేవరకొండ, నాని చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాను. రీసెంట్ రామ్ ‘డబుల్ ఇస్మార్ట్‌శంకర్’లో మార్ముంత చోడ్చింతకు కోరియోగ్రఫీ చేశా. యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. బాలీవుడ్లో అవకాశం.. హీరో రణ్వీర్ కపూర్ నటిస్తున్న ‘తు ఝూతీ మైన్ మక్కర్’ చిత్రంలోని పాటకు కొరియోగ్రఫీ చేశాను. రణ్వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు. అంతేకాకుండా నాకు నచి్చన బెస్ట్ మాస్టర్ లారెన్స్ మాస్టర్‌కి ‘రుద్రుడు’ చిత్రంలో కొరియోగ్రఫీ చేశాను. ఈ అనుభవం జీవితంలో మరువలేనిది.చిరంజీవికి కొరియోగ్రఫీ నా ఆశయంచిన్నతనం నుండి నా గాడ్‌ఫాదర్ చిరంజీవి. ఆయన డ్యాన్సులు చూసి పెరిగాను. ‘ఇంద్ర’ చిత్రాన్ని 22సార్లు చూశాను. కేవలం దాయి దాయి దామ్మ పాట కోసమే చూశాను. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ మాస్టర్‌కి కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. కానీ నా గాడ్‌ఫాదర్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేయాలన్నది నా ఆశయం. ఆ దిశగా ఆడుగులు వేస్తున్నాను. డ్యాన్స్‌పై ఇష్టంతో ఈ స్థాయికి వచ్చాను. గుర్తుండిపోయే కొరియోగ్రాఫర్‌గా ప్రజల మదిలో ఉంటూ మరో లక్ష్యం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగించి విజయాన్ని సాధిస్తాను. మీ దీవెనలే నాకు కొండత బలమని నమ్ముతూ.. అందరికీ నా కృతజ్ఞతలు.. -
శ్రీకాకుళంలో థర్మల్ సెగలు
-
రాజుకుంటోంది!
థర్మల్ పవర్ ప్లాంటు, పోలాకి, ఆందోళన ‘థర్మల్’ వ్యతిరేక గ్రామాల్లో ఉద్రిక్తత పోలీసుల నీడలో పోలాకి థర్మల్ ప్రతిపాదిత గ్రామాలు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని థర్మల్‌పవర్ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. జపాన్‌కు చెందిన సుమితోమో సంస్థ ఆర్థిక సాయంతో 4000 మెగావాట్ల పవర్‌ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనను ఈ ప్రాంతీయులు వ్యతిరేకిస్తున్నారు. తమ బతుకులను నాశనం చేయవద్దని వేడుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా భూసర్వేలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు సర్వేను అడ్డుకొని ప్రజలు నిరసన తెలిపారు. బుధవారం కూడా సర్వేకు అధికారులు పూనుకోవడంతో జనం తిరగబడ్డారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ప్రజా సంఘాల నాయకులు, పలువురు రైతులను అరెస్టు చేశారు. అనంతరం సర్వేను కొనసాగించారు. ఓదిపాడు(పోలాకి): పోలాకి థర్మల్ వ్యతిరేక ఉద్యమం ఉద్రిక్తంగా మారుతోంది. పవర్‌ప్లాంటు ఏర్పాటును ఈ ప్రాంతీయులు వద్దని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా భూసర్వే చేస్తుడడం, ప్రజలు అడ్డుకుంటుండడంతో పరిస్థితి చేరుదాటుతోంది. గత మూడు వారాలుగా చేపడుతున్న సర్వేను ఎప్పటికప్పుడు ప్రజలు అడ్డుకుంటున్నారు. మంగళవారం కూడా ఓదిపాడు, చీడివలస, సన్యాసిరాజుపేట, కోరాడలచ్చయ్యపేట, గవరంపేట గ్రామాల్లో సర్వేచేపట్టేందుకు వచ్చిన అధికారులను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. దీంతో వెనుదిరిగిన పోలీసులు, సర్వే బృందాలు బుధవారం పక్కా ప్రణాళికతో సర్వేకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉదయం నుంచే ఈ గ్రామాల ప్రజలు బయటకు రాకుండా పోలీసు బలగాలను ఎక్కడికక్కడ మోహరించారు. అయినా ఆగ్రహంతో ఊగిపోయిన జనం వారిని ఖాతరు చేయకుండా ముందుకు సాగారు. దీంతో సీపీఎం రాష్ట్రకార్యవర్గసభ్యుడు చౌదరి తేజేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతింటి నీలంరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, రైతుసంఘం నాయకులు మోహనరావు, బగ్గు భాస్కరరావులతో పాటు మరికొంతమంది ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా స్థానిక థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు ముద్దాడ బైరాగినాయుడుతోపాటు పలువురు రైతులు, నాయకులను అరెస్ట్ చేసేందుకు విఫలయత్నం చేశారు. ప్రతిఘటించిన ప్రజలు పొలాల ద్వారా సర్వే చేపట్టే చోటుకు చేరుకుని అడ్డుకున్నారు. వేర్వేరు గ్రామాల నుంచి ఉద్యమకారులు రావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో సర్వేను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం తహసీల్దార్ జె.రామారావు, నరసన్నపేట, ఆమదాలవలస సీఐలు చంద్రశేఖరరావుల సమక్షంలో ఎచ్చెర్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వారి సమక్షంలో పొలాల్లో ఉన్న ఉద్యమ నాయకుడు ముద్దాడ బైరాగినాయుడుతో పాటు మరి కొంతమంది స్థానిక థర్మల్ వ్యతిరేకపోరాట సమితి నాయకులు, రైతులను అరెస్ట్ చేసి నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డువచ్చిన మహిళలు, వృద్ధులను సైతం పక్కకు లాగిపడేశారు. అప్పటివరకు నిలిచిన సర్వేను ఆ తరువాత ఏపీజెన్కో ఏఈ టీవీ మధు ఆధ్వర్యంలో పోలీసుల నీడలో కొనసాగించారు. బందోబస్తులో నరసన్నపేట, జలుమూరు, జేఆర్‌పురం, శ్రీకాకుళం వన్‌టౌన్ ఎస్‌ఐలతోపాటు ప్రత్యేక దళం పోలీసులు పాల్గొన్నారు. తొలిసారిగా స్థానికుల అరెస్టు థర్మల్ వ్యతిరేకపోరులో స్థానికులను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. గతంలో పలుమార్లు ప్రజాసంఘాల నాయకులు, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. థర్మల్ వ్యతిరేక పోరాటంలో చురుగ్గాపాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు ముద్దాడ భైరాగినాయుడుతోపాటు ప్రతిపాదిత గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది రైతులు, నాయకులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడంతో పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యమానికి మద్దతు థర్మల్ ఉద్యమానికి నరసన్నపేటకు చెందిన నాయకులు మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రానికి అత్యంత దగ్గర్లో థర్మల్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతు రామారావు అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు ముద్దాడ భైరాగినాయుడు, రైతులు మల్లేసు, ధనుంజయరావు, కుమ్మరి శిమ్మయ్య, సురేష్, చిన్నప్పన్న, అంపోలు విజయ్‌కుమార్, కింజరాపు అప్పారావు, కుమ్మరి తవిటయ్య, యర్రయ్యలను పట్టణ నాయకులు నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో పరామర్శించారు. మద్దతు ప్రకటించిన వారిలో కోరాడ చంద్రభూషణగుప్త, ఆరంగిమురళి,మొజ్జాడ శ్యామలరావు ఉన్నారు. -
పోలాకిలో ఉద్రిక్తత
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేను బుధవారం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే ప్లాంట్ కోసం జిల్లాలోని చీడివలస, గవరంపేట, గోవిందరాజులపేట గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సదరు గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. తమ నిరసన తెలిపేందుకు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆయా గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సదరు గ్రామాల ప్రజలు పోలీసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సర్వేను ఎలాగైనా అడ్డుకుని తీరతామని ఉద్యమకారులు స్పష్టం చేశారు. -
మళ్లీ సర్వేకు వస్తే ఖబడ్దార్
పోలాకి : రాష్ట్ర ప్రభుత్వ జపాన్ కంపెనీతో సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన పోలాకి థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేకు సహకరించేది లేదని, మరోసారి సర్వే పేరిట వస్తే ఖబడ్దార్ అంటూ థర్మల్ ప్రతిపాదిత గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ థర్మల్ సర్వేను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాలైన చీడివలస, గవరంపేట, ఓదిపాడుల్లో తహశీల్దార్ జెన్ని రామారావు, జెన్కో ఏఈ టీవీ మధు ఆధ్వర్యంలో మంగళవారం అధికారుల బృందం పర్యటించింది. ప్రస్తుత సర్వే కేవలం భౌగోళిక స్థితిగతులపై అంచనా వేసేందుకు మాత్రమేనని ప్రజలు సహకరించాలని నచ్చజెప్పేందుకు అధికారులు చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైంది. మరోసారి సర్వేకు రావద్దని ప్రజలు గట్టిగానే హెచ్చరించారు. ముందుగా చీడివలస గ్రామానికి చేరుకున్న అధికారులకు అక్కడి యువకులు గోబ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ఓదిపాడు, గవరంపేటల్లో కూడా అధికారులను అడ్డుకున్నారు. అభివృద్ధి పేరిట మా బతుకులు బుగ్గి చేయొద్దని నిజంగా అభివృద్ధి చేయూలంటే ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ సంస్థలను నిర్మించాలని, మా భూములు ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నామని తహశీల్దార్ బృందానికి వినతిపత్రాలు అందజేశారు. మహిళలు సైతం అధికారులను నిలదీశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. సర్వే నిలుపుదల చేస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. అధికారుల బృందంలో ఆర్ఐ బాలకృష్ణ, వీఆర్వోలు కృష్ణమోహన్, వెంకటరమణ ఉన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, ఇతర నాయకులు కె.సురేష్‌బాబు, నీలంరాజు, కోట అప్పారావు ప్రజలకు మద్దతుగా నిలిచారు. పోలాకి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రెచ్చగొట్టొద్దు... థర్మల్‌పవర్ ప్లాంట్ నిర్మాణాలకు జిల్లాలో వ్యతిరేకత వుంది. సర్వే పేరుతో ప్రజలను రెచ్చగొట్టవద్దు. గతంలో కాకరాపల్లి, సోంపేటలలో కూడా అనవసరంగా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకత తెలుపుతున్నా వినిపించుకోవటం లేదు. జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, అధికారులే వహించాల్సి వుంటుంది. -కోట అప్పారావు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఆరేళ్ల చిన్నారిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
పోలాకి: అభం, శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. మానవత్వం మరిచి చిన్నారిని చెరచబోయాడు. వివరాలిలా.. నరసన్నపేటలోని పురుషోత్తమనగర్కాలనీకు చెందిన వర్రు యర్రయ్య(40) ఆటో నడుపుతుంటాడు. మంగళవారం ఉదయం పోలాకి మండలంలోని గుప్పెడుపేటలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో పల్స్‌పోలియో వ్యాక్సిన్ తీసుకువచ్చాడు. ఆరోగ్య కేంద్రం తాళాలు వేసి ఉండటంతో స్వీపర్ ఇంటికి వెళ్లి తాళాలు అడిగాడు. ఆమె తన కుమార్తె(6)తో తాళాలు పంపించింది. అంతలోనే మృగంగా మారిన యర్రయ్య ఆ చిన్నారిని ఆస్పత్రిలోకి లాక్కువెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాధిత చిన్నారి సోదరుడు గమనించి గ్రామంలోని స్ధానికులకు తెలియజేశాడు. వెంటనే వారు ఆస్పత్రిలోకి వెళ్లి ఆటోడ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కరెంట్ స్తంభానికి కట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. నరసన్నపేట పోలీసులు కేసు విచారిస్తున్నారు. బాధిత చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్య పరీక్షలు చేసిన వైద్యాధికారి బలగ మురళి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నామన్నారు -
'చంద్రబాబు చూపు రాక్షసచూపు'
పోలాకి: ప్రశాంతంగా వున్న శ్రీకాకుళం జిల్లాలో ఊళ్లులేపేసి ఉద్యోగాలు ఇస్తారా..? అంటూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలాకి మండలంలో జపాన్ కంపెనీ సుమితోమో సౌజన్యంతో రాష్ట్రప్రభుత్వం నిర్మించ తలపెట్టిన థర్మల్పవర్ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు. చంద్రబాబు చూపు రాక్షసచూపనీ, శ్రీకాకుళం జిల్లాపై అది పడిందని విరుచుకుపడ్డారు. తోటాడ, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, గవరంపేట తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడిప్రజలతో మాట్లాడారు. గతంలో జరిగిన సోం పేట, కాకరాపల్లి వంటి ఘటనలు పునరావృతం కాకముందే ప్రభుత్వం ఇక్కడి థర్మల్ ప్రతిపాదన విరమించుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ గొర్రెలకాపరితో కాసేపు మాట్లాడి సరదాగా గొర్రెలు కాపుకాశారు. ఆయన వెంట సీపీఐ నాయకులు చాపర సుందరలాల్, ఒడిశాకు చెందిన మాజీఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ జీవో ఎందుకు రద్దుచేయరు? సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేస్తూ జీవో విడుదల చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ప్రశ్నించారు. సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ పవర్ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసు తూటాలకు బలైపోయిన ముగ్గురు అమరవీరులకు నివాళులర్పిస్తూ మంగళవారం సోంపేట పట్టణంలో భారీ సభ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలసి పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా అనుమతులు రద్దు చేస్తూ జీవో జారీచేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఉద్యమం ఎప్పటికైనా బలహీన పడదా, మరలా ఆ ప్రాంతంలో కర్మాగారాలు స్థాపించడానికి అవకాశం దొరకదా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం 1107 జీవో రద్దు చేయకుండా మరలా ఆనాటి కాల్పుల సంఘటనకు సంబంధించి 720 మంది పై కేసులు పెట్టడానికి సిద్ధం కావడం చూస్తుంటే పరిస్థితి ఎలాఉందో అర్థం అవుతోందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యద ర్శి పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ 1107 జీవో రద్దు అయ్యేంతవరకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బి.అశోక్ బాబు, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, కిసాన్ మోర్చారాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి, మడ్డు రాజారావు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
‘సుమిటోమో’ వెనుక మతలబు?
పోలాకి థర్మల్ ప్రాజెక్టుపై కేంద్రం అభ్యంతరం విదేశీ రుణానికి గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టీకరణ సుమిటోమోతో రహస్య ఒప్పందాలే కారణమంటున్న విపక్షాలు హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా పొలాకీలో ప్రతిపాదించిన నాలుగువేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టుపై కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకే సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇచ్చే విదేశీ రుణానికి తాము గ్యారెంటీ ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పడంతో దశల వారీగా ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయం పెంచే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఆసక్తి చూపడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్‌కు చెందిన సుమిటోమో కంపెనీతో కుదిరిన రహస్య ఒప్పందాలే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కారణమన్న విమర్శలు వినవస్తున్నాయి. పోలాకిలో ఏర్పాటు చేసే సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టుకు జపాన్ ఆర్థిక సంస్థలు రుణ సాయం అందించడానికి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో అవి కొన్ని షరతులు విధించాయి. అవి సూచించినచోటే యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలని, వాటి కనుసన్నల్లో ఉండే దేశాల నుంచే బొగ్గు దిగుమతి చేసుకోవాలనేది ప్రధానాంశాలుగా తెలుస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రతిపాదనపై పునరాలోచించుకోవాలని కేంద్రం సూచించింది. ఈ షరతులను అంగీకరిస్తే, రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పడుతుందని హితవు పలికింది. విదేశీ కంపెనీలతో రహస్య ఒప్పందాలు జరిగాయన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టు తెలిసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. నాలుగువేలకు బదులుగా వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు ఇటీవల జపాన్ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత దీన్ని విస్తరించే వీలుందని ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వెయ్యి మెగావాట్లకు కావాల్సిన రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే సరిపోతుందని జపాన్ సంస్థలు తెలపడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు థర్మల్‌ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చే సుమిటోమోతో జరిగిన ఒప్పందాలు ఏమిటో బయటపెట్టాలని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఒప్పందం ఏమిటి? : భారీ థర్మల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేప్పుడు ఓపెన్ బిడ్డింగ్‌కు వెళ్తారు. బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ), బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (బీఓపీ) అనే రెండు టెండర్లు పిలుస్తుంది. ఏపీ ప్రభుత్వం బీటీజీ టెండర్ ప్రక్రియను సుమిటోమోకే కట్టబెడతామని జపాన్ ఆర్థిక సంస్థలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. రూ.11కోట్లు ఖర్చుకూ అంగీకరించడం విమర్శలకు గురవుతోంది. -
శ్రీకాకుళం జిల్లా పోలాకిలో విద్యుత్ కేంద్రం
రాజధాని నిర్మాణానికి జైకా సహకారం * జపాన్‌లో పలు సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ * గతేడాది ఒప్పందాలపైనా సమీక్ష సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా పోలాకి దగ్గర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక అధ్యయనాన్ని జపాన్‌కు చెందిన సుమితొమి కార్పొరేషన్ పూర్తి చేసింది. అక్కడ స్థలాన్ని గుర్తించామని సంస్థ ప్రతినిధులు ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిపారు. జపాన్‌లో తన తొలి రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యింది. సంబంధిత వివరాలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. * సుమిటోమి కార్పొరేషన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసయకి హ్యాడో బృందంతో చంద్రబాబు బృందం సమావేశమైంది. గతేడాది నవంబరులో తన పర్యటన సందర్భంగా ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై చంద్రబాబు సమీక్షించారు. విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక అధ్యయనం పూర్తి చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏపీ నూతన రాజధాని అమరావతిలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. * క్యాపిటల్ కన్సల్టెన్సీ బిడ్‌తో పాటు విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారానికి జపాన్ ఇంటర్నేషనల్ కో- ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) ముందుకొచ్చింది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, కృష్ణపట్నం పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులపై త్వరలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలో సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌బ్యాంకు సిద్ధమౌతోందని, తమ మద్ధతు కోరిందని చెప్పారు. * ఫ్యూజీ కంపెనీ ప్రతినిధులతో విజయవాడలో చేపట్టిన స్మార్ట్ గ్రిడ్ నిర్మాణ పురోగతిపై చర్చించారు. * కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా విశాఖపట్నంలో జపాన్ సమాచార, విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్సుబిషి సంస్థ ముందుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు సహకరించటంతో పాటు సామాజిక బాధ్యతా కార్యక్రమాలు చేపడతామని సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు యఘహికో కిటగవా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మిత్సుబిషి సంస్థ నిర్మించే కర్మాగారానికి వంద రోజుల్లో అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. * రాష్ర్టంలో రొయ్యలను ప్రాసెసింగ్ చేసేందుకు సహకరించాల్సిందిగా మయావక కంపెనీ ప్రతినిధులతో భేటీ సందర్భంగా చంద్రబాబు కోరారు. ఏపీలో ఆక్వా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. జపాన్‌లో డెస్క్ ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు సహకరించాల్సిందిగా మయావక కంపెనీ ఛైర్మన్ యొషిరో టనాక చేసిన విజ్ఞప్తికి చంద్రబాబు అంగీకరించారు. * ఈ సమావేశాల్లో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు పీవీ రమేష్, అజయ్‌జైన్, ఎ.గిరిధర్, ఎస్ ఎస్ రావత్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మలేసియాలో చిక్కుకున్న సిక్కోలు యువకులు
పోలాకి: ఉపాధికోసం మధ్యవర్తిని నమ్మి మలేసియా వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకార యువకులు ఎనిమిదిమంది అక్కడ మోసపోయి తిరిగిరాలేక అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి వారి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. పోలాకి మండలం గుప్పెడుపేటకు చెందిన రట్టి యర్రయ్య, నందుపల్లి యల్లయ్య, నందుపల్లి దుర్గయ్య, నందుపల్లి చిన్నారావు, బుడగట్ల లక్ష్మయ్య, సంతబొమ్మాళి మండలం సంధిపేటకు చెందిన బొంగు జయరాం, పప్పల లోకేశ్వరరావు, కుత్తుమ సంతోష్‌కుమార్ చెన్నైకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా చెరో రూ.70 వేలు చెల్లించి ఫిబ్రవరి 12న మలేసియా వెళ్లారు. వారికి అక్కడ నెగిరిసెంబిలన్ ప్రాంతంలో ఆల్-సాలెమ్-మజు రెస్టారెంట్లో పని అప్పగించారు. ఆ తరువాత మధ్యవర్తి, అక్కడికి తీసుకెళ్లిన కన్సెల్టెన్సీవారు కనిపించకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన యువకులు ఇక్కడి కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారం అందించారు. విపరీతమైన పని ఒత్తిడి, కంటిమీద కునుకు, కడుపు నిండా తిండిలేవంటూ అక్కడ పడుతున్న బాధలు వివరించారు. దీనిపై ఆ మత్స్యకార యువకుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నెలరోజుల కిందట మలేసియాలో చిక్కుకున్న యువకులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎంపీలతో పాటు కొందరు నాయకులను కలసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వారు వాపోతున్నారు. వారు బుధవారం పోలాకి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి తమవారిని రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిపై తహశీల్దార్ జెన్ని రామారావు మాట్లాడుతూ కుటుంబసభ్యుల వివరాలు, బాధితుల పాస్‌పోర్ట్, వీసా, ఆధార్ కార్డులు తదితర నకళ్లతో కూడిన సమగ్ర సమాచారం సేకరించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.