థర్మల్ పవర్ ప్లాంటు, పోలాకి, ఆందోళన
‘థర్మల్’ వ్యతిరేక గ్రామాల్లో ఉద్రిక్తత
పోలీసుల నీడలో పోలాకి థర్మల్ ప్రతిపాదిత గ్రామాలు
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని థర్మల్‌పవర్ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. జపాన్‌కు చెందిన సుమితోమో సంస్థ ఆర్థిక సాయంతో 4000 మెగావాట్ల పవర్‌ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనను ఈ ప్రాంతీయులు వ్యతిరేకిస్తున్నారు. తమ బతుకులను నాశనం చేయవద్దని వేడుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా భూసర్వేలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు సర్వేను అడ్డుకొని ప్రజలు నిరసన తెలిపారు. బుధవారం కూడా సర్వేకు అధికారులు పూనుకోవడంతో జనం తిరగబడ్డారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ప్రజా సంఘాల నాయకులు, పలువురు రైతులను అరెస్టు చేశారు. అనంతరం సర్వేను కొనసాగించారు.
ఓదిపాడు(పోలాకి): పోలాకి థర్మల్ వ్యతిరేక ఉద్యమం ఉద్రిక్తంగా మారుతోంది. పవర్‌ప్లాంటు ఏర్పాటును ఈ ప్రాంతీయులు వద్దని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా భూసర్వే చేస్తుడడం, ప్రజలు అడ్డుకుంటుండడంతో పరిస్థితి చేరుదాటుతోంది. గత మూడు వారాలుగా చేపడుతున్న సర్వేను ఎప్పటికప్పుడు ప్రజలు అడ్డుకుంటున్నారు. మంగళవారం కూడా ఓదిపాడు, చీడివలస, సన్యాసిరాజుపేట, కోరాడలచ్చయ్యపేట, గవరంపేట గ్రామాల్లో సర్వేచేపట్టేందుకు వచ్చిన అధికారులను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. దీంతో వెనుదిరిగిన పోలీసులు, సర్వే బృందాలు బుధవారం పక్కా ప్రణాళికతో సర్వేకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉదయం నుంచే ఈ గ్రామాల ప్రజలు బయటకు రాకుండా పోలీసు బలగాలను ఎక్కడికక్కడ మోహరించారు. అయినా ఆగ్రహంతో ఊగిపోయిన జనం వారిని ఖాతరు చేయకుండా ముందుకు సాగారు. దీంతో సీపీఎం రాష్ట్రకార్యవర్గసభ్యుడు చౌదరి తేజేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతింటి నీలంరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, రైతుసంఘం నాయకులు మోహనరావు, బగ్గు భాస్కరరావులతో పాటు మరికొంతమంది ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అంతటితో ఆగకుండా స్థానిక థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు ముద్దాడ బైరాగినాయుడుతోపాటు పలువురు రైతులు, నాయకులను అరెస్ట్ చేసేందుకు విఫలయత్నం చేశారు. ప్రతిఘటించిన ప్రజలు పొలాల ద్వారా సర్వే చేపట్టే చోటుకు చేరుకుని అడ్డుకున్నారు. వేర్వేరు గ్రామాల నుంచి ఉద్యమకారులు రావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో సర్వేను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం తహసీల్దార్ జె.రామారావు, నరసన్నపేట, ఆమదాలవలస సీఐలు చంద్రశేఖరరావుల సమక్షంలో ఎచ్చెర్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వారి సమక్షంలో పొలాల్లో ఉన్న ఉద్యమ నాయకుడు ముద్దాడ బైరాగినాయుడుతో పాటు మరి కొంతమంది స్థానిక థర్మల్ వ్యతిరేకపోరాట సమితి నాయకులు, రైతులను అరెస్ట్ చేసి నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డువచ్చిన మహిళలు, వృద్ధులను సైతం పక్కకు లాగిపడేశారు. అప్పటివరకు నిలిచిన సర్వేను ఆ తరువాత ఏపీజెన్‌కో ఏఈ టీవీ మధు ఆధ్వర్యంలో పోలీసుల నీడలో కొనసాగించారు. బందోబస్తులో నరసన్నపేట, జలుమూరు, జేఆర్‌పురం, శ్రీకాకుళం వన్‌టౌన్ ఎస్‌ఐలతోపాటు ప్రత్యేక దళం పోలీసులు పాల్గొన్నారు.
తొలిసారిగా స్థానికుల అరెస్టు
థర్మల్ వ్యతిరేకపోరులో స్థానికులను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. గతంలో పలుమార్లు ప్రజాసంఘాల నాయకులు, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. థర్మల్ వ్యతిరేక పోరాటంలో చురుగ్గాపాల్గొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు ముద్దాడ భైరాగినాయుడుతోపాటు ప్రతిపాదిత గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది రైతులు, నాయకులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడంతో పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యమానికి మద్దతు
థర్మల్ ఉద్యమానికి నరసన్నపేటకు చెందిన నాయకులు మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రానికి అత్యంత దగ్గర్లో థర్మల్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతు రామారావు అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు ముద్దాడ భైరాగినాయుడు, రైతులు మల్లేసు, ధనుంజయరావు, కుమ్మరి శిమ్మయ్య, సురేష్, చిన్నప్పన్న, అంపోలు విజయ్‌కుమార్, కింజరాపు అప్పారావు, కుమ్మరి తవిటయ్య, యర్రయ్యలను పట్టణ నాయకులు నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో పరామర్శించారు. మద్దతు ప్రకటించిన వారిలో కోరాడ చంద్రభూషణగుప్త, ఆరంగిమురళి,మొజ్జాడ శ్యామలరావు ఉన్నారు.