పోలాకి థర్మల్ ప్రాజెక్టుపై కేంద్రం అభ్యంతరం
విదేశీ రుణానికి గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టీకరణ
సుమిటోమోతో రహస్య ఒప్పందాలే కారణమంటున్న విపక్షాలు
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా పొలాకీలో ప్రతిపాదించిన నాలుగువేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టుపై కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకే సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇచ్చే విదేశీ రుణానికి తాము గ్యారెంటీ ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పడంతో దశల వారీగా ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయం పెంచే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఆసక్తి చూపడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్‌కు చెందిన సుమిటోమో కంపెనీతో కుదిరిన రహస్య ఒప్పందాలే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కారణమన్న విమర్శలు వినవస్తున్నాయి. పోలాకిలో ఏర్పాటు చేసే సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టుకు జపాన్ ఆర్థిక సంస్థలు రుణ సాయం అందించడానికి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో అవి కొన్ని షరతులు విధించాయి. అవి సూచించినచోటే యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలని, వాటి కనుసన్నల్లో ఉండే దేశాల నుంచే బొగ్గు దిగుమతి చేసుకోవాలనేది ప్రధానాంశాలుగా తెలుస్తోంది.
‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రతిపాదనపై పునరాలోచించుకోవాలని కేంద్రం సూచించింది. ఈ షరతులను అంగీకరిస్తే, రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పడుతుందని హితవు పలికింది. విదేశీ కంపెనీలతో రహస్య ఒప్పందాలు జరిగాయన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టు తెలిసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. నాలుగువేలకు బదులుగా వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు ఇటీవల జపాన్ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత దీన్ని విస్తరించే వీలుందని ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వెయ్యి మెగావాట్లకు కావాల్సిన రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే సరిపోతుందని జపాన్ సంస్థలు తెలపడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు థర్మల్‌ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చే సుమిటోమోతో జరిగిన ఒప్పందాలు ఏమిటో బయటపెట్టాలని విపక్షాలు నిలదీస్తున్నాయి.
ఒప్పందం ఏమిటి? : భారీ థర్మల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేప్పుడు ఓపెన్ బిడ్డింగ్‌కు వెళ్తారు. బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ), బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (బీఓపీ) అనే రెండు టెండర్లు పిలుస్తుంది. ఏపీ ప్రభుత్వం బీటీజీ టెండర్ ప్రక్రియను సుమిటోమోకే కట్టబెడతామని జపాన్ ఆర్థిక సంస్థలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. రూ.11కోట్లు ఖర్చుకూ అంగీకరించడం విమర్శలకు గురవుతోంది.
‘సుమిటోమో’ వెనుక మతలబు?
Published Tue, Jul 14 2015 1:24 AM | Last Updated on Thu, Oct 4 2018 8:05 PM
Advertisement
Advertisement