
పర్యాటక రంగంలో వృద్ధికి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అధిక నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు (HNI), విదేశీ పెట్టుబడిదారులకు గోవా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆసక్తిగా కనిపిస్తోంది. హాలిడే హోమ్‌లు, స్టేయింగ్ రూమ్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. అధిక అద్దె రాబడి, స్థిరమైన జీవనం సాగించేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు, డెవలపర్ల ప్రకారం గోవాలోని బ్రాండెడ్ హోటళ్లు, రెంటల్ విల్లాలు పీక్ సీజన్‌లో పూర్తిగా బుక్ అవుతున్నాయి. ఈ కేటగిరీల్లో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని కొనుగోలు దారులు భావిస్తున్నారు. సుస్థిర జీవనానికి ప్రాధాన్యమిచ్చే హెచ్‌ఎన్‌ఐలకు గోవా(Goa Realty)లోని పర్యావరణ అనుకూల గేటెడ్ కమ్యూనిటీలు ఆకర్షణీయంగా తోస్తున్నాయి.
అంజునా, అర్పోరా, బగా, కలంగుటే, కాండోలిమ్, వాగ్తోర్ వంటి ప్రాంతాలతో సహా గోవా నార్త్ బీచ్ పోర్చుగీస్ పరిసరాలు, ప్రసిద్ధ రెస్టారెంట్లు, హోటళ్లు, బీచ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇదీ చదవండి: క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్
విదేశీ పెట్టుబడిదారులు(foreign funds) తమ పోర్ట్ఫోలియోలను వైవిధ్యంగా విస్తరించడానికి గోవాలోని నాణ్యమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు అద్దె ఆదాయాన్ని సృష్టించడానికి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ఓ విదేశీ సంస్థ గోవాలోని ప్రతిష్టాత్మక హోటల్‌ను కొనుగోలు చేసే చివరి దశలో ఉంది. యాక్సిస్ ఈకార్ప్ సీఈఓ ఆదిత్య కుష్వాహా మాట్లాడుతూ..‘దేశీయ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆకర్షణ గోవా రియల్టీ వ్యాపారం మరింత మెరుగుపడేలా చేస్తోంది. స్థిరంగా అద్దె వస్తుండడంతో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment