
‘డిఫెన్స్ అకాడమీలో అమ్మాయిలా?’ అనే అజ్ఞాత ఆశ్చర్యం మొన్న. ‘అమ్మాయిలు అద్భుతమైన విజయాలు సాధించగలరు’ అనే ఆత్మవిశ్వాసం నిన్న. ‘అవును. అది నిజమే’ అని చెప్పే వాస్తవం ఇవ్వాళ...
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనేది ఎంత వాస్తవమో తెలియదుగానీ, భవిష్యత్ లక్ష్యాలను ఏర్పర్చుకోవడంలో ఇంటి వాతావరణం బలమైన ప్రభావం చూపుతుందని బలంగా చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా షానన్ ధాకను సగర్వంగా చూపవచ్చు.
షానన్‌ది హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలోని సుందన గ్రామం. ఆ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఆర్మీలో ఉండడం విశేషం. తాత చంద్రభాను ధాక ఆర్మీలో సుబేదార్.
తాతయ్య తనకు ‘ఆర్మీ కథలు’ చెప్పేవాడు. అవి కల్పిత కథలు కాదు. నిజజీవిత కథలు. సాహసజ్వాలను తట్టిలేపే కథలు. నాన్న విజయ్‌కుమార్ ఆర్మీలో నాయక్ సుబేదార్. చిన్నప్పుడు తాను ఏదైనా సందర్భంలో భయపడితే... ‘మనది ఆర్మీ ఫ్యామిలీ. అలా భయపడవచ్చా!’ అని ధైర్యం చెప్పేవాడు....ఇలా తనకు తెలియకుండానే ‘ఆర్మీ’ అంటే ఇష్టం ఏర్పడింది. అదొక బలమైన ఆశయం అయింది.
PC: The Indian Express
‘భవిష్యత్‌లో నువ్వు ఏంకావాలనుకుంటున్నావు?’ అని టీచర్ అడిగితే తనతో పాటు చాలామంది ‘సోల్జర్’ అని చెప్పేవారు. అయితే తాను తప్ప అలా చెప్పిన వారెవరూ ఆ తరువాత కాలంలో ఆర్మీ గురించి ఆలోచించలేదు. వేరే చదువుల్లోకి వెళ్లిపోయారు. తల్లి గీతాదేవి గృహిణి.
‘నేను ఆర్మీలో పనిచేస్తాను’ అని ఆమెతో అన్నప్పుడు– ‘శభాష్’ అని భుజం తట్టడం తప్ప– ‘ఆడపిల్లలు సైన్యంలో ఎందుకు తల్లీ’ అని ఏరోజూ చిన్నబుచ్చలేదు. అక్క ఆర్మీలో నర్స్‌గా పనిచేస్తోంది.
రూర్కి, జైపుర్, చండీమందిర్(పంచ్‌కుల) ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో చదువుకుంది షానన్. తాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్ష గురించి ప్రిపేరవుతున్న సమయంలో ‘సీటు రావడం అంతా ఈజీ కాదు’ అనే ఒకేఒక్క మాట తప్ప మరేది వినిపించలేదు. కానీ ఆ మాటలను మనసులోకి తీసుకోకుండా ఎన్‌డీఏ పరీక్షలో మెరిట్ జాబితాలో ఆల్ ఇండియా ర్యాంక్(ఏఐఆర్) దక్కించుకొని అమ్మాయిల విభాగంలో టాప్‌లో నిలిచింది.
ఎప్పుడు సమయం దొరికినా కుటుంబంతో కలిసి సొంత గ్రామం సుందనకు వెళుతుంటుంది షానన్. ఆ ఊరివాళ్లు చిన్నప్పుడు ఆమెను ‘ఆర్మీ ఆఫీసర్’ అని పిలిచేవారు. వారి ఆత్మీయ పిలుపు నిజం కాబోతుంది. ‘సైన్యంలో ఉన్నత స్థాయిలోకి చేరాలనేది నా కల’ అంటుంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ గర్ల్ కెడెట్స్ ఫస్ట్ బ్యాచ్‌లో భాగం అవుతున్న షానన్.
షానన్‌తో పాటు మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన దివ్యాన్షి సింగ్, కనిష్క గుప్తాలకు కూడా అలాంటి కలలే ఉన్నాయి. బిహార్‌లోని చిన్న పట్టణానికి చెందిన దివ్యాన్షిసింగ్ ‘మెరిట్ జాబితాలో చోట సంపాదించడం నాలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఇది భవిష్యత్ విజయాలకు పునాది అవుతుందని ఆశిస్తున్నాను’ అంటుంది.
‘కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు...అనే మాటను చాలాసార్లు విన్నాను. ఇప్పుడు మాత్రం కష్టపడడం ద్వారా వచ్చే ఫలితాన్ని స్వయంగా చూశాను’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన కనిష్క గుప్తా. నిజానికి వారి కుటుంబంలో, బంధువులలో ఆర్మీలో పనిచేసిన వారు ఎవరూ లేరు. చిన్న వ్యాపార కుటుంబం వారిది.
‘గతంతో పోల్చితే ఎన్‌డీఏపై అమ్మాయిలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇది శుభపరిణామం’ అంటున్నారు ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేసిన అశోక్ శర్మ.
చదవండి: Monica Khanna: ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక.. 185 మందిని కాపాడి
Comments
Please login to add a commentAdd a comment