
రోహ్‌తక్: ధర్మపాల్ అలియాస్ కాలా.. హరియాణా రాష్ట్రం రోహ్‌తక్ జిల్లా చిరీ గ్రామ వాస్తవ్యుడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు పోటీ చేశాడు. కేవలం 66 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి గ్రామస్తులను కదిలించింది. ఆయనకు మద్దతుగా నిలిచారు. ధర్మపాల్‌ను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించి, రూ.2.11 కోట్ల నగదు అందజేశారు.
అంతేకుండా ఖరీదైన స్కార్పియో కారు కూడా బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే నగదు, కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ చెప్పారు. గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. జనం కోసమే తాను జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఆయన గతంలో లఖాన్ మాజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment