villageres
-
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి... రూ.2.11 కోట్లు, కారు
రోహ్తక్: ధర్మపాల్ అలియాస్ కాలా.. హరియాణా రాష్ట్రం రోహ్తక్ జిల్లా చిరీ గ్రామ వాస్తవ్యుడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు పోటీ చేశాడు. కేవలం 66 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి గ్రామస్తులను కదిలించింది. ఆయనకు మద్దతుగా నిలిచారు. ధర్మపాల్‌ను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించి, రూ.2.11 కోట్ల నగదు అందజేశారు. అంతేకుండా ఖరీదైన స్కార్పియో కారు కూడా బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే నగదు, కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ చెప్పారు. గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. జనం కోసమే తాను జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఆయన గతంలో లఖాన్ మాజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా పనిచేశాడు. -
మంచం పట్టిన లచ్చాపేట
మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేట గ్రామంలో ఉన్నట్టుండి వందలాది మం ది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలు, విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇన్చార్జి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు, వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ప్రజలు ఆదివారంనుంచి వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు. అయితే కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగి ఉం టుందని భావించారు. రోజురోజుకు జ్వరపీడితులు పెరుగుతుండడంతో ఆందో ళన చెందుతున్నారు. మంగళవారానికి యాభై మంది అస్వస్థతకు గురికాగా.. బుధవారానికి వారి సంఖ్య 436కు చేరింది. దీంతో వైద్యాధికారులు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 38 మందిని మాచారెడ్డి పీహెచ్‌సీకి, 16 మందిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్, కలెక్టర్ లచ్చాపేటలో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంగళవారం అర్ధరాత్రి గ్రామాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించిన ఆయన, పరిస్థితి తెలుసుకున్నారు. బుధవారం కలెక్టర్ సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ రాధ మ్మ, ఎక్సైజ్ సీఐ ఫణీందర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, తహసీల్దార్ శ్యామల గ్రామా న్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. గ్రామంలో పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు. కల్లు, నీటి నమూనాలను సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల అనంతరం కల్తీకల్లుతోనా, కలుషిత నీటితోనా అన్న విషయం తేలుతుందన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. వాంతులు, విరోచనాలు అయ్యాయి నాకు సోమవారం నుంచి వాంతులు, వీరేచనాలు అవుతున్నాయి. జ్వరం వచ్చింది. దీంతో ప్రైవేట్ వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నాను. మళ్లీ మంగళవారం వాంతులు, వీరేచనాలు ఎక్కువయ్యాయి. గ్రామంలోని వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నాను. – జగన్, బాధితుడు, లచ్చాపేట పరిస్థితి నిలకడగా ఉంది లచ్చాపేటలో వాంతులు, వీరేచనాలు, జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. అందరి పరిస్థితి నిలకడగా ఉంది. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి స్థానిక వైద్య శిబిరంలో చికిత్సలు అందిస్తున్నాం. కొంతమందిని మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరికొందరిని ఏరియా ఆస్పత్రికి తరలించాం. నీటి శాంపిళ్లు సేకరిస్తున్నాం. దేనివల్ల ఇలా అయ్యిందనేది పరీక్షల తర్వాత తెలుస్తుంది. – చంద్రశేఖర్, ఇన్చార్జి డీఎంహెచ్‌వో -
వివాహిత కిడ్నాప్‌కు విఫల యత్నం
మైదుకూరు టౌన్: ఓ వివాహిత యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన యువకులకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం మైదుకూరు మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మైదుకూరు మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఓ యువతికి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన యువకుడితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వృత్తి రీత్యా భర్త దూరప్రాంతంలో ఉండటంతో ఆమె నల్లపురెడ్డిపల్లెలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే కొంత కాలంగా మైదుకూరు మండలం కేశాపురం గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్ రెడ్డి అనే యువకుడు తనను ప్రేమించాలని ఈమెను వెంటపడుతుండటంతో ఆ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయ్‌కుమార్ దాదాపు 15 మంది తన స్నేహితులను తీసుకొని పలు వాహనాల్లో నల్లపురెడ్డిపల్లెకు వచ్చాడు. ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆ యువకులను అడ్డుకున్నారు. వారు గ్రామస్తులపై దాడికి యత్నిస్తూ వాహనాల్లో ఉడాయించారు. వీరిలో జాకీర్‌హుస్సేన్, హరిప్రసాద్ అనే యువకులు దొరకడంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా తల్లిదండ్రులతో కలసి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.