మైదుకూరు టౌన్: ఓ వివాహిత యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన యువకులకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన బుధవారం మైదుకూరు మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మైదుకూరు మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఓ యువతికి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన యువకుడితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది.
వృత్తి రీత్యా భర్త దూరప్రాంతంలో ఉండటంతో ఆమె నల్లపురెడ్డిపల్లెలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే కొంత కాలంగా మైదుకూరు మండలం కేశాపురం గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్ రెడ్డి అనే యువకుడు తనను ప్రేమించాలని ఈమెను వెంటపడుతుండటంతో ఆ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయ్‌కుమార్ దాదాపు 15 మంది తన స్నేహితులను తీసుకొని పలు వాహనాల్లో నల్లపురెడ్డిపల్లెకు వచ్చాడు. ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆ యువకులను అడ్డుకున్నారు. వారు గ్రామస్తులపై దాడికి యత్నిస్తూ వాహనాల్లో ఉడాయించారు. వీరిలో జాకీర్‌హుస్సేన్, హరిప్రసాద్ అనే యువకులు దొరకడంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా తల్లిదండ్రులతో కలసి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత కిడ్నాప్‌కు విఫల యత్నం
Published Thu, Aug 11 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement