
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.
కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు.
సెప్టెంబర్ 15 వ తేదీన రెండు సెషన్స్ లో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు., రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష.., సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
రాతపరీక్ష: సెప్టెంబర్ 15
పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in
2 లక్షల మందికిపైగా అభ్యర్థులు?
తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment