TS TET
-
తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సాక్షి ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది. ఇదీ చదవండి: 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు! -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్‌కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
టెట్ పరీక్షలో విషాదం.. గర్భిణి మృతి
సాక్షి, సంగారెడ్డి: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి ఎగ్జామ్ సెంటర్లో మృతి చెందిన పటాన్చెరు మండలం పరిధిలో జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే భయంతో.. రాధిక అనే అభ్యర్థిని పరీక్షకు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించింది. గచ్చిబౌలిలో రాధిక, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. రాధిక 8 నెలల గర్భంతో ఉంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్ పడింది. బైక్ పై ప్రయాణమై ఇస్నాపూర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆమె వేగంగా పరిగెత్తింది. సెంటర్‌కు చేరుకున్న వెంటనే ఆమెకు బీపీ ఎక్కువై చెమట్లు పట్టేశాయి. పరీక్ష సెంటర్లోనే కుప్పకూలి పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దిరికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
TS: ప్రారంభమైన టెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రారంభమైంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా హల్స్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పాఠశాల విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 1,139 పరీక్ష కేంద్రాల్లో ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 జరుగుతుంది. ► ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. -
తెలంగాణలో ఎల్లుండి ఆ స్కూళ్లకు హాలీడే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష ఈ నెల 15వ(శుక్రవారం) తేదీన జరగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటాయి. అయితే, ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేసిన స్కూళ్లకు ఎల్లుండి పూర్తిగా హాలీడే ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు.. రేపు(గురువారం కూడా) మధ్యాహ్నాం నుంచి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా.. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు ఒకటిన విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హల్ టికెట్లను అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచారు కూడా. టెట్ అభ్యర్థుల కోసం.. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి. పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసేబిలిటీ తదితర వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా లేకపోతే అభ్యర్థుల ఇటీవలి తాజా ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో పర్మిషన్ అనంతరమే పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయం తీసుకుంటారు. పరీక్షాకేంద్రం చిరునామాను ఒకరోజు ముందుగానే సంప్రదించడం ఉత్తమం. హల్ టికెట్ ఇతర వివరాల కోసం https://tstet.cgg.gov.in/ క్లిక్ చేయండి -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 15 వ తేదీన రెండు సెషన్స్ లో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు., రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష.., సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2 దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16 రాతపరీక్ష: సెప్టెంబర్ 15 పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఫీజు: రూ.400 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో వెబ్సైట్: https://tstet.cgg.gov.in 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు? తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. -
టెట్ పాస్.. మరి టీచర్ కొలువెప్పుడో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్ టెట్)లో ఉత్తీర్ణులైన వేలాదిమంది టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తుందంటూ ఆసక్తిగా వాకబు చేస్తున్నారు. 2016 నుంచి టెట్‌లో అర్హత సాధించిన అనేకమంది టీచర్ రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తున్న నేపథ్యం, టెట్ విధానాల్లో మార్పులు తేవడం, భారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ఉద్యోగాలు మానేసి:చాలామంది బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ప్రైవేటు స్కూళ్లల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లంతా గత జూన్‌లో జరిగిన టెట్ పరీక్షకు హాజరయ్యారు. గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షలమంది వరకూ టెట్ రాశారు. 1–5 తరగతులు బోధించేందుకు డీఎడ్ అర్హతతో టెట్ పేపర్–1 రాస్తారు. గతంలో ఈ పరీక్ష రాయడానికి బీఈడీ అభ్యర్థులు అర్హులుకారు. కానీ, ఈసారి టెట్‌లో బీఈడీ అభ్యర్థులు పేపర్–2తోపాటు పేపర్–1 రాసే వీలు కల్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 7 వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్–1 రాసి పోటీపడుతున్నారు. ఈ ఏడాది నియామకాలు ఉండేనా? రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో దాదాపు 19 వేల పోస్టులున్నట్టు ప్రభుత్వం లెక్కతేల్చింది. 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. అయితే, బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప వాస్తవ ఖాళీల లెక్క తెలియదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. దీంతో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లభించడంలేదని ఉపాధ్యాయవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడంతో పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతారని టెట్ అర్హత పొందినవారు ఆశించారు. ఈ నేపథ్యంలో వాస్తవ ఖాళీలు తెలియకుండా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తారా? టెట్ అర్హులకు అవకాశాలు లభిస్తాయా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగం మానేసి శిక్షణ ఈ ఏడాది టెట్‌లో అర్హత సాధించాను. ప్రైవేటు స్కూల్ టీచర్ ఉద్యోగం మానేసి ప్రభుత్వ టీచర్ నియామకం కోసం శిక్షణ తీసుకుంటున్నాను. కానీ, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియడం లేదు. – ప్రవీణ్, టెట్ ఉత్తీర్ణుడు, హైదరాబాద్ కరోనాతో రోడ్డెక్కా..టెట్‌తో ఆశలు బీఈడీ చేసిన తర్వాత ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నా. కోవిడ్ మూలంగా రెండేళ్ల నుంచి సరిగా జీతాలు ఇవ్వడంలేదు. ఊళ్ళో పొలం పనులకు వెళ్తున్నా. కానీ, టెట్ రావడం, ఉపాధ్యాయ నియామకాలు చేపడతారనే ఆశ రేకెత్తడంతో కోచింగ్ తీసుకుంటున్నాను. – ఆర్.జీవన్‌కుమార్, టెట్ అర్హుడు, వరంగల్ -
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో.. టీఎస్ టెట్ ఇంగ్లిష్ శిక్షణ
సిలబస్‌లోని అన్ని అంశాలపై వారం పాటు బోధన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు సన్నద్ధమయ్యే లక్షలాది మంది అభ్యర్థులకు తోడ్పాటు అందించేందుకు ‘సాక్షి’ ముందుకు వచ్చింది. ‘టెట్’లో విజయానికి ఎంతో కీలకమైన ఇంగ్లిష్‌పై అభ్యర్థులు పట్టు సాధించేలా టీఎస్ టెట్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ వర్క్‌షాప్‌లో టెట్ ఇంగ్లిష్‌కు సంబంధించిన అన్ని అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తారు. ఇంగ్లిష్ పేపర్–1, పేపర్–2లో వచ్చే సిలబస్‌పై రోజుకు రెండు గంటలపాటు పరీక్షల కోణంలో విస్తృత బోధన ఉంటుంది. వర్క్‌షాప్‌లో బోధించే అంశాలు: పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, ఫ్రేజల్ వర్బ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, కంపోజిషన్, వొకాబులరీ, మీనింగ్ ఆఫ్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సీక్వెన్సింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ది గివెన్ పేరాగ్రాఫ్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్ వితిన్ ఏ సెంటెన్స్, పెడగాగి తదితర అంశాలను బోధిస్తారు. వర్క్‌షాప్: జూన్ 27 నుంచి జూలై 3 వరకు.. సమయం: మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫీజు: రూ.1,500 రిజిస్ట్రేషన్లు, తరగతులు: ‘సాక్షి’ ప్రధాన కార్యాలయం, కేర్ ఆస్పత్రి సమీపంలో,బంజారాహిల్స్ రోడ్ నం.1, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300లో లేదా sakshiedge@gmail.comలో గానీ సంప్రదించవచ్చు -
‘టెట్’ గైడ్‌లైన్స్ ఖరారు
* ఉపాధ్యాయ విద్యా కోర్సుల చివరి ఏడాది విద్యార్థులకూ చాన్స్ * మార్చి 3వ వారంలో నోటిఫికేషన్ * ఏప్రిల్ రెండో వారంలో పరీక్ష * ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ కొనసాగింపు * ప్రైవేటు స్కూళ్ల టీచర్లూ టెట్ రాయాల్సిందే... ఇక నుంచి ఏటా ఏప్రిల్ లేదా మేలో ‘టెట్’ * మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయ విద్యా కోర్సుల ఫైనలియర్ చదువుతున్నవారికీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లుగానే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో తప్పనిసరిగా టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లందరూ తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణులు కావాల్సిందేనని స్పష్టం చేసింది. చర్యలు వేగవంతం.. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మార్చి నెల మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ రెండో వారంలో టెట్ నిర్వహించాలని నిర్ణయించిన... మూడు రోజుల్లోనే అందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం జీవో 36 జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 9న టెట్ నిర్వహణకు మార్గం సుగమం అయింది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఐదు లక్షల మందికిపైగా అభ్యర్థులు ఇక పూర్తిస్థాయి ప్రిపరేషన్‌పై దృష్టి సారించనున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా టీచర్లలో ఎప్పటికప్పుడు సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు టెట్ నిర్వహించాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీచర్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. ప్రైవేటు స్కూల్ టీచర్లకు కూడా ఇది తప్పనిసరి. మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలు - ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే వారు టెట్ పేపర్-1 రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు పేపర్-2 పరీక్ష రాయాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించేందుకు అర్హత కావాలనుకునే వారు రెండు పేపర్లూ రాయాలి. - బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ఫైనలియర్ చదువుతున్న వారు టెట్ రాయవచ్చు. అయితే వారు టెట్‌లో అర్హత సాధించినా... డీఎస్సీ రాయాలంటే మాత్రం ఉపాధ్యాయ విద్యా కోర్సులను పూర్తి చేసుకుని ఉండాల్సిందే. - ఎన్సీటీఈ గుర్తించిన డిగ్రీ/డిప్లొమాలను మాత్రమే అనుమతిస్తారు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న డీఎడ్, డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకుంటారు. - రాష్ట్ర ఇంటర్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన సంస్థలు జారీ చేసే సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకుంటారు. యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీలు జారీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పేపర్-1 రాయాలంటే.. 1. ఈ మార్గదర్శకాల జారీ తేదీ కంటే ముందు ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో (రెండేళ్ల డీఎడ్/నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/రెండేళ్ల డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్)) చేరినవారు, ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు... ఇంటర్/తత్సమాన కోర్సులో జనరల్ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. 2. భవిష్యత్తులో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో చేరేవారు ఇంటర్/తత్సమాన కోర్సులో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్-1కు అర్హులు. పేపర్-2 రాయాలంటే.. 1. ఈ మార్గదర్శకాల జారీ తేదీ కంటే ముందు ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో (బీఎడ్/బీఎడ్-స్పెషల్ ఎడ్యుకేషన్) చేరిన వారు, ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం, ఎస్సీ, ఎస్సీ, బీసీ, విక లాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2. భవిష్యత్తులో బీఎడ్/బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో చేరేవారు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్సీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. 3. నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్, బీఎస్సీ ఎడ్యుకేషన్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. 4. ఆప్షనల్ గా డిగ్రీలో భాషా సబె ్జక్టు చదివిన వారు, బీవోఎల్ లేదా డిగ్రీ లిటరేచర్, పీజీలో సంబంధిత సబ్జెక్టు, పండిత శిక్షణ కోర్సులు, భాషా పండిట్ అయితే సంబంధిత భాషలో మెథడాలజీ చదివిన వారు పేపర్-2 రాయవచ్చు. లాంగ్వేజ్-1 ఎలా ఎంచుకోవాలంటే.. ప్రశ్నపత్రాల కోసం తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, సంస్కృతం భాషల్లో ఏదో ఒక భాషను అభ్యర్థి (భాషా పండితులు మినహా) లాంగ్వేజ్-1గా ఎంచుకోవాలి. అభ్యర్థి పదో తరగతి వరకు ఆ భాషను సబ్జెక్టుగాగానీ, ఆ మీడియంలో గానీ చదివి ఉండాలి. సీబీఎస్ఈ/ఐసీఎస్సీ సిలబస్‌లో చదివిన వారు పదో తరగతి వరకు చదివిన వాటిలో ఏదో ఒక భాషను ఎంచుకోవాలి. అభ్యర్థి ఎంచుకున్న భాష-1, భాష-2 (ఇంగ్లిషు)లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏటా ఏప్రిల్/మేలో టెట్ ఏటా ఒకసారైనా టెట్ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాలి. అది కూడా ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించాలి. టెట్‌లో అర్హత సాధించిన వారు తమ స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ మళ్లీ టెట్ రాయవచ్చు. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలకోసారి టెట్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేయగా.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏడాదికోసారి నిర్వహించాలని నిర్ణయించింది. మార్కుల విధానమిదీ.. పేపర్-1లో.. - 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. - శిశు అభివృద్ధి, వికాసానికి 30 మార్కులు, భాష-1కు 30 మార్కులు, భాషా-2 (ఇంగ్లిషు)కు 30మార్కులు, గణితం అంశాలకు 30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌కు 30 మార్కులు ఉంటాయి. పేపర్-2లో - 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. - శిశు అభివృద్ధి, వికాసానికి 30 మార్కులు, భాష-1కు 30 మార్కులు, భాషా-2 (ఇంగ్లిషు)కు 30 మార్కులు ఉంటాయి. - గణితం, సైన్స్ టీచర్ కావాలనుకునే వారికి ఆయా అంశాల్లో 60 మార్కులు ఉంటాయి. - సాంఘికశాస్త్రం, ఇతర (పండిట్ తదితర) టీచర్ కావాలనుకునే వారికి సోషల్ స్టడీస్‌లో 60 మార్కులకు (హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు అంశాలకు 48 మార్కులు, పెడగాజీకి 12 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. - శిశు అభివృద్ధి వికాసంపై పరీక్ష ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం బోధన, అభ్యసన ప్రక్రియలపై ఉంటుంది. అర్హత.. వ్యాలిడిటీ.. వెయిటేజీ - జనరల్ అభ్యర్థులైతే టెట్‌లో కనీసం 60 శాతం (90 మార్కులు) మార్కులు సాధించాలి. బీసీలైతే 50 శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే కనీసం 40 శాతం (60 మార్కులు) సాధించాలి. వారికే టెట్‌లో అర్హత సాధించినట్లు ఎస్సీఈఆర్టీ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. - టెట్ సర్టిఫికెట్లకు ఏడేళ్ల కాల పరిమితి (వ్యాలిడిటీ) ఉంటుంది. - టెట్‌లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో వెయిటే జీ ఇస్తారు. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక జాబితాలను సిద్ధం చేస్తారు. - టెట్‌ను తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ 2010 ఆగస్టు 23న నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అయితే ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్ల నియామకాలకు కాంపిటెంట్ అథారిటీ ఆమోదం లేనట్లయితే ఆ టీచర్లకు ఈ మినహాయింపు వర్తించదు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే వారైనా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. టెట్ కమిటీ ఏర్పాటు స్కూల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చైర్‌పర్సన్‌గా ‘టెట్’ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ (కో-ఆర్డినేషన్), ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ (సర్వీసెస్) సభ్యులుగా వ్యవహరిస్తారు. పరీక్షల నోటిఫికేషన్, నిర్వహణ, షెడ్యూలు జారీ, పర్యవేక్షణ తదితర అన్ని వ్యవహారాలను ఈ కమిటీ నిర్వహిస్తుంది. నోడల్ ఆఫీసర్‌గా ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ మార్చి మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ రెండో వారంలో (వీలైతే 9వ తేదీన) పరీక్ష నిర్వహించేందుకు టెట్ సెల్‌ను ఏర్పాటు చేసింది. టెట్ నోడల్ ఆఫీసర్, ఎక్స్అఫీషియో డెరైక్టర్‌గా ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ వ్యవహరిస్తారు. ఆయన నేతృత్వంలో పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టాలి. ఈ సెల్లో ఒక డిప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్, సూపరింటెండెంట్, ఐదుగురు సిబ్బంది ఉంటారు.