‘టెట్’ గైడ్‌లైన్స్ ఖరారు
* ఉపాధ్యాయ విద్యా కోర్సుల చివరి ఏడాది విద్యార్థులకూ చాన్స్
* మార్చి 3వ వారంలో నోటిఫికేషన్
* ఏప్రిల్ రెండో వారంలో పరీక్ష
* ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ కొనసాగింపు
* ప్రైవేటు స్కూళ్ల టీచర్లూ టెట్ రాయాల్సిందే... ఇక నుంచి ఏటా ఏప్రిల్ లేదా మేలో ‘టెట్’
* మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయ విద్యా కోర్సుల ఫైనలియర్ చదువుతున్నవారికీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లుగానే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో తప్పనిసరిగా టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లందరూ తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణులు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
చర్యలు వేగవంతం..
రాష్ట్రంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మార్చి నెల మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ రెండో వారంలో టెట్ నిర్వహించాలని నిర్ణయించిన... మూడు రోజుల్లోనే అందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం జీవో 36 జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 9న టెట్ నిర్వహణకు మార్గం సుగమం అయింది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఐదు లక్షల మందికిపైగా అభ్యర్థులు ఇక పూర్తిస్థాయి ప్రిపరేషన్‌పై దృష్టి సారించనున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా టీచర్లలో ఎప్పటికప్పుడు సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు టెట్ నిర్వహించాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీచర్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. ప్రైవేటు స్కూల్ టీచర్లకు కూడా ఇది తప్పనిసరి.
మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలు
- ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే వారు టెట్ పేపర్-1 రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు పేపర్-2 పరీక్ష రాయాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించేందుకు అర్హత కావాలనుకునే వారు రెండు పేపర్లూ రాయాలి.
- బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ఫైనలియర్ చదువుతున్న వారు టెట్ రాయవచ్చు. అయితే వారు టెట్‌లో అర్హత సాధించినా... డీఎస్సీ రాయాలంటే మాత్రం ఉపాధ్యాయ విద్యా కోర్సులను పూర్తి చేసుకుని ఉండాల్సిందే.
- ఎన్‌సీటీఈ గుర్తించిన డిగ్రీ/డిప్లొమాలను మాత్రమే అనుమతిస్తారు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న డీఎడ్, డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
- రాష్ట్ర ఇంటర్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన సంస్థలు జారీ చేసే సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకుంటారు. యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీలు జారీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకుంటారు.
ఏ పేపర్‌కు ఎవరు అర్హులు?
పేపర్-1 రాయాలంటే..
1. ఈ మార్గదర్శకాల జారీ తేదీ కంటే ముందు ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో (రెండేళ్ల డీఎడ్/నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/రెండేళ్ల డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్)) చేరినవారు, ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు... ఇంటర్/తత్సమాన కోర్సులో జనరల్ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు.
2. భవిష్యత్తులో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో చేరేవారు ఇంటర్/తత్సమాన కోర్సులో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్-1కు అర్హులు.
పేపర్-2 రాయాలంటే..
1. ఈ మార్గదర్శకాల జారీ తేదీ కంటే ముందు ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో (బీఎడ్/బీఎడ్-స్పెషల్ ఎడ్యుకేషన్) చేరిన వారు, ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం, ఎస్సీ, ఎస్సీ, బీసీ, విక లాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
2. భవిష్యత్తులో బీఎడ్/బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో చేరేవారు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్సీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.
3. నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్, బీఎస్సీ ఎడ్యుకేషన్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.
4. ఆప్షనల్ గా డిగ్రీలో భాషా సబె ్జక్టు చదివిన వారు, బీవోఎల్ లేదా డిగ్రీ లిటరేచర్, పీజీలో సంబంధిత సబ్జెక్టు, పండిత శిక్షణ కోర్సులు, భాషా పండిట్ అయితే సంబంధిత భాషలో మెథడాలజీ చదివిన వారు పేపర్-2 రాయవచ్చు.
లాంగ్వేజ్-1 ఎలా ఎంచుకోవాలంటే..
ప్రశ్నపత్రాల కోసం తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, సంస్కృతం భాషల్లో ఏదో ఒక భాషను అభ్యర్థి (భాషా పండితులు మినహా) లాంగ్వేజ్-1గా ఎంచుకోవాలి. అభ్యర్థి పదో తరగతి వరకు ఆ భాషను సబ్జెక్టుగాగానీ, ఆ మీడియంలో గానీ చదివి ఉండాలి. సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌సీ సిలబస్‌లో చదివిన వారు పదో తరగతి వరకు చదివిన వాటిలో ఏదో ఒక భాషను ఎంచుకోవాలి. అభ్యర్థి ఎంచుకున్న భాష-1, భాష-2 (ఇంగ్లిషు)లో ప్రశ్నపత్రం ఉంటుంది.
ఏటా ఏప్రిల్/మేలో టెట్
ఏటా ఒకసారైనా టెట్ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాలి. అది కూడా ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించాలి. టెట్‌లో అర్హత సాధించిన వారు తమ స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ మళ్లీ టెట్ రాయవచ్చు. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలకోసారి టెట్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేయగా.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏడాదికోసారి నిర్వహించాలని నిర్ణయించింది.
మార్కుల విధానమిదీ..
పేపర్-1లో..
- 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు.
- శిశు అభివృద్ధి, వికాసానికి 30 మార్కులు, భాష-1కు 30 మార్కులు, భాషా-2 (ఇంగ్లిషు)కు 30మార్కులు, గణితం అంశాలకు 30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌కు 30 మార్కులు ఉంటాయి.
పేపర్-2లో
- 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి.
- శిశు అభివృద్ధి, వికాసానికి 30 మార్కులు, భాష-1కు 30 మార్కులు, భాషా-2 (ఇంగ్లిషు)కు 30 మార్కులు ఉంటాయి.
- గణితం, సైన్స్ టీచర్ కావాలనుకునే వారికి ఆయా అంశాల్లో 60 మార్కులు ఉంటాయి.
- సాంఘికశాస్త్రం, ఇతర (పండిట్ తదితర) టీచర్ కావాలనుకునే వారికి సోషల్ స్టడీస్‌లో 60 మార్కులకు (హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు అంశాలకు 48 మార్కులు, పెడగాజీకి 12 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి.
- శిశు అభివృద్ధి వికాసంపై పరీక్ష ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం బోధన, అభ్యసన ప్రక్రియలపై ఉంటుంది.
అర్హత.. వ్యాలిడిటీ.. వెయిటేజీ
- జనరల్ అభ్యర్థులైతే టెట్‌లో కనీసం 60 శాతం (90 మార్కులు) మార్కులు సాధించాలి. బీసీలైతే 50 శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే కనీసం 40 శాతం (60 మార్కులు) సాధించాలి. వారికే టెట్‌లో అర్హత సాధించినట్లు ఎస్‌సీఈఆర్‌టీ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది.
- టెట్ సర్టిఫికెట్లకు ఏడేళ్ల కాల పరిమితి (వ్యాలిడిటీ) ఉంటుంది.
- టెట్‌లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో వెయిటే జీ ఇస్తారు. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక జాబితాలను సిద్ధం చేస్తారు.
- టెట్‌ను తప్పనిసరి చేస్తూ ఎన్‌సీటీఈ 2010 ఆగస్టు 23న నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అయితే ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్ల నియామకాలకు కాంపిటెంట్ అథారిటీ ఆమోదం లేనట్లయితే ఆ టీచర్లకు ఈ మినహాయింపు వర్తించదు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే వారైనా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే.
టెట్ కమిటీ ఏర్పాటు
స్కూల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చైర్‌పర్సన్‌గా ‘టెట్’ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ (కో-ఆర్డినేషన్), ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ (సర్వీసెస్) సభ్యులుగా వ్యవహరిస్తారు. పరీక్షల నోటిఫికేషన్, నిర్వహణ, షెడ్యూలు జారీ, పర్యవేక్షణ తదితర అన్ని వ్యవహారాలను ఈ కమిటీ నిర్వహిస్తుంది.
నోడల్ ఆఫీసర్‌గా ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్
మార్చి మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ రెండో వారంలో (వీలైతే 9వ తేదీన) పరీక్ష నిర్వహించేందుకు టెట్ సెల్‌ను ఏర్పాటు చేసింది. టెట్ నోడల్ ఆఫీసర్, ఎక్స్‌అఫీషియో డెరైక్టర్‌గా ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ వ్యవహరిస్తారు. ఆయన నేతృత్వంలో పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టాలి. ఈ సెల్‌లో ఒక డిప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్, సూపరింటెండెంట్, ఐదుగురు సిబ్బంది ఉంటారు.