ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏప్రిల్ 30 వరకు తరగతులు కొనసాగుతాయని, మే నెలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. టెన్త్ పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయన్నది ఇంకా నిర్ణయం కాలేదని, దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు తదితరులతో మంగళవారం యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు.
జనవరిలో ఫార్మేటివ్ ఎగ్జామ్స్
9, 10 తరగతుల విద్యార్థులకు జనవరి 6, 7, 8 తేదీల్లో, 7, 8 తరగతులకు జనవరి 21, 22, 23 తేదీల్లో ఫార్మేటివ్–1 పరీక్షలు ఉంటాయన్నారు. అన్ని స్కూళ్లలో ఏప్రిల్ 30 వరకు తరగతులు నిర్వహిస్తారని, సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు హడావుడి పడాల్సిన పనిలేదని చెప్పారు. ఎస్సెస్సీ పరీక్షల్లో ఆప్షనల్ అంశాలు ఏమీ ఉండవని, సిలబస్ తగ్గించినందున అన్ని అంశాలనూ కూలంకషంగా బోధించాలన్నారు. తరగతుల్లో గైడ్లను అనుసరించి బోధన చేయకూడదని, అలా చేసే వారిపై చర్యలుంటాయని పేర్కొన్నారు. టెన్త్ తరువాత ఏం చేయాలన్న దానిపై విద్యార్థులు వారికి అభిలాష ఉన్న రంగాలను ఎంచుకునేలా ముందుగానే కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఎస్సీఈఆర్టీ నిర్వహిస్తోందని తెలిపారు.
విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు, పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన చదువులు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందుకోసం వేలకోట్ల బడ్జెట్‌ను కేటాయించారని వివరించారు. అందువల్ల ప్రతి పేద విద్యార్థికి న్యాయం జరిగేలా టీచర్లు కృషి చేయాలని కోరారు. దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలు రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి విద్యార్థి పాస్ కావడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. నేషనల్ టాయ్ ఫెస్టివల్‌ను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి నెలలో మొదటి, మూడో శని వారాలను నో బ్యాగ్ డేగా తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. (చదవండి: గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు దాడి)
నీట్, ఐఐటీ–జేఈఈ సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ ఏర్పాటు
అమరావతి: నీట్, ఐఐటీ–జేఈఈ ఔత్సాహిక విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం ఎల్‌హెచ్‌ఎల్ కంచన ఫౌండేషన్, ఐఐటీ –జేఈఈ, నీట్ ఫోరం ఆధ్వర్యం లో హెల్ప్‌లైన్ నంబర్ 9052516661 ను ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ కె.లలిత్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌లైన్ సేవలు పొందవచ్చన్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో సమాచారం పొందవచ్చని చెప్పారు. హెల్ప్‌లైన్ ద్వారా నీట్, ఐఐటీ–జేఈఈ, కేవీపీవై, ఎన్‌టీఎస్‌ఈ, ఒలంపియాడ్ పరీక్షలు, అకడమిక్స్ సమాచారం, ఫ్యాకల్టీ సమాచారం, గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తో పాటు సలహాలు, సూచనలు పొందవచ్చని వివరించారు. అలాగే సందేహ నివృత్తికి helpline@ iitjeeforum. com, Support@ iitjeeforum. com నకు మెయిల్ పంపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment