డీఎడ్‌ కాలేజీల దందాకు చెక్‌ | DED Exams Will Be Held From November 5 to 11 | Sakshi
Sakshi News home page

డీఎడ్‌ కాలేజీల దందాకు చెక్‌

Published Fri, Oct 30 2020 6:37 PM | Last Updated on Fri, Oct 30 2020 6:50 PM

DED Exams Will Be Held From November 5 to 11 - Sakshi

సాక్షి, అమరావతి: ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల అక్రమ ప్రవేశాల దందాకు అడ్డుకట్ట పడింది. 2018-20 బ్యాచ్‌లో అనధికారిక ప్రవేశాలు పొందిన వారందరూ పరీక్షలకు దూరమయ్యారు. కేవలం అధికారిక ప్రవేశాలు పొందిన వారు మాత్రమే పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్‌ 5 నుంచి 11 వరకు వీరికి పరీక్షలు నిర్వహించనున్నారు. 

67 వేల సీట్లు.. 14,530 మందే అర్హులు
2018-20 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎడ్‌ ప్రవేశాల కోసం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన డీసెట్‌కు 22 వేల మంది వరకు దరఖాస్తు చేయగా.. 18 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2 వేల మంది వరకు అర్హత సాధించారు. డీసెట్‌ పరీక్ష రాసేందుకు ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించాలి. ఇక డీసెట్‌లో ఓసీ, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు రావాలి. అలా అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 744 డీఎడ్‌ కాలేజీలుండగా.. ప్రభుత్వ కాలేజీలు 21 మాత్రమే ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 67 వేల వరకు సీట్లున్నాయి. డీసెట్‌ పరీక్ష రాసి అర్హత సాధించిన వారికి ఈ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా​ద్వారా ప్రవేశాలు కల్పించాలి. అయితే అర్హత సాధించిన వారు 2 వేల మందే ఉండటంతో.. అప్పట్లో పలు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టచెప్పి ఓసీ, బీసీలకు అర్హత మార్కులను 30 శాతానికి తగ్గించేలా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులను పూర్తిగా ఎత్తివేసేలా ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అలా మార్కులు తగ్గించినా కూడా 14,530 మందే అర్హత సాధించారు. వీరికి అప్పట్లో కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటా సీట్లు కేటాయించారు.

25 వేల వరకు అనధికారిక ప్రవేశాలు..
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరో 25 వేల మందిని అనధికారికంగా చేర్చుకున్నాయి. ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశాయి. వీరిలో అనేక మంది డీసెట్‌ కూడా రాయలేదు. ఇంటర్‌లో నిర్ణీత అర్హత మార్కులూ సాధించలేదు. అయినా వీరిని అనధికారికంగా చేర్చుకొని.. గతంలో మాదిరిగా కన్వీనర్‌ ద్వారా అనుమతులిప్పించే ప్రయత్నం చేశాయి. విద్యార్థులకు కూడా ఈ మేరకు మాయమాటలు చెప్పి పెద్ద ఎత్తున ప్రవేశాలు జరిపాయి. వీటన్నింటికీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. అనధికారిక చేరికలకు చెక్‌ పెట్టింది. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. కానీ అక్కడ కూడా కాలేజీలకు చుక్కెదురయ్యింది. ఈ నేపథ్యంలో 21,085 మంది విద్యార్థులకు 178 సెంటర్లలో వచ్చే నెల 5 నుంచి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 14,530 మంది ఉండగా.. ప్రైవేటు విద్యార్థులు 6,555 మంది ఉన్నారు. కాగా, అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈఏపీ.వోఆర్‌జీ’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement