DED exams
-
ఇదేందయ్యా ఇది: డీఎడ్ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్
ఆదిలాబాద్‌టౌన్: డీఎడ్ చదివే వారంతా భావితర ఉపాధ్యాయులే.ఇక్కడ నేర్చుకుంటేనే గురువులయ్యాక విద్యార్థులను తీర్చిదిద్దేది. అయితే కష్టపడి చదవి పరీక్షలు రాయాల్సిన ఛాత్రోపాధ్యాయులు కా పీయింగ్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడడమే కాకుండా ఇన్విజిలేటర్ నే బెదిరించిన ఘటన చోటు చేసుకున్నా పరీక్షల ని ర్వహణ తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. పరీక్షలు రాసిన విద్యార్థులే కాపీయింగ్ విషయంపై బయట చర్చించుకోవడం నిర్వహణ తీరుకు అద్దం పడుతుంది. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలతో పాటు ప్రైవేట్ బీఎడ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. పట్టణంలోని గెజిటెడ్ నం.1లో ఈనెల 22 నుంచి డీఎడ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారంతో ముగియనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి్సన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో కష్టపడి చదివిన విద్యారులు, కాపీ కొట్టే వారు ఒకే చోటికి చేరే పరిస్థితి. ఇన్విజిలేటర్లే సూత్రధారులు.. ఈ మాస్ కాపీయింగ్‌కు కొంతమంది ఇన్విజిలేటర్లే సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డైట్ కళాశాల, డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వారికి ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే కళాశాలలో చదివిన విద్యార్థులకు అక్కడివారే ఇన్విజిలేటర్లుగా ఉండడంతో ఈ తతంగం జోరుగా సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సెంటర్‌కు అధికారులు వస్తే ముందుగానే విద్యార్థులకు సమాచారం అందిస్తున్నారు. డోర్ దగ్గర నిలబడి విద్యార్థులు తమ పని తాము కానిచ్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. చీటీలు రాసిన తర్వాత వాటిని ఇన్విజిలెటర్ల దగ్గర ఉంచుకోవడం కొసమెరుపు. పట్టించుకోని అధికారులు.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన విద్యాశాఖాధికారులు పట్టనట్లుగా ఉండడంతో పరీక్షల తీరు మారిపోయిందనే విమర్శలున్నాయి. కొంతమంది ఇన్విజిలేటర్లు కొందరిని చూసిరాయనివ్వడం, మరికొంత మందిని కాపీయింగ్ జరగకుండా చూడడంతో ఇటీవల ఓ విద్యార్థి పరీక్ష నిర్వాహకులతో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి అధికారులను వారిని ఎందుకు చూసి రాయనిస్తున్నారు.. మమ్మల్ని ఎందుకు రాయనివ్వడం లేదని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం బయటపడకుండా ఇన్విజిలేటర్లు, అధికారులు పరీక్షలను చూసీచూడనట్లుగా వదిలేసినట్లుగా సమాచారం. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. -
బీఈడీ అభ్యర్థులకూ పేపర్–1 అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో తీసుకొచ్చిన మార్పులు తమకు నష్టం చేస్తాయని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్–1 రాస్తారు. వీరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు (ఎస్జీటీ) అర్హులవుతారు. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సాధారణంగా పేపర్–2 రాస్తారు. వీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్–2తో పాటు, పేపర్–1 కూడా రాసే అవకాశం కల్పించారు. దీంతో వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కాకుండా, ఎస్జీటీ పోస్టులకూ పోటీ పడే వీలుంది. దీంతో తమకు అవకాశాలు తగ్గుతాయని డీఎడ్ అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపడితే.. 6,500 ఎస్జీటీ, 3 వేలపైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. డీఎడ్ నాణ్యతపైనే సందేహాలు... వాస్తవానికి కొన్నేళ్లుగా డీఎడ్ కాలేజీల్లో ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆ అభ్యర్థులు చెబుతున్నారు. సరైన ఆదరణ లేక ప్రైవేటు కాలేజీలు పెద్దగా దృష్టి పెట్టలేదంటున్నారు. నిజానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో సగం డీఎడ్ కాలేజీలు మూతపడ్డాయి. 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు సరైన ఫ్యాకల్టీని నియమించడం లేదనే ఆరోపణలున్నాయి. మారుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సైకాలజీ తెలుసుకుని బోధించే మెళకువలు, ప్రాజెక్టు వర్క్‌లు అసలే ఉండటం లేదని డీఎడ్ అభ్యర్థులు అంటున్నారు. మాకు అన్యాయమే... ఉపాధ్యాయ పోస్టుకు బీఈడీ అభ్యర్థులతో సమానంగా మేమెలా పోటీపడగలం. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ వారికే పరిమితం చేస్తే బాగుండేది. చిన్న తరగతులకు బోధించే విధానాలే డీఎడ్‌లో ఉంటాయి. పెద్ద తరగతులకు బీఈడీ సరిపోతుంది. బీఈడీ అభ్యర్థులు తేలికగా మా స్థాయి పోస్టులు సాధిస్తే, మాకు అన్యాయం జరుగుతుంది. – ప్రవీణ్ కుమార్ (డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థి) వారితో పోటీ సరికాదు... బీఈడీ, డీఎడ్ బోధనా విధానంలో చాలా మార్పులున్నాయి. కాలేజీలు కూడా డీఎడ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లేదు. ప్రయోగాత్మక బోధనా పద్ధతులపై దృష్టి పెట్టడం లేదు. ఇవన్నీ డీఎడ్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో మా స్థాయి పోస్టులకు బీఈడీ వారినీ పోటీకి తేవడం సరికాదు. – సంజీవ్ వర్థన్ (టెట్‌కు దరఖాస్తు చేసిన డీఎడ్ అభ్యర్థి) -
డీఎడ్ కాలేజీల దందాకు చెక్
సాక్షి, అమరావతి: ప్రైవేటు డీఎడ్ కాలేజీల అక్రమ ప్రవేశాల దందాకు అడ్డుకట్ట పడింది. 2018-20 బ్యాచ్‌లో అనధికారిక ప్రవేశాలు పొందిన వారందరూ పరీక్షలకు దూరమయ్యారు. కేవలం అధికారిక ప్రవేశాలు పొందిన వారు మాత్రమే పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 5 నుంచి 11 వరకు వీరికి పరీక్షలు నిర్వహించనున్నారు. 67 వేల సీట్లు.. 14,530 మందే అర్హులు 2018-20 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఎడ్ ప్రవేశాల కోసం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన డీసెట్‌కు 22 వేల మంది వరకు దరఖాస్తు చేయగా.. 18 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2 వేల మంది వరకు అర్హత సాధించారు. డీసెట్ పరీక్ష రాసేందుకు ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించాలి. ఇక డీసెట్‌లో ఓసీ, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు రావాలి. అలా అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 744 డీఎడ్ కాలేజీలుండగా.. ప్రభుత్వ కాలేజీలు 21 మాత్రమే ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 67 వేల వరకు సీట్లున్నాయి. డీసెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన వారికి ఈ కాలేజీల్లో కన్వీనర్ కోటాద్వారా ప్రవేశాలు కల్పించాలి. అయితే అర్హత సాధించిన వారు 2 వేల మందే ఉండటంతో.. అప్పట్లో పలు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టచెప్పి ఓసీ, బీసీలకు అర్హత మార్కులను 30 శాతానికి తగ్గించేలా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులను పూర్తిగా ఎత్తివేసేలా ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అలా మార్కులు తగ్గించినా కూడా 14,530 మందే అర్హత సాధించారు. వీరికి అప్పట్లో కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించారు. 25 వేల వరకు అనధికారిక ప్రవేశాలు.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరో 25 వేల మందిని అనధికారికంగా చేర్చుకున్నాయి. ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశాయి. వీరిలో అనేక మంది డీసెట్ కూడా రాయలేదు. ఇంటర్లో నిర్ణీత అర్హత మార్కులూ సాధించలేదు. అయినా వీరిని అనధికారికంగా చేర్చుకొని.. గతంలో మాదిరిగా కన్వీనర్ ద్వారా అనుమతులిప్పించే ప్రయత్నం చేశాయి. విద్యార్థులకు కూడా ఈ మేరకు మాయమాటలు చెప్పి పెద్ద ఎత్తున ప్రవేశాలు జరిపాయి. వీటన్నింటికీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనధికారిక చేరికలకు చెక్ పెట్టింది. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. కానీ అక్కడ కూడా కాలేజీలకు చుక్కెదురయ్యింది. ఈ నేపథ్యంలో 21,085 మంది విద్యార్థులకు 178 సెంటర్లలో వచ్చే నెల 5 నుంచి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 14,530 మంది ఉండగా.. ప్రైవేటు విద్యార్థులు 6,555 మంది ఉన్నారు. కాగా, అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.వోఆర్జీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి సూచించారు. -
ఆగస్టు 3 నుంచి డీఈడీ ఫస్టియర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 8వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. 2018–2020 బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా పరీక్షలకు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంటలో ఇస్తారని డైరెక్టర్ తెలిపారు. ఎల్పీటీ పరీక్ష ఫలితాలు విడుదల సాక్షి, అమరావతి: 2018–19 బ్యాచ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ విద్యార్థులకు, అంతకు ముందు ఫెయిలైన వారికి జనవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 95.31 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. తమ కార్యాలయ వెబ్సైట్లో ఫలితాలను పొందుపరిచినట్లు చెప్పారు. రీ కౌంటింగ్ కోసం జూన్ 15లోగా ఏపీసీఎఫ్‌ఎంఎస్‌లో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. -
నవంబర్ 3 నుంచి డీఎడ్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎడ్ ద్వితీయ సంవత్సరం (2014–16 బ్యాచ్) పరీక్షలు నవంబర్ 3 నుంచి 8 వరకు నిర్వహిస్తామని జిలా విద్యాశాఖ అధికారి అంజయ్య, ప్రభుత్వ పరీక్ష అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇదివరకు ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చన్నారు. 3న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (మాతృభాషా తెలుగు/ఉర్దూ/తమిళం), 4న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (ఇంగ్లీష్), 5న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్ గణితం), 7న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్ సైన్స్), 8న మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ( సోషియల్ స్టడీస్) పరీక్షలు ఉంటాయని వారు తెలిపారు. -
29 నుంచి డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో 2013-15 బ్యాచ్ డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఆర్.సురేందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 29న పేపర్ 1- ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జింగ్ ఇండియా, 30న పేపర్ 2 - ఎడ్యుకేషనల్ సైకాలజీ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, 31న పేపర్ 3 - ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ అండ్ టీచర్ ఫంక్షన్స్, జనవరి 1న పేపర్ 4 - పర్స్పెక్టివ్స్ ఇన్ ప్రైమరీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, 2వ తేదీన పేపర్ 5 - కెపాసిటీ బిల్డింగ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.