Telangana: Mass copying during D. Ed exam at Adilabad - Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది: డీఎడ్‌ పరీక్షల్లో భారీగా మాస్‌ కాపీయింగ్‌

Feb 28 2023 10:47 AM | Updated on Feb 28 2023 2:56 PM

Mass copying in DEd exams In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: డీఎడ్‌ చదివే వారంతా భావితర ఉపాధ్యాయులే.ఇక్కడ నేర్చుకుంటేనే గురువులయ్యాక విద్యార్థులను తీర్చిదిద్దేది. అయితే కష్టపడి చదవి పరీక్షలు రాయాల్సిన ఛాత్రోపాధ్యాయులు కా పీయింగ్‌కు అలవాటు పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడడమే కాకుండా ఇన్విజిలేటర్‌ నే బెదిరించిన ఘటన చోటు చేసుకున్నా పరీక్షల ని ర్వహణ తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. పరీక్షలు రాసిన విద్యార్థులే కాపీయింగ్‌ విషయంపై బయట చర్చించుకోవడం నిర్వహణ తీరుకు అద్దం పడుతుంది. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలతో పాటు ప్రైవేట్‌ బీఎడ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. పట్టణంలోని గెజిటెడ్‌ నం.1లో ఈనెల 22 నుంచి డీఎడ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారంతో ముగియనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి్సన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో కష్టపడి చదివిన విద్యారులు, కాపీ కొట్టే వారు ఒకే చోటికి చేరే పరిస్థితి.

ఇన్విజిలేటర్లే సూత్రధారులు..
ఈ మాస్‌ కాపీయింగ్‌కు కొంతమంది ఇన్విజిలేటర్లే సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డైట్‌ కళాశాల, డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ వారికి ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే కళాశాలలో చదివిన విద్యార్థులకు అక్కడివారే ఇన్విజిలేటర్లుగా ఉండడంతో ఈ తతంగం జోరుగా సాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సెంటర్‌కు అధికారులు వస్తే ముందుగానే విద్యార్థులకు సమాచారం అందిస్తున్నారు. డోర్‌ దగ్గర నిలబడి విద్యార్థులు తమ పని తాము కానిచ్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. చీటీలు రాసిన తర్వాత వాటిని ఇన్విజిలెటర్ల దగ్గర ఉంచుకోవడం కొసమెరుపు.

పట్టించుకోని అధికారులు..
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన విద్యాశాఖాధికారులు పట్టనట్లుగా ఉండడంతో పరీక్షల తీరు మారిపోయిందనే విమర్శలున్నాయి. కొంతమంది ఇన్విజిలేటర్లు కొందరిని చూసిరాయనివ్వడం, మరికొంత మందిని కాపీయింగ్‌ జరగకుండా చూడడంతో ఇటీవల ఓ విద్యార్థి పరీక్ష నిర్వాహకులతో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి అధికారులను వారిని ఎందుకు చూసి రాయనిస్తున్నారు.. మమ్మల్ని ఎందుకు రాయనివ్వడం లేదని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం బయటపడకుండా ఇన్విజిలేటర్లు, అధికారులు పరీక్షలను చూసీచూడనట్లుగా వదిలేసినట్లుగా సమాచారం. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కాపీయింగ్‌ జరగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement