
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ మూడు, నాలగవ విడతల పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మూడో విడత పరీక్ష జులై 20 నుంచి 25వరకు.. నాలుగో విడత పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి జులై 8 రాత్రి వరకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మేలో నిర్వహించాల్సిన సెషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జేఈఈ మెయిన్స్‌ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే, తొలి విడత ఫిబ్రవరిలో, రెండో విడత మార్చిలో నిర్వహించగా.. మూడు, నాలుగవ విడత పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉండింది. అయితే కరోనా కారణంగా ఈ రెండు సెషన్‌ల పరీక్షలు వాయిదా పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment