సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2023) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి విడత వచ్చే ఏడాది జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో ఉంటుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయి. పరీక్ష ఎప్పటిలాగే ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని, ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది.
దరఖాస్తుల స్వీకరణ షురూ..
జేఈఈ మెయిన్ మొదటి విడతకు దరఖాస్తులు గురువారం రాత్రి నుంచే మొదలయ్యాయి. జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌లో జరిగే రెండో విడత పరీక్షలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్ చూడాలని, లేదా 011 40759000/ 011 69227700 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఎన్‌టీఏ తెలిపింది.
రెండు నెలల్లోనే..
2019 వరకు జేఈఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు నాలుగు విడతలుగా మే, జూలై నెలల్లోనూ నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. అయితే 2 నెలల్లోనే మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం విశేషం. 2022 జేఈఈ మెయిన్స్‌కు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 9,05,590 మంది పరీక్ష రాశారు.
తొలి విడత షెడ్యూల్ ఇదీ..
దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 16 (గురువారం) నుంచి జనవరి 12 వరకు..
అడ్మిట్ కార్డుల విడుదల: 2023 జనవరి మూడో వారంలో.
పరీక్షలు: 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31
Comments
Please login to add a commentAdd a comment