Ramesh Pokhriyal
-
కేంద్ర కేబినెట్ విస్తరణ: పలువురికి ఉద్వాసన
సాక్షి, న్యూడిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై భారీ ఊహాగానాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుత కేబినెట్లో మరో 43 మందిని కొత్తగా మంత్రి పదవులు వరించనున్నాయని అంచనా. వీరిలో నలుగురు మాజీ సీఎంలకు కేబినెట్లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. స్వతంత్ర హోదా, సహాయ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. అలాగే సీనియర్ మంత్రుల నుంచి అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ఇద్దరు మంత్రులు వెల్లడించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా ప్రకటించారు. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను మోదీ కేబినెట్ నుంచి తప్పించ నున్నారు. దీంతో కేబినెట్ విస్తరణకు ముందే రమేష్ రాజీనామాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం, 21 మంది క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యత కలిగిన తొమ్మిది మంది మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు ఉన్నారు. తాజా ఈ విస్తరణతో ఈ సంఖ్య 81కి పెరగొచ్చని భావిస్తున్నారు. మోదీ కేబినెట్‌నుంచి రాజీనామా చేసినవారు ప్రధానంగా కీలకమంత్రులను మంత్రివర్గంనుంచి తప్పించడం పలువురిని విస్మయ పర్చింది. ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి, విద్యా శాఖా మంత్రికి తోడు కేంద్ర కెమికల్స్, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ కూడా కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, పర్యావరణ సహాయ మంత్రి బాబూల్ సుప్రియో తప్పుకున్నారు. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే కూడా తప్పుకోనున్నారు. బెంగాల్‌కు చెందిన మరో మంత్రి ప్రతాప్ సారంగి కూడా రాజీనామా చేశారు. -
JEE Mains: మూడవ, నాలుగో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ మూడు, నాలగవ విడతల పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మూడో విడత పరీక్ష జులై 20 నుంచి 25వరకు.. నాలుగో విడత పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి జులై 8 రాత్రి వరకు ఎన్టీఏ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మేలో నిర్వహించాల్సిన సెషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జేఈఈ మెయిన్స్‌ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే, తొలి విడత ఫిబ్రవరిలో, రెండో విడత మార్చిలో నిర్వహించగా.. మూడు, నాలుగవ విడత పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉండింది. అయితే కరోనా కారణంగా ఈ రెండు సెషన్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. -
97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితాల ప్రభావం కనిపిస్తోంది. 2018–19తో పోల్చి చూస్తే 2019–20లో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. అంతేగాక విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్ల లభ్యత, ఇంటర్నెట్ సదుపాయం కలిగిన పాఠశాలల సంఖ్య 2019–20లో గణనీయంగా పెరిగిందని యూడీఐఎస్ఈ ప్లస్ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో పాఠశాల విద్యపై రూపొందిన యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ ప్లస్) 2019–20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం విడుదల చేశారు. 2019–20 సంవత్సరానికి సంబంధించి యూడీఐఎస్ఈ విధానంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుత నివేదికను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల పాఠశాలలు, 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు, 26.45 కోట్ల మంది విద్యార్థుల సమాచారాన్ని యూడీఐఎస్ఈ పర్యవేక్షిస్తోంది. 2019–20లో మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు ప్రీప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ క్లాసుల వరకు పాఠశాలల్లో చదువుతున్నారని నివేదిక వెల్లడించింది. 2018–19తో పోలిస్తే 42.3 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. 90% పాఠశాలల్లో హ్యాండ్ వాష్ సదుపాయం 2019–20లో 12.50 కోట్లకు పైగా బాలికలు ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే బాలికల నమోదు సంఖ్య గణనీయంగా 14.08 లక్షలకు పైగా పెరిగింది. అంతేగాక పాఠశాల విద్యా రంగంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) సైతం మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది. దేశంలో స్వచ్ఛతా అభియాన్ ప్రచారం పెరగడంతో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యం గల పాఠశాలల సంఖ్యలో మెరుగుదల నమోదైంది. 2019–20 సంవత్సరంలో దేశంలో 90% కంటే ఎక్కువ పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ సౌకర్యాన్ని కల్పించారు. ఏపీలో 95% పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం 2019–20 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 63,824 పాఠశాలల్లో 83,23,103 మంది విద్యార్థులు ఉండగా, 3,17,430 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 90% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 89% పాఠశాలల్లో లైబ్రరీ, 68% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 95% విద్యుత్ సౌకర్యం, 90% తాగునీటి సరఫరా, 84% హ్యాండ్ వాష్ సదుపాయం, 87% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు తెలంగాణలో 42,575 పాఠశాలల్లో 69,37,640 మంది విద్యార్థులు ఉండగా, 3,05,597 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 93% పాఠశాలల్లో లైబ్రరీ, 85% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 96% విద్యుత్ సౌకర్యం, 96% తాగునీటి సరఫరా, 88% హ్యాండ్ వాష్ సదుపాయం, 86% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. యునైటెడ్ ఢిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఎస్ఇ +) 2019–20 నివేదిక ముఖ్యాంశాలు: 2019–20లో పాఠశాల విద్యలో ప్రీ–ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 26.45 కోట్లు దాటింది. 20 18–19తో పోలిస్తే ఇది 42.3 లక్షలు ఎక్కువ. 2018–19తో పోలిస్తే 2019–20లో అన్ని స్థాయిలలో పాఠశాల విద్య స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. స్థూల నమోదు నిష్పత్తి 2018–19తో పోలిస్తే 2019–20లో అప్పర్ ప్రైమరీ స్థాయిలో 87.7% నుంచి 89.7% కి, ప్రాథమిక స్థాయిలో 96.1% నుంచి 97.8%కి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.9%కి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.1% నుంచి 51.4%కి పెరిగింది. 2019–20లో పాఠశాల విద్యారంగంలో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేయగా, 2018–19తో పోలిస్తే ఇది సుమారు 2.57 లక్షలు ఎక్కువ. 2019–20లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) ప్రైమరీ విద్యలో 26.5 గా, అప్పర్ ప్రైమరీ–సెకండరీలో పిటిఆర్ 18.5 గా, హయ్యర్ సెకండరీలో పిటిఆర్ 26.1 గా ఉంది. వికలాంగులకు సార్వత్రిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19తో పోలిస్తే దివ్యాంగులైన విద్యార్థుల నమోదు 6.52% పెరిగింది. 2019–20లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చేరిన బాలికల సంఖ్య 12.08 కోట్లకు పైగా ఉంది. 2018–19తో పోలిస్తే ఈ సంఖ్య 14.08 లక్షలకు పైగా పెరిగింది. 2018–19 నుంచి 2019–20లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి అప్పర్ ప్రైమరీ స్థాయిలో 88.5% నుంచి 90.5%నికి, ఎలిమెంటరీ స్థాయిలో 96.7% నుంచి 98.7%నికి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.8%నికి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.8% నుంచి 52.4%కి పెరిగింది. 2019–20లో సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది. జిపిఐ మెరుగుదల హయ్యర్ సెకండరీ స్థాయిలో ఎక్కువగా కనిపించింది. 2019–20లో 1.04 కు చేరింది. కంప్యూటర్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2019–20లో 5.2 లక్షలకు చేరగా, 2018–19లో 4.7 లక్షల పాఠశాలలు కంప్యూటర్ సౌకర్యాన్ని కలిగి వున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పాఠశాలల సంఖ్య 2018–19లో 2.9 లక్షలు ఉండగా, 2019–20లో 3.36 లక్షలకు పెరిగింది. 2019–20 నాటికి 83% కంటే ఎక్కువ పాఠశాలలు విద్యుత్తు కలిగి ఉన్నాయి. 2018–19తో పోలిస్తే దాదాపు 7% వరకు పెరిగింది. 2019–20లో 82% కి పైగా పాఠశాలలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించాయి. ఇది 2018–19తో పోలిస్తే 4% కంటే ఎక్కువ. భారతదేశంలో 2019–20 నాటికి 84%కి మించి పాఠశాలల్లో లైబ్రరీ/రీడింగ్ రూమ్/రీడింగ్ కార్నర్ సౌకర్యం ఉంది. చదవండి: ఆ కిడ్నాపర్‌కు జీవితకాల జైలు శిక్ష విధించలేం: సుప్రీంకోర్టు -
ఉన్నత విద్యలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ రాష్ట్రాల జాబితాలో నిలిచింది. ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) 2019–20 నివేదికను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం విడుదల చేశారు. ఇందులో ఏపీ పలు అంశాల్లో సత్తా చాటింది. దేశంలో అత్యధిక విద్యార్థుల చేరికలున్న టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న టాప్–8 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మన రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. కాలేజీల సంఖ్య ప్రకారం.. ఏపీ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి దేశంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఏపీకంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి లక్షమంది జనాభాకు ఉన్న కాలేజీల సంఖ్య కేవలం 31. అలాగే ఈ సంఖ్య మహారాష్ట్రలో 34, రాజస్థాన్‌లో 37 మాత్రమే కావడం గమనార్హం. కాలేజీల సంఖ్యా పరంగా ఆలిండియా యావరేజ్ 30 కాగా ఏపీలో 51 ఉండటం విశేషం. మన రాష్ట్రంలో ఏకంగా 2,750 కళాశాలలున్నాయి. ఏపీ జోరు ఇలా.. ► దేశంలో మొత్తం విద్యార్థుల చేరికల్లో 54 శాతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీల నుంచే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ► విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక (10,231) మొదటి స్థానంలో ఉండగా ఏపీ (2,094) 9వ స్థానం, తెలంగాణ (2,261) ఏడో స్థానంలో నిలిచాయి. ► దేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 2.49 లక్షల మంది ఉండగా అందులో 55.4 శాతం మంది ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. 23,421 మందితో ఏపీ నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ► దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 27.1 శాతంగా ఉండగా.. ఎస్సీల శాతం 23.4, ఎస్టీల శాతం 18 ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో మహిళలు 30 శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఇలా.. ► జాతీయ స్థాయిలో 3.38 కోట్ల మంది విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. వీరిలో 2.85 కోట్ల మంది (85 శాతం) ఆరు డిసిప్లిన్ కోర్సుల్లోనే చేరారు. వీరంతా హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఐటీ అండ్ కంప్యూటర్ విభాగాల్లో ఉన్నారు. ► పీహెచ్డీ కోర్సులకు సంబంధించి 2014–15లో 1.17 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2019–20లో 2.03 లక్షల మంది పీహెచ్‌డీలో చేరారు. ► దేశంలో 2019–20 నాటికి 15,03,156 మంది అధ్యాపకులుండగా వీరిలో 42.5 శాతం మంది మహిళలు. ► ఉన్నత విద్యలో 2019–20లో 3.85 కోట్ల మేర చేరికలున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు మాత్రమే. సర్వే జరిగింది ఇలా.. దేశవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలు సర్వేకు సమర్పించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది. దేశంలో 1,043 యూనివర్సిటీలు, 42,343 కాలేజీలు, 11,779 స్టాండ్ ఎలోన్ (ఒకే విభాగానికి సంబంధించిన కోర్సులను అందించేవి) విద్యాసంస్థలున్న సంగతి తెలిసిందే. వీటిలో 1,019 యూనివర్సిటీలు, 39,955 కాలేజీలు, 9,599 స్టాండ్ ఎలోన్ సంస్థలు సర్వేకు గణాంకాలను సమర్పించాయి. తక్కినవి స్పందించలేదు. దేశంలో ఉన్నత విద్యా రంగం గత ఐదేళ్లలో (2015–16 నుంచి 2019–20 వరకు) ఏ మేరకు ఉన్నత ప్రమాణాలు, వృద్ధి రేటు సాధించిందో గణాంకాలతో సహా నివేదిక విశ్లేషించింది. ఉన్నత విద్యలో విద్యార్థుల చేరికలు 2015–16 నుంచి 2019–20 మధ్య 11.4 శాతం మేర పెరిగాయి. ఇందులో మహిళల చేరికలు 18.2 శాతం పెరగడం విశేషం. -
పాఠశాల విద్యలో ఏపీ ప్రగతి
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల విద్య గ్రేడింగ్ గవర్నెన్స్ ప్రాసెస్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించింది. 2018–19 కన్నా 20 శాతం మెరుగుపడింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాల విద్య పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2019–20 నివేదికకు కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆమోదం తెలిపారు. కేంద్ర విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ ఈ నివేదికను రూపొందించింది. పాఠశాల విద్యలో పరివర్తన తీసుకురావడానికి కేంద్రం 70 అంశాలతో పనితీరు గ్రేడింగ్ సూచీని ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017–18 సంవత్సరం ఆధారంగా 2018–19లో తొలిసారి పీజీఐ ప్రచురించారు. ఇప్పుడు 2019–20 నివేదికను కేంద్రం ఆమోదించింది. 2018–19తో పోలిస్తే 2019–20లో ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలు కనీసం 20 శాతం (72 పాయింట్లు, అంతకంటే ఎక్కువ) మెరుగుదల చూపించాయి. పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ ఏ++ గ్రేడ్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్ 72 పాయింట్లకుపైగా, తెలంగాణ 15 పాయింట్లు మెరుగుపరచుకున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ 4వ లెవెల్ గ్రేడ్–1 (801–850 పాయింట్లు), తెలంగాణ 5వ లెవెల్ గ్రేడ్–2 (751–800 పాయింట్లు) సాధించాయి. కేటగిరీ–1 డొమైన్–1లో లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 154, తెలంగాణ 142 పాయింట్లు సాధించాయి. రాజస్థాన్ 168 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. కేటగిరీ–1 డొమైన్–2లో యాక్సెస్ విభాగంలో 80 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 65, తెలంగాణ 69 పాయింట్లు సాధించాయి. కేరళ 79 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ విభాగంలో 150 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 117, తెలంగాణ 113 పాయింట్లు సాధించాయి. పంజాబ్ 150 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. ఈక్విటీ విభాగంలో 230 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 204, తెలంగాణ 210 పాయింట్లు సాధించాయి. 228 పాయింట్లతో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. గవర్నెన్స్ ప్రాసెస్‌లో 360 పాయింట్లకుగాను ఆంధ్రప్రదేశ్‌కు 271, తెలంగాణకు 238 పాయింట్లు లభించాయి. పంజాబ్ 346 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పీజీఐ ప్రవేశపెట్టిన 2017–18 నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కూడా లెవెల్ 1 (951–1000 పాయింట్లు) సాధించలేదు. -
Teachers Eligibility Test: టెట్ అభ్యర్థులకు కేంద్రం తీపికబురు..
న్యూఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలం పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కీలక ఆదేశాలను జారీచేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రకారం 2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలు పరచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనే వారికోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అభ్యర్థులందరికి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, గతంలో టెట్‌కు 7 సంవత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్‌ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ -
కేంద్ర మంత్రికి ఏపీ విద్యాశాఖ మంత్రి లేఖ
సాక్షి, అమరావతి: 12వ తరగతి పరీక్షల నిర్వహణపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రత్యేక కోటాలో వ్యాక్సిన్ కేటాయించాలని, టీచర్లు, ఇన్విజిలేటర్లు, ప్రొఫెసర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేస్తే ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యం పెంపొందించగలుగుతామని, కేంద్రం వారిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా వ్యాక్సిన్ కోటా కేటాయించాలన్నారు. -
కరోనా కల్లోలం: ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, రుచి తెలియక పోవడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవ్వడం మొదలైన లక్షణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకొన్న కూడా కోవిడ్ నెగెటివ్ అనంతరం కూడా అనేక శారీరక సమస్యలు కొత్తగా ఉత్పన్న మవుతున్నాయి. వీటిని పోస్ట్ కోవిడ్ సమస్యలుగా పేర్కొంటారు. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కోవిడ్ అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు. కాగా, 61 ఏళ్ల వయస్సున్న పోఖ్రియల్ నిశాంక్ గత ఏప్రిల్ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ల సూచన మేరకు ఆయన ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఇప్పటికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా వుండగా కేంద్ర విద్యాశాఖ గత కొన్ని రోజులుగా సిబిఎస్ఇ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ వెంటనే సిబిఎస్ఇ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆసుపత్రిలో ఉన్న తరుణంలో, సిబిఎస్ఇ పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కేంద్ర విద్యాశాఖ సుప్రీం కోర్టును కోరింది. చదవండి: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. నల్లగా మారిన మహిళ చేయి -
CBSE 12th board Exams 2021: జూన్ 1లోగా నిర్ణయం
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో.. సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై జూన్ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల్లో కొంతవరకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, సూచనలను సమగ్రంగా మే 25 లోగా తమకు పంపించాలని కోరారు. క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశాయి. పరీక్షలు నిర్వహించకూడదనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర, పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయాలని ఢిల్లీ, కేరళ సూచించాయి. మరోవైపు, జూలై 15 నుంచి ఆగస్ట్ 26 మధ్య పరీక్షలు నిర్వహించి, సెప్టెంబర్‌లో ఫలితాలను విడుదల చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి సీబీఎఎస్‌ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవి 1) కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మొత్తం 19 మేజర్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. మైనర్ సబ్జెక్టుల ఫలితాలను మేజర్ సబ్జెక్టుల్లో ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. మూడునెలల్లో మొత్తం ప్రక్రియను ముగించాలి. తొలినెలలో ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీ, రెండోనెలలో పరీక్షలు, మూడోనెలలో ఫలితాలు వెల్లడించాలి. 2) మూడు గంటలు కాకుండా, గంటన్నర పాటే, వారి పాఠశాలలోనే పరీక్షలు జరపాలి. పరిస్థితిని బట్టి రెండుసార్లు పరీక్షలను నిర్వహించవచ్చు. జూలై 15 నుంచి ఆగస్ట్ 1 మధ్య ఫస్ట్ ఫేజ్, ఆగస్ట్ 8–26 మధ్య సెకండ్ ఫేజ్ పరీక్షలను నిర్వహించవచ్చు. కరోనా కారణంగా ఏ విద్యార్థి అయినా పరీక్ష రాయలేనట్లయితే.. ఆ విద్యార్థికి మరో అవకాశం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్, షార్ట్ ఆన్సర్ తరహాలో ప్రశ్నపత్రం ఉండాలి. ఒక లాంగ్వేజ్, మూడు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం సీబీఎస్ఈ మొదటి ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు, రెండో ప్రతిపాదనను మెజారిటీ రాష్ట్రాలు సమర్ధించినట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసింది. ఏప్రిల్–మేలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. సమావేశం ఫలవంతంగా జరిగిందని, రాష్ట్రాల నుంచి విలువైన సూచనలు అందాయని రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. ‘సలహాలు, సూచనలతో సమగ్ర నివేదికను మే 25లోపు పంపించాలని రాష్ట్రాలను కోరాం. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని, అనిశ్చితికి తెరవేస్తాం’ అని వెల్లడించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, సంజయ్ ధాత్రే, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ‘క్యాన్సిల్‌బోర్డ్‌ఎగ్జామ్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. పరీక్షల నిర్వహణకు తాము వ్యతిరేకమని, టీకాలు వేయకుండా విద్యార్థులను పరీక్షలు రాయమనడం పెద్ద పొరపాటవుతుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది క్లాస్ 12 విద్యార్థులున్నారని, వారిలో 90% 17 ఏళ్లు పైబడినవారేనని ఆయన వివరించారు. వారికి కోవిడ్ టీకా ఇవ్వడానికి వీలవుతుందేమో నిపుణులతో చర్చించాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సుముఖమే కానీ, కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత పరీక్షలు జరిపితే మంచిదని భావిస్తున్నట్లు తమిళనాడు పేర్కొంది. ఈ పరీక్షలు విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ముఖ్యమంది. -
ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఉన్నతస్థాయి సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ కోర్సుల పరీక్షల నిర్వహణపై కేంద్రం రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల కార్యదర్శులు, బోర్డు ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరీక్షల నిర్వహణపై వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఈ మేరకు లేఖలు రాసింది. కాగా, కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ప్రొఫెషనల్ కోర్సుల ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేసింది. కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్ ఈ పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. -
జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా
-
జేఈఈ మెయిన్స్ 2021 వాయిదా
న్యూఢిల్లీ: కోవిడ్ దృష్టా కేంద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కోవిడ్ విజృంభణ వల్ల పరీక్ష వాయిదా వేస్తున్నామన్నారు. ఇప్పటికే నీట్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చదవండి: కటాఫ్ ఎక్కువే! -
జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష జూలై 3వ తేదీన ఉంటుందని∙కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. ఈ క్వాలిఫయింగ్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కూడా కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాదికి సడలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు గాను అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75శాతం మార్కులు లేదా క్వాలిఫయింగ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. 2021నుంచి ఏడాదికి నాలుగు పర్యాయాలు జేఈఈ–మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. 10,12వ తరగతి పరీక్షలను మే నెలకు సీబీఎస్ఈ వాయిదా వేసింది. -
ఐఐటీ హైదరాబాద్‌లో టైహాన్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. నగర శివారు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ–హైదరాబాద్)లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగు పడింది. మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందంజగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. స్వతంత్ర నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించిన పలు విభాగాలు ఈ ప్రాజెక్టులో కలసికట్టుగా పనిచేస్తాయన్నారు. మానవ రహి త విమానాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. మానవ రహిత డ్రోన్లు, వాహనాలను ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు లేకుండా పరీక్షించేందుకు ఇదో మేలైన వ్యవస్థగా రూపొందుతుం దని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీవీఎస్ మూర్తి తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ–హెచ్‌కు రూ.135 కోట్లు మంజూరు చేశాయి. ప్రాజెక్టులో భాగం గా టైహాన్‌లో టెస్ట్ ట్రాక్‌లు, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను తలపించేవి ఏర్పాటవుతాయి. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్వేలు, ల్యాండింగ్ ఏరియాలు ఏర్పాటుచేస్తా రు. ఇటు సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయని ఐఐటీ–హెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదు
కరోనా వేళ నాకు ఆన్లైన్ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్‌లైన్ తరగతుల తర్వాతే పరీక్షలు పెట్టండి.’ – కరుణ శర్మ, 12వ తరగతి ఆన్లైన్ బోధన అర్థం కావట్లేదు. అభ్యసనపై సంతృప్తిగా లేదు. ప్రత్యక్ష విద్యా బోధన కావాలి. ఆ తర్వాతే పరీక్షలు పెట్టండి. పరీక్షలన్నీ జూన్ వరకు వాయిదా వేయండి. – అబు అనస్, విద్యార్థి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం, పరీక్షల నిర్వహణ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు నుంచి వ్యక్తమైన అభిప్రా యాలు. ప్రత్యక్ష విద్యా బోధన, సిలబస్ కుదింపుపైనా దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు అనేక విజ్ఞ ప్తులు, సూచనలు చేశారు. జేఈఈ మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్ఈ 11, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులతో ఈనెల 10న 10 గంటలకు ట్విటర్ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించగా వేల మంది స్పందించారు. పరీక్షలు ఇప్పట్లో వద్దని 99 శాతం మంది స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనపై చర్యలు చేపట్టాకే ముందుకు సాగాలని సూచించారు. మరికొంత మంది విద్యార్థులైతే 12వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన కంటే ఆన్లైన్ బోధన కొనసాగించాలని, పరీక్షలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో సిలబస్‌ను తగ్గించాలని సూరజ్ అనే విద్యార్థి విజ్ఞప్తి చేశారు. ఇంకొంత మంది విద్యార్థులైతే ప్రాక్టికల్ పరీక్షల ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నీట్ పరీక్షను కూడా జూన్ వరకు వాయిదా వేయాలని కోరారు. ఆన్లైన్ విద్యా బోధనకు అవసరమైన చాలామంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేవని, అవి ఉన్నా కొందరు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలతో విద్యా బోధన ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధనతోనే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న జరిగే ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం వెల్లడించనున్నారు. పరీక్షలకు ఉపయోగపడని ఆన్లైన్ బోధన ఇంటర్మీడియెట్ విద్యలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్లైన్ బోధన.. పరీక్షలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఆన్లైన్ విద్యతో పరీక్షలు నిర్వహించడం సరికాదు. నేరుగా తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రత్యక్ష విద్యా బోధన కనీసం 3 నెలలు నిర్వహించాల్సిందే. – ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి -
మాతృభాషలో ఇంజనీరింగ్!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయమని యూజీసీని సమావేశంలో ఆదేశించారు. కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లిష్‌లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు. -
పేదలకు సులభ జీవనం అందించండి
న్యూఢిల్లీ: భారతదేశం తన యువతకు కావాల్సిన సదుపాయాలను (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అందిస్తుందని, అనుభవం, నైపుణ్యం, నవీన ఆవిష్కరణల ద్వారా వారు దేశంలోని పేదలకు సులభతర జీవనాన్ని(ఈజ్ ఆఫ్ లివింగ్) అందించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన శనివారం ఢిల్లీ ఐఐటీ 51వ వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా నిరుపేదల కోసం కొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు సూచించారు. కోవిడ్ అనంతరం భిన్నమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని, ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. నాణ్యతపై కచ్చితంగా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఐఐటీ విద్యార్థులకు ఉద్బోధించారు. మీ శ్రమ ద్వారా భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని అన్నారు.బ్రాండ్ ఇండియాకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా మంచి పాలన అందించవచ్చనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ పేదల వరకూ చేరుతోందన్నారు. సాంకేతికత ద్వారా సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూ అవినీతికి అడ్డుకట్ట వేశామని మోదీ పేర్కొన్నారు. ఎన్ఈపీ అతిపెద్ద సంస్కరణ: రమేశ్ ఐఐటీకి చెందిన 2,019 మంది గ్రాడ్యుయేట్లకు శనివారం డిగ్రీలు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రసంగించారు. స్నాతకోత్సవం అంటే విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, ఉద్యోగ రంగంలోకి అడుగపెట్టేందుకు ఇదొక గట్టి పునాది లాంటిదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణ అని అభివర్ణించారు. -
గీతంపై కేంద్రమంత్రికి ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటి నిబంధనల ఉల్లంఘనపై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇంద్రపాల్ సింగ్‌కు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయి రెడ్డి గురువారం లేఖ రాశారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. భూమి యాజమాన్య హక్కు పత్రాల సమర్పణలో వాస్తవాలు దాచారని, యూజీసీకి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ భూమిని కూడా గీతం యాజమాన్యం చూపించిందని చెప్పారు. ఫార్మసీ, మెకానికల్ విభాగాలతో పాటు సివిల్ విభాగ నిర్మాణాల్లో కొంత భాగం ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయన్నారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రజలకు వివరాలను బహిర్గతం చేయాలన్న నిబంధన పాటించలేదని, గీతం భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఆధారాలను సంబంధిత అధికారులకు పొందుపరచ లేదని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా గీతం విద్యా విధానంలో లోపాలపై కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంత్‌కు కూడా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ర్యాంకింగ్ విషయంలో గీతం నిబంధనలు తుంగలో తొక్కిందని చెప్పారు. తప్పుడు సమాచారంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందినట్టు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల విషయంలో నిబంధనలు పాటించలేదు అని పేర్కొన్నారు. గీతం ఉద్యోగ నియామకాల్లో రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయలేదని, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా గీతం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన లేఖ ద్వారా రమేష్ పొఖ్రియాల్‌కు తెలిపారు. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతోందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకువెళ్లడంలో సఫలమయ్యారన్నారు. గురువారం ఆయన వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాలనా నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, ప్రధానంగా విద్యా సంస్కరణలను ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులతో వెబినార్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా కానుక, నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలు, విద్యా రంగంలో ప్రమాణాల పెంపునకు తీసుకున్న చర్యలు, కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూనే విద్యార్థులకు వివిధ మార్గాల్లో బోధనా కార్యక్రమాల కొనసాగింపు తదితర అంశాల గురించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా స్వాగతించిందని, అంతకు ముందు నుంచే పలు సంస్కరణల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే అనేక చర్యలను తీసుకున్నామని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ స్పందిస్తూ మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. విద్యాభివృద్ధికి ఏపీ విశేష కృషి ♦మీ రాష్ట్రంలో చాలా మంచి పనులు చేస్తున్నారు. విద్యాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. విద్యామృతం, విద్యాకలశం కార్యక్రమాలు అమలు చేస్తుండటం అభినందనీయం. ♦విద్యారంగ అభివృద్ధికి చేపడుతున్న పథకాలు బడి పిల్లల వరకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లడంలో మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఆదర్శవంతం. ♦గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం ముదావహం. అక్కడే ఆయా విభాగాలకు అధికారులను నియమించడం మంచిపని. ఇలాంటి పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేకూరడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధించడానికి వీలవుతుంది. ఇతరులకూ ఆదర్శం ♦మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు ఇతరులకూ ఆదర్శవంతంగా ఉన్నాయి. విద్యారంగంలో జీడీపీని ఆరు శాతానికి ఎలా తీసుకువెళ్లాలనేది విద్యా శాఖ మంత్రులందరూ ఆలోచించాల్సిన సమయం ఇది. ♦కొత్త బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. విద్యా మంత్రులు కేబినెట్ సమావేశాల్లో విద్యా రంగ ప్రాధాన్యతను తెలియజెప్పాలి. ప్రస్తుతం దేశంలోని ముఖ్యమంత్రులందరూ జాతీయ విద్యా విధానం పట్ల సుముఖతతో ఉన్నారు. ♦అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిగణనలోకి తీసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలయ్యేలా సూచనలు చేస్తాం. -
ఇక ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్‌ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌ను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు. 2021 నుంచి భారత్‌లోని పలు ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని జేఏబీ నిర్ణయించిందని మంత్రి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది దారితీయనుంది. ఇక భారత్‌లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్‌ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు. -
సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా నిర్ణయాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియల్ అభినందించారు. గ్రామ సచివాలయాలు, విద్యాసంస్కరణలను ఆయన ప్రశంసించారు. గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలను వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారన్నారు. ( గ్రామ పంచాయతీలకు రూ.1,168 కోట్లు ) ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్‌ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్నారు. ఏపీ సీఎం చేస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని అన్నారు. -
వారి కోసం 14న నీట్ నిర్వహణ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా, కంటైన్మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల నీట్ రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి నీట్‌కు అనుమతి ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాలను ఈ నెల 16వ తేదీన వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీన పరీక్షకు హాజరుకావొచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 16వ తేదీన ఏ సమయానికి నీట్ ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్‌లతోపాటు జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు. దీన్ని పార్లమెంట్ గతేడాది ఆమోదించింది. -
స్కూళ్లు రీఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా సెలవులో ఉన్న విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కరోనా పరిస్థితులను బట్టి అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు తెరువాలా వద్దా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. స్కూళ్లు తెరిచిన రెండు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఆన్లైన్ తరగతులు మాత్రం తప్పని సరిగా ప్రారంభం కావాలని పేర్కొన్నారు. స్కూళ్లను పునరుద్ధరించే పక్షంలో తప్పని సరిగా పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించాలని వెల్లడించారు. (పాఠశాలలు ప్రారంభం: వారంలో 70 కేసులు) DoSEL, @EduMinOfIndia has issued SOP/Guidelines for reopening of schools. pic.twitter.com/pwJXZZd40w — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) October 5, 2020 స్కూలులోని అన్ని చోట్ల పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలి. దీని కోసం పాఠశాలలు తగిన ఏర్పాట్లు చేయాలి. స్కూళ్లు సొంతంగానే నిబంధనలు, ప్రోటోకాల్స్ తయారు చేసుకోవాలి. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పని సరిగా ధరించాలి. విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్, కమ్యూనిటీ సభ్యులు, హాస్టల్ సిబ్బంది శానిటైజ్ పద్ధతులు పాటించాలి. అన్ని తరగతుల విద్యా క్యాలెండర్‌కు మార్పులు చేయాలి. పాఠశాల ప్రాంగణంలో డాక్టర్, నర్సు, ఆరోగ్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలి. విద్యార్థులు, స్కూలు సిబ్బందికి సిక్ లీవ్, హాజరులో వెసులుబాటు కల్పించాలి. స్కూళ్లు తెరిచిన రెండు నుంచి మూడు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదు. ఐసీటీ వినియోగం, ఆన్లైన్ విద్యను తప్పనిసరిగా కొనసాగించాలి. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులు పాఠశాలకు హాజరుకావాలి. భౌతికంగా కన్నా ఆన్లైన్ విద్యను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థుల హాజరులో ఈ మేరకు సౌలభ్యం కల్పించాలి. -
నో పాలిటిక్స్; అన్ని జాగ్రత్తలతో నీట్-జేఈఈ
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఆందోళన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. విద్యార్ధుల భద్రత, కెరీర్ తమకు ప్రధానమని, ఈ పరీక్షల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పలు మార్గదర్శకాలు, నిర్దిష్ట విధానాలను జారీ చేసిందని చెప్పారు. మే-జూన్ నుంచి ఈ పరీక్షలు రెండుసార్లు వాయిదాపడ్డాయని, పెద్దసంఖ్యలో విద్యార్ధులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణకు సానుకూలంగా స్పందించారని, మెయిల్స్ ఇతర మార్గాల ద్వారా తమ సమ్మతి తెలిపారని మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. విద్యార్ధుల సౌకర్యానికి అనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసిందని చెప్పారు. 99 శాతం విద్యార్ధులు వారు ఎన్నుకున్న కేంద్రంలోనే పరీక్షకు హాజరవుతారని, ఎలాంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై రాజకీయాలకు తావులేదని అన్నారు. అన్ని వాదనలు విన్నమీదట సుప్రీంకోర్టు సైతం విద్యార్ధుల విద్యా సంవత్సరాన్ని మనం వృధా చేయరాదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇక ఈ పరీక్షలకు హాజరవుతున్న 8.58 లక్షల విద్యార్ధుల్లో 7.50 లక్షల మంది విద్యార్ధులు తమ జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్‌లౌడ్ చేసుకోగా, నీట్ పరీక్షలకు హాజరయ్యే 15.97 లక్షల మంది విద్యార్ధుల్లో 10 లక్షల మంది విద్యార్ధులు అడ్మిట్ కార్డులను ఇప్పటివరకూ డౌన్లోడ్ చేసుకున్నారు. నీట్-జేఈఈ పరీక్షలకు ఎన్టీఏ జారీ చేసిన మార్గదర్శకాల అమలు చేస్తూ విద్యార్ధు భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఎన్టీఏ అధికారులు, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పలు భేటీలు జరుగుతున్నాయని వివరించారు. విద్యా శాఖ కార్యదర్శి సైతం రాష్ట్రాల విద్యాశాఖాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఇక జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ నుంచి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వరకూ పలువురు ప్రముఖులు కరోనా విజృంభిస్తున్న సమయంలో నీట్ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి : జేఈఈ, నీట్‌లపై గళమెత్తిన గ్రెటా థన్‌బెర్గ్