
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటి నిబంధనల ఉల్లంఘనపై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇంద్రపాల్ సింగ్‌కు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయి రెడ్డి గురువారం లేఖ రాశారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. భూమి యాజమాన్య హక్కు పత్రాల సమర్పణలో వాస్తవాలు దాచారని, యూజీసీకి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ భూమిని కూడా గీతం యాజమాన్యం చూపించిందని చెప్పారు. ఫార్మసీ, మెకానికల్ విభాగాలతో పాటు సివిల్ విభాగ నిర్మాణాల్లో కొంత భాగం ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయన్నారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రజలకు వివరాలను బహిర్గతం చేయాలన్న నిబంధన పాటించలేదని, గీతం భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఆధారాలను సంబంధిత అధికారులకు పొందుపరచ లేదని లేఖలో పేర్కొన్నారు.
అదేవిధంగా గీతం విద్యా విధానంలో లోపాలపై కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంత్‌కు కూడా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ర్యాంకింగ్ విషయంలో గీతం నిబంధనలు తుంగలో తొక్కిందని చెప్పారు. తప్పుడు సమాచారంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందినట్టు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల విషయంలో నిబంధనలు పాటించలేదు అని పేర్కొన్నారు. గీతం ఉద్యోగ నియామకాల్లో రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయలేదని, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా గీతం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన లేఖ ద్వారా రమేష్ పొఖ్రియాల్‌కు తెలిపారు.