
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైంది. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దస్పల్లా, ఎన్‌సీసీ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు.

డయేరియా బాధితులను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. డయేరియాతో 14 మంది మరణించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాను. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పు జరిగింది అని కామెంట్స్ చేశారు.