97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు | Minister Pokhriyal Released UDISE Plus Report On School Education In India | Sakshi
Sakshi News home page

97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు

Published Fri, Jul 2 2021 11:33 AM | Last Updated on Fri, Jul 2 2021 12:21 PM

Minister Pokhriyal Released UDISE Plus Report On School Education In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితాల ప్రభావం కనిపిస్తోంది. 2018–19తో పోల్చి చూస్తే 2019–20లో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. అంతేగాక విద్యుత్‌ సౌకర్యం, కంప్యూటర్ల లభ్యత, ఇంటర్నెట్‌ సదుపాయం కలిగిన పాఠశాలల సంఖ్య 2019–20లో గణనీయంగా పెరిగిందని యూడీఐఎస్‌ఈ ప్లస్‌ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో పాఠశాల విద్యపై రూపొందిన యునైటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈ ప్లస్‌) 2019–20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ గురువారం విడుదల చేశారు.
 
2019–20 సంవత్సరానికి సంబంధించి యూడీఐఎస్‌ఈ విధానంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుత నివేదికను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల పాఠశాలలు, 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు, 26.45 కోట్ల మంది విద్యార్థుల సమాచారాన్ని యూడీఐఎస్‌ఈ పర్యవేక్షిస్తోంది. 2019–20లో మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు ప్రీప్రైమరీ నుంచి హయ్యర్‌ సెకండరీ క్లాసుల వరకు పాఠశాలల్లో చదువుతున్నారని నివేదిక వెల్లడించింది. 2018–19తో పోలిస్తే 42.3 లక్షల మంది విద్యార్థులు పెరిగారు.  

90% పాఠశాలల్లో హ్యాండ్‌ వాష్‌ సదుపాయం 
2019–20లో 12.50 కోట్లకు పైగా బాలికలు ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే బాలికల నమోదు సంఖ్య గణనీయంగా 14.08 లక్షలకు పైగా పెరిగింది. అంతేగాక పాఠశాల విద్యా రంగంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్‌) సైతం మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది. దేశంలో స్వచ్ఛతా అభియాన్‌ ప్రచారం పెరగడంతో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యం గల పాఠశాలల సంఖ్యలో మెరుగుదల నమోదైంది. 2019–20 సంవత్సరంలో దేశంలో 90% కంటే ఎక్కువ పాఠశాలల్లో హ్యాండ్‌వాష్‌ సౌకర్యాన్ని కల్పించారు.  

ఏపీలో 95% పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం
2019–20 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 63,824 పాఠశాలల్లో 83,23,103 మంది విద్యార్థులు ఉండగా, 3,17,430 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 90% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 89% పాఠశాలల్లో లైబ్రరీ, 68% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 95% విద్యుత్‌ సౌకర్యం, 90% తాగునీటి సరఫరా, 84% హ్యాండ్‌ వాష్‌ సదుపాయం, 87% మెడికల్‌ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.

తెలంగాణలో 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు
తెలంగాణలో 42,575 పాఠశాలల్లో 69,37,640 మంది విద్యార్థులు ఉండగా, 3,05,597 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 93% పాఠశాలల్లో లైబ్రరీ, 85% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 96% విద్యుత్‌ సౌకర్యం, 96% తాగునీటి సరఫరా, 88% హ్యాండ్‌ వాష్‌ సదుపాయం, 86% మెడికల్‌ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. 

యునైటెడ్‌ ఢిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యుడిఎస్‌ఇ +) 2019–20 నివేదిక ముఖ్యాంశాలు:

  • 2019–20లో పాఠశాల విద్యలో ప్రీ–ప్రైమరీ నుంచి హయ్యర్‌ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 26.45 కోట్లు దాటింది. 20 18–19తో పోలిస్తే ఇది 42.3 లక్షలు ఎక్కువ.
  • 2018–19తో పోలిస్తే 2019–20లో అన్ని స్థాయిలలో పాఠశాల విద్య స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది.
  • స్థూల నమోదు నిష్పత్తి 2018–19తో పోలిస్తే 2019–20లో అప్పర్‌ ప్రైమరీ స్థాయిలో 87.7% నుంచి 89.7% కి, ప్రాథమిక స్థాయిలో 96.1% నుంచి 97.8%కి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.9%కి, హయ్యర్‌ సెకండరీ స్థాయిలో 50.1% నుంచి 51.4%కి పెరిగింది.
  • 2019–20లో పాఠశాల విద్యారంగంలో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేయగా, 2018–19తో పోలిస్తే ఇది సుమారు 2.57 లక్షలు ఎక్కువ.
  • 2019–20లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్‌) ప్రైమరీ విద్యలో 26.5 గా, అప్పర్‌ ప్రైమరీ–సెకండరీలో పిటిఆర్‌ 18.5 గా, హయ్యర్‌ సెకండరీలో పిటిఆర్‌ 26.1 గా ఉంది.
  • వికలాంగులకు సార్వత్రిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19తో పోలిస్తే దివ్యాంగులైన విద్యార్థుల నమోదు 6.52% పెరిగింది.
  • ​​​​​​​2019–20లో ప్రైమరీ నుంచి హయ్యర్‌ సెకండరీ వరకు చేరిన బాలికల సంఖ్య 12.08 కోట్లకు పైగా ఉంది. 2018–19తో పోలిస్తే ఈ సంఖ్య 14.08 లక్షలకు పైగా పెరిగింది.
  • ​​​​​​​2018–19 నుంచి 2019–20లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి అప్పర్‌ ప్రైమరీ స్థాయిలో 88.5% నుంచి 90.5%నికి, ఎలిమెంటరీ స్థాయిలో 96.7% నుంచి 98.7%నికి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.8%నికి, హయ్యర్‌ సెకండరీ స్థాయిలో 50.8% నుంచి 52.4%కి పెరిగింది.
  • ​​​​​​​2019–20లో సెకండరీ, హయ్యర్‌ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది. జిపిఐ మెరుగుదల హయ్యర్‌ సెకండరీ స్థాయిలో ఎక్కువగా కనిపించింది. 2019–20లో 1.04 కు చేరింది.
  • కంప్యూటర్‌ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2019–20లో 5.2 లక్షలకు చేరగా, 2018–19లో 4.7 లక్షల పాఠశాలలు కంప్యూటర్‌ సౌకర్యాన్ని కలిగి వున్నాయి.
  • ​​​​​​​ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న పాఠశాలల సంఖ్య 2018–19లో 2.9 లక్షలు ఉండగా, 2019–20లో 3.36 లక్షలకు పెరిగింది.  
  • 2019–20 నాటికి 83% కంటే ఎక్కువ పాఠశాలలు విద్యుత్తు కలిగి ఉన్నాయి.  2018–19తో పోలిస్తే దాదాపు 7% వరకు పెరిగింది.  
  • 2019–20లో 82% కి పైగా పాఠశాలలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించాయి. ఇది 2018–19తో పోలిస్తే 4% కంటే ఎక్కువ.
  • ​​​​​​​​​​​​​​భారతదేశంలో 2019–20 నాటికి 84%కి మించి పాఠశాలల్లో లైబ్రరీ/రీడింగ్‌ రూమ్‌/రీడింగ్‌ కార్నర్‌ సౌకర్యం ఉంది.

    చదవండి: ఆ కిడ్నాపర్‌కు జీవితకాల జైలు శిక్ష విధించలేం: సుప్రీంకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement