
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ జేఈఈ–అడ్వాన్స్‌డ్ పరీక్ష జూలై 3వ తేదీన ఉంటుందని∙కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. ఈ క్వాలిఫయింగ్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కూడా కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాదికి సడలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు గాను అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75శాతం మార్కులు లేదా క్వాలిఫయింగ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. 2021నుంచి ఏడాదికి నాలుగు పర్యాయాలు జేఈఈ–మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. 10,12వ తరగతి పరీక్షలను మే నెలకు సీబీఎస్‌ఈ వాయిదా వేసింది.