iit jee advanced
-
జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష జూలై 3వ తేదీన ఉంటుందని∙కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. ఈ క్వాలిఫయింగ్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కూడా కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాదికి సడలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు గాను అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75శాతం మార్కులు లేదా క్వాలిఫయింగ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. 2021నుంచి ఏడాదికి నాలుగు పర్యాయాలు జేఈఈ–మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. 10,12వ తరగతి పరీక్షలను మే నెలకు సీబీఎస్ఈ వాయిదా వేసింది. -
ర్యాంకు వచ్చిందని.. బీఎండబ్ల్యు కారిచ్చారు!!
ఐఐటీ ప్రవేశపరీక్షలో ర్యాంకు కొట్టడమే గొప్ప అనుకుంటే.. ఆ ఘనత సాధించినందుకు వచ్చిన గిఫ్ట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్షలో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన తన్మయ షెకావత్ అనే విద్యార్థికి రాజస్థాన్‌లోని కోచింగ్ సంస్థ ఏకంగా బీఎండబ్ల్యు కారు బహుమతిగా ఇచ్చింది. తమ సంస్థలో కోచింగ్ తీసుకుని, 20లోపు ర్యాంకు ఎవరైనా సాధిస్తే వారికి ఈ కారు ఇస్తానని సంస్థ డైరెక్టర్ ముందే ప్రకటించారు. అన్నట్లుగానే షెకావత్‌కు మంచి ర్యాంకు వచ్చింది. దాంతో డబుల్ బొనాంజా కొట్టిన తన్మయ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు గంటున్నాడు. అయితే.. అతడికి వచ్చిన బహుమతి కొత్త కారు మాత్రం కాదు, సెకండ్ హ్యాండ్‌ది. ఇప్పటికి 1500 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంతకుముందు కోచింగ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎల్ పూనియా స్వయంగా దాన్ని నడిపారు. కారు విలువ దాదాపు రూ. 27 లక్షలు. ఇప్పటివరకు చాలా కోచింగ్ సంస్థలు మంచి బహుమతులే ఇచ్చినా, ఇంత కాస్ట్లీ గిఫ్టు ఇవ్వడం మాత్రం ఇదే మొదటిసారి.