న్యూఢిల్లీ : పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు ఈ సంవత్సరం ఆగస్ట్ 15 తరువాతే తెరుచుకుంటాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది విద్యార్థులు విద్యాసంస్థల పునః ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. 8వ తరగతి వరకు పిల్లలు పాఠశాలలకు రానవసరం లేకుండా, ఆ పై క్లాసుల పిల్లలకు 30% హాజరు సరిపోయేలా నిబంధనలను మార్చనున్నారని, జూలై లో కాలేజీలు, స్కూళ్లు ప్రారంభమవుతాయని మే నెల చివర్లో పలు వార్తలు వినిపించాయి.
అయితే, అదే సమయంలో కరోనా విజృంభించడంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంస్థలను పునః ప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించిం ది. ఇలా విద్యా సంస్థల పునః ప్రారంభం విషయంలో గందరగోళం కొనసాగుతుండటంతో మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘ఆగస్టు 15 తరువాత పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకుంటాయి. ఇప్పటివరకు జరిగిన, ఇక జరగనున్న అన్ని పరీక్షల ఫలితాలు ఆగస్టు 15లోపు వెల్లడయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. కాగా, కాలేజీలు, పాఠశాలలు ప్రారంభమైన తరువాత విద్యార్థులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యూజీసీ, ఎన్‌సీఈఆర్టీ మార్గదర్శకాలను రూపొందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment