రమేశ్ పొఖ్రియాల్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ఈ విద్యా సంవత్సరానికి గాను సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ స్పందించారు. ఈ విషయాన్ని తప్పుగా చిత్రీకరించడం ద్వారా సంచలనం సృష్టించేందుకు అజ్ఞానంతో చేస్తున్న వ్యాఖ్యలని గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘సమాఖ్యవాదం, జాతీయవాదం, స్థానిక ప్రభుత్వాలు వంటి పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ నుంచి తొలగించడం వాస్తవమే. నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల సూచనల మేరకే ఈ చర్య చేపట్టాం. అయితే, ఇది ఈ ఒక్క సబ్జెక్టుకే పరిమితం కాదు. బయాలజీలో న్యూట్రిషన్, డైజెషన్ వంటి వాటిని, ఫిజిక్స్‌లో రేడియేషన్, రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజిన్ వంటి అంశాలను, ఆర్థిక శాస్త్రంలో చెల్లింపుల లోటు వంటి అంశాలను ఈ ఏడాదికి మాత్రమే తొలగించాం. వీటిపైనా ప్రతిపక్షాలు స్పందించాలి’అని ఆయన కోరారు. ‘విద్యారంగ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని రాజకీయం చేయొద్దు’ అని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
దేశంలో కోవిడ్–19తో తలెత్తిన అసాధారణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు 30 శాతం వరకు పాఠ్యాంశాలను సీబీఎస్‌ఈ సిలబస్ నుంచి తగ్గించనున్నట్లు ప్రకటించడం, ఈ అంశంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రత్యేక సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికే ప్రజాస్వామ్యం, బహుళత్వం వంటి అంశాలను కేంద్రప్రభుత్వం విద్యార్థుల సిలబస్ నుంచి తొలగించిందని పేర్కొన్నాయి. (సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్)
Comments
Please login to add a commentAdd a comment