సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను కుదించే దిశగా అడుగులు పడుతున్నాయి. కోవిడ్–19, లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో 2019–20 విద్యా సంవత్సరం క్యాలెండర్ అమలు అస్తవ్యస్తంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు ముగియకపోవడం, 12వ తరగతి (ఇంటర్మీడియెట్ ) పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ఈ ప్రభావం వచ్చే విద్యా సంవత్సరంపై పడుతోంది. ఈ దృష్ట్యా కొత్త విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణ ఆలస్యం కానుందని.. దీనికి అనుగుణంగా సిలబస్‌ను కొంతమేర కుదించే యోచనలో ఉన్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమం రెండో రోజైన బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
జూలైలో వార్షిక పరీక్షలు!
► ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలు జూలైలో పెట్టే అవకాశముంది. దీనివల్ల 2020–21 విద్యా సంవత్సరాన్ని సకాలంలో ప్రారంభించే అవకాశం లేదు.
► వచ్చే విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో తక్కువ రోజులు ఉండటంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
► విద్యార్థులు ఏ మేరకు కాలాన్ని నష్టపోతున్నారనేది పరిగణనలోకి తీసుకుని సిలబస్‌ను కుదిస్తారు. దీనిపై సీబీఎస్‌ఈ కోర్సు కమిటీ అధ్యయనం చేస్తోంది.
► జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని సిలబస్ కుదింపు అంశాలు ఉంటాయని కేంద్రమంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేశారు.
తగిన సమయం ఇచ్చాకే పది పరీక్షలు
విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
ఒంగోలు: లాక్‌డౌన్ ఎత్తేశాక విద్యార్థులకు తగిన సమయం ఇచ్చాకే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఒంగోలులో బుధవారం మత్య్సకార భరోసా కార్యక్రమానికి హాజరైన ఆయనను ఫ్యాప్టో నేతలు జీఎస్‌ఆర్ సాయి, రఘుబాబు, పీవీ సుబ్బారావు కలిశారు. ఈ సందర్భంగా కోవిడ్ విధుల్లో ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని వారు కోరగా ఆ మేరకు మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment