‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’ | Adimulapu Suresh Fires On Chandrababu Deceitful Politics | Sakshi
Sakshi News home page

‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’

Published Fri, Mar 21 2025 7:12 PM | Last Updated on Fri, Mar 21 2025 7:17 PM

Adimulapu Suresh Fires On Chandrababu Deceitful Politics

సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్‌కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా  పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు.

..గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్‌ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది  రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

..ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను  మార్చి 10న  కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు.

..రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?.

..ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు.

..ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? 

..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్‌మెంట్‌ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా  సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement