సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒనగూరేదేమీ లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్‌తో తగిన కేటాయింపులు జరపలేదు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆక్షేపించారు.
‘‘ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. పేదలకు ఇచ్చిన హామీలకు తగట్టుగా బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. ప్రతి పేద విద్యార్థిని సూపర్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దాలని జగన్ తప్పించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు.’’ అని ఆదిమూలపు ధ్వజమెత్తారు.
..బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. సూపర్ సిక్స్ హామీల అమలును తుంగలో తొక్కారు. నిధుల కేటాయింపులు చేయకుండా జనాన్ని మోసం చేశారు. తల్లికి వందనం కింద 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు ఇవ్వాలి. కానీ అందులో సగం కూడా ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టలేదు. ఇది జనాన్ని మోసం చేయటం కాదా?
..వైఎస్ జగన్ నాడు-నేడు పథకం కింద 45 వేల ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయించారు. పిల్లలకు ట్యాబ్‌లు, బైజూజ్ కంటెంట్, మౌలిక సదుపాయాలను కల్పించారు. పిల్లలను గ్లోబల్ లెవల్‌లో అభివృద్ధి చేయాలనుకున్నారు. అందుకోసం తెచ్చిన పథకాలన్నిటినీ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. విద్యా వ్యవస్థను చంద్రబాబు సర్వ నాశనం చేస్తున్నారు. దీని వలన భావితరాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేయాలి. నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి. మేనిఫెస్టోని అమలు చేయలేకపోవటం సిగ్గుచేటు.
..2014లో కూడా చంద్రబాబు మేనిఫెస్టోని అమలు చేయలేదు. ఆ విషయాన్ని ప్రశ్నిస్తున్నామని అప్పట్లో ఇంటర్ నెట్ నుంచి మేనిఫెస్టోని తొలగించారు. కానీ జగన్ తన మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసి దాని విలువ పెంచారు. డీఎస్సీ కోసం ఏడు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆర్నెళ్లలో అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడేమో వచ్చే సంవత్సరం నుంచి అంటూ మళ్లీ మాట మార్చారు. జగన్ హయాంలో మొత్తం 21,108 టీచర్ పోస్టులను భర్తీ చేశాం. చంద్రబాబు మాత్రం విద్యావ్యవస్థను పాడు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.37 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్ లో దాని ఊసేలేదు
..రైతులకు పెట్టబడి సాయంగా పదివేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా నిధుల కేటాయింపులు లేవు. వాస్తవాలకు దూరంగా ఉన్న డాబుసరి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు, త్రిపుల్ ఐటీలలో కూడా మంచి భోజనం పెట్టటం లేదు. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అతిసారతో విద్యార్థులకు అవస్థలు పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. రూ.73 వేల కోట్లను జగన్ విద్యారంగానికి ఖర్చు చేశారు. మరి చంద్రబాబు ఎందుకు ఈ రంగాన్ని పక్కన పెట్టారు?. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఈ ఐదు నెలల్లోనే విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయలేక చతికిలపడ్డారు. 3,758 స్కూళ్లలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి లోకేష్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. మేనిఫెస్టోని అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment