సబ్జెక్ట్ టీచర్లు లేకుండా తమ పిల్లలు ఎలా పరీక్షలు రాస్తారంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం గురుకుల పాఠశాల వద్ద రోడ్డుపై ధర్నా చేస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు
- మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ అంటూ మెగా దగా
- ‘తల్లికి వందనం’ అంటూ ఊరూరా ఊదరగొట్టి ఇప్పుడు కిమ్మనని నేతలు
- ఒక్కొక్కరికి రూ.20 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామని హామీ
- గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచిన తొలి రోజే విద్యా కానుక అందజేత
- ఇప్పుడు 6 నెలలు గడిచినా అరకొరగా పంపిణీ
- ఐబీ, టోఫెల్‌ను అటకెక్కించిన కూటమి సర్కారు.. ఇంగ్లిష్ మీడియంపైనా అక్కసు.. సీబీఎస్‌ఈకి మంగళం
- ఏటా పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులు, సబ్జెక్ట్ టీచర్లు హుళక్కే
- ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ‘ప్రైవేటు’కు మేలు చేసే కుట్ర.. ఈ ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌కు వలస
- విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో టీచర్లకు స్థాన చలనం.. గ్రామీణ ప్రాంత స్కూళ్లు మూతపడే పరిస్థితి తీసుకొచ్చిన వైనం
- పేద పిల్లలపై వివక్ష చూపుతున్న ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలియని దుస్థితి
- ఏజెన్సీల మార్పుతో గందరగోళం.. నాణ్యత లేని మధ్యాహ్న భోజనం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చదువుల వెలుగులతో ప్రకాశించిన సర్కారీ బడులకు ఇప్పుడు చంద్ర గ్రహణం పట్టింది. నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందించాలనే ఉన్నత ఆశయంతో వైఎస్ జగన్ తెచ్చిన సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్(ఐబీ), పిల్లలకు ఏటా ట్యాబ్స్, డిజిటల్ తరగతులు, సబ్జెక్టు టీచర్లు వంటి వాటికి చంద్రబాబు సర్కారు మంగళం పాడుతోంది.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి.. ప్రవేట్‌కు ధారాదత్తం చేయడం ద్వారా తన వాళ్లకు మేలు చేసేందుకు కుట్ర పన్నింది. పేద విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించాలన్న గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ అద్భుత పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లల బంగారు భవిత కోసం వైఎస్ జగన్ గొప్ప సంస్కరణలతో బాటలు వేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వాటికి గండి కొడుతోంది. నాణ్యమైన చదువుల విప్లవానికి తూట్లు పొడుస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం బాగు పరిస్తే.. ఇప్పుడు తామొచ్చాకే వాటిని ఉద్దరిస్తున్నట్లు కూటమి సర్కారు కలరింగ్ ఇస్తోంది. ఇందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పేరిట ఆర్బాటాలకు తెరలేపింది.
మరోవైపు గత ప్రభుత్వంలో అమలైన ఒక్కో కార్యక్రమాన్ని తెరమరుగు చేస్తోంది. బడిఈడు ఉన్న ప్రతి ఒక్కరినీ బడికి పంపేలా ప్రోత్సహిస్తూ వైఎస్ జగన్ తీసుకొచ్చిన అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేక పోయింది. ‘జగన్ రూ.15 వేలు ఇస్తున్నారు.. మేమొస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం’అని నమ్మించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ హామీని అమలు చేయకుండా మోసం చేసింది.
సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్,ఐబీ శిక్షణకు మంగళం పాడింది. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ పైకి మాత్రం ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం పాటు పడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించక పోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఓ వైపు ఇక్కట్లు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆరు నెలలుగా విద్యా రంగం అభివృద్ధికి చేసిందేమీలేక పోగా.. గత ప్రభుత్వం తెచ్చిన చదువుల విప్లవాన్ని తన ఖాతాలో జమ చేసుకునేందుకు మాత్రం పావులు కదిపింది.
సీబీఎస్‌ఈకి మంగళం
» గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది.. తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు వెయ్యి ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన చంద్రబాబు అన్నంత పని చేశారు.
» 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్, పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
‘టోఫెల్’ రద్దు
» పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరంలో జగన్ ప్రభుత్వం టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది.
» నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్)లు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,285 మందికిగాను 4,17,879 మంది (82 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు.
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా పోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.
ఐబీ శిక్షణకూ అదే గతి
» ‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’ అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే కూటమి ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది.
» అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్ని తొలగించడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది.
కిట్లు పంపిణీలోను కూటమి కునికిపాట్లు..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కూళ్లు తెరిచిన రోజునే పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు సక్రమంగా అందలేదు. స్టూడెంట్ కిట్లను అరకొరగా కూటమి నేతలతో పంపిణీ చేయించారు. గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది.
‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు
» ప్రభుత్వ తీరు కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్లిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దు చేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు.
» మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ’రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
స్పష్టతలేని తల్లికి వందనం
» పేద పిల్లల చదువులను ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అద్భుతంగా అందించింది. పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో 2019 జూన్‌లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టడం ద్వారా డ్రాప్ అవుట్స్‌ను తగ్గించింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్‌లోనే రూ.15 వేలు చొప్పున అందించింది.
» 2022–23కు సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం ద్వారా ఏకంగా రూ.26,067.28 కోట్ల సాయం చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్‌లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా, కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది.
»ఇప్పటి వరకు తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించక పోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చిన మేరకు
‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.
బాబు పాలనలోఅట్టడుగున జీఈఆర్
చంద్రబాబు గత పాలనలో 2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం.
అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది.
భోజన ఏజెన్సీల మార్పు
రాష్ట్రంలో దాదాపు 80 వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో ఏకంగా 46 వేల మందికిపైగా మార్చేసిన కూటమి ప్రభుత్వం.. అతి సామాన్యుల పొట్ట కొట్టింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను ఇష్టానుసారం మార్చడంతో గందరగోళం ఏర్పడి, విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. భోజనానికి అందించే బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment