CBSE syllabus
-
చదువుల విప్లవానికి తూట్లు.. సర్కారు ప్రచార పాట్లు
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చదువుల వెలుగులతో ప్రకాశించిన సర్కారీ బడులకు ఇప్పుడు చంద్ర గ్రహణం పట్టింది. నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందించాలనే ఉన్నత ఆశయంతో వైఎస్ జగన్ తెచ్చిన సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్(ఐబీ), పిల్లలకు ఏటా ట్యాబ్స్, డిజిటల్ తరగతులు, సబ్జెక్టు టీచర్లు వంటి వాటికి చంద్రబాబు సర్కారు మంగళం పాడుతోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి.. ప్రవేట్‌కు ధారాదత్తం చేయడం ద్వారా తన వాళ్లకు మేలు చేసేందుకు కుట్ర పన్నింది. పేద విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించాలన్న గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ అద్భుత పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లల బంగారు భవిత కోసం వైఎస్ జగన్ గొప్ప సంస్కరణలతో బాటలు వేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వాటికి గండి కొడుతోంది. నాణ్యమైన చదువుల విప్లవానికి తూట్లు పొడుస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం బాగు పరిస్తే.. ఇప్పుడు తామొచ్చాకే వాటిని ఉద్దరిస్తున్నట్లు కూటమి సర్కారు కలరింగ్ ఇస్తోంది. ఇందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పేరిట ఆర్బాటాలకు తెరలేపింది. మరోవైపు గత ప్రభుత్వంలో అమలైన ఒక్కో కార్యక్రమాన్ని తెరమరుగు చేస్తోంది. బడిఈడు ఉన్న ప్రతి ఒక్కరినీ బడికి పంపేలా ప్రోత్సహిస్తూ వైఎస్ జగన్ తీసుకొచ్చిన అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేక పోయింది. ‘జగన్ రూ.15 వేలు ఇస్తున్నారు.. మేమొస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం’అని నమ్మించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ హామీని అమలు చేయకుండా మోసం చేసింది.సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్,ఐబీ శిక్షణకు మంగళం పాడింది. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ పైకి మాత్రం ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం పాటు పడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించక పోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఓ వైపు ఇక్కట్లు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆరు నెలలుగా విద్యా రంగం అభివృద్ధికి చేసిందేమీలేక పోగా.. గత ప్రభుత్వం తెచ్చిన చదువుల విప్లవాన్ని తన ఖాతాలో జమ చేసుకునేందుకు మాత్రం పావులు కదిపింది. సీబీఎస్ఈకి మంగళం » గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది.. తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు వెయ్యి ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన చంద్రబాబు అన్నంత పని చేశారు. » 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్, పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.‘టోఫెల్’ రద్దు » పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరంలో జగన్ ప్రభుత్వం టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. » నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్)లు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,285 మందికిగాను 4,17,879 మంది (82 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా పోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఐబీ శిక్షణకూ అదే గతి » ‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’ అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే కూటమి ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది.» అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్ని తొలగించడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. కిట్లు పంపిణీలోను కూటమి కునికిపాట్లు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కూళ్లు తెరిచిన రోజునే పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు సక్రమంగా అందలేదు. స్టూడెంట్ కిట్లను అరకొరగా కూటమి నేతలతో పంపిణీ చేయించారు. గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు » ప్రభుత్వ తీరు కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్లిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దు చేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు.» మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ’రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.స్పష్టతలేని తల్లికి వందనం» పేద పిల్లల చదువులను ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అద్భుతంగా అందించింది. పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో 2019 జూన్‌లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టడం ద్వారా డ్రాప్ అవుట్స్‌ను తగ్గించింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్‌లోనే రూ.15 వేలు చొప్పున అందించింది.» 2022–23కు సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం ద్వారా ఏకంగా రూ.26,067.28 కోట్ల సాయం చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్‌లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా, కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. »ఇప్పటి వరకు తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించక పోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చిన మేరకు ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.బాబు పాలనలోఅట్టడుగున జీఈఆర్చంద్రబాబు గత పాలనలో 2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది.భోజన ఏజెన్సీల మార్పురాష్ట్రంలో దాదాపు 80 వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో ఏకంగా 46 వేల మందికిపైగా మార్చేసిన కూటమి ప్రభుత్వం.. అతి సామాన్యుల పొట్ట కొట్టింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను ఇష్టానుసారం మార్చడంతో గందరగోళం ఏర్పడి, విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. భోజనానికి అందించే బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది. -
అనుకున్నదే జరిగింది పేద పిల్లలపై కక్ష తీర్చుకున్న బాబు
-
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్ఈ బోధన రద్దు... ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్టేట్ బోర్డు పరీక్షలే.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీబీఎస్ఈ 3, 6వ తరగతులకు కొత్త సిలబస్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పాఠశాలల్లో 3, 6వ తరగతుల పాఠ్యప్రణాళిక మారింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఆర్టీ) ప్రకటించింది. 3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. పుస్తకాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. 4, 5, 9, 11వ తరగతుల పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ వెబ్‌సైట్‌తో పాటు దీక్షా, ఈ–పాఠశాల పోర్టల్, యాప్‌లలో అందుబాటులో ఉంటాయి. -
ఇంగ్లిష్.. భవిత భేష్
మన పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య, పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. మన పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి ♦ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ ♦ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాట మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. మన ఇంగ్లిష్ విద్యపై ప్రసంశలజల్లు ♦ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ♦ ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ♦ ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ♦ ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైస్కూల్ లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా తేస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు అందించడంతో పాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
సర్కారు బడిలో అంతర్జాతీయ విద్య
సాక్షి, అమరావతి: ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి. అందుకోసం వారికి మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి డిజిటల్ బోధన ప్రవేశపెట్టాం. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నాం. మన పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియెట్ (ఐబీ) బోధన కూడా ప్రవేశపెడతాం’’ జగనన్న ఆణిముత్యాలు రాష్ట్ర స్థాయి సత్కార వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట ఇది. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఐబీ సంస్థతో బుధవారం ఒప్పందం చేసుకుని ఆచరణలోకి తెచ్చారు. ఇప్పటికే సర్కారు బడిలో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ బోధనను అందుబాటులోకి తె చ్చిన ప్రభుత్వం ఇప్పుడు ‘ఐబీ’ చదువులను సైతం పేద పిల్లలకు చేరువ చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. ఈ స్కూళ్లలో సంపన్నులు మాత్రమే తమ పిల్లలను చదివించగలరు. అలాంటి చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ ప్లస్2 వరకు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రపంచం మె చ్చిన విద్యా విధానం సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలో మార్కులు.. ర్యాంకులు.. ఒకరితో మరొకరికి పోటీతో పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెంచుతారు. దీనికి భిన్నంగా మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలు సొంతంగా ఎదగడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బోధనను ఐబీ అందిస్తుంది. ఐబీ ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్. పిల్లలపై పరీక్షల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన కొంత మంది ఉపాధ్యాయులు పరిశోధన చేసి 1968లో స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ బోర్డు. ఇందులో 3 నుంచి 19 ఏళ్ల వయసు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణనిస్తారు. ఈ సిలబస్ చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెరి్నంగ్ వంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్–మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఆకళింపు చేసుకుని, సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 159 దేశాల్లో ఈ విద్యా విధానం అమలులో ఉంది. ఈ బోర్డులో చదువుకున్న పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశాలు, అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇతర కోర్సులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న నేటి యుగంలో ‘ఐబీ సిలబస్’లో పిల్లల నైపుణ్యాలను అంచనా వేసే అంతర్గత పరీక్షలేగాని అధికారిక పరీక్షలు ఉండవు. నాలుగు దశల్లో ప్రోగ్రాములు ఐబీ ప్రోగ్రాములు నాలుగు దశల్లో ఉంటాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయసు విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (పీవైపీ) అందిస్తారు. ఇందులో పిల్లలకు నేర్చుకునే ఆసక్తి పెంచడం, కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, సొంతంగా ఆలోచించడం వంటివి నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో పరీక్షలు గానీ, గ్రేడింగ్ కానీ ఉండవు. పదేళ్ల ఈ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివరలో సైన్స్ ఎగ్జిబిషన్ వంటిది నిర్వహించి పిల్లలను భాగస్వామ్యం చేస్తారు. ♦ కాగా, 11 నుంచి 16 సంవత్సరాల విద్యార్థులకు మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్ (ఎంవైపీ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్, సైన్సెస్ అనే 8 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు నైపుణ్యాలను ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ కోర్సు ప్రస్తుతం మన పదో తరగతికి సమానం. ♦ ఇక 16 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) ఉంటుంది. మూడేళ్ల పాటు ఉండే ఈ ప్రోగ్రామ్‌లో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, లాంగ్వేజ్ అక్విజిషన్, సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్ అనే 6 గ్రూపులు ఉంటాయి. డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివర్లో సరి్టఫికెట్ ప్రదానం చేస్తారు. మన ప్లస్ 2 విద్యకు సమానమైన ఈ డిప్లొమా సర్టిఫికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా చెల్లుతుంది. ♦ ఇదే వయసున్న (16–19 సం.) విద్యార్థుల కోసం కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ (సీపీ) డిజైన్ చేశారు. ఇది విశ్వవిద్యాలయాలు, ఉపాధి, తదుపరి ట్రైనింగ్ కోసం విద్యార్థులను సిద్ధం చేసే రెండేళ్ల ప్రోగ్రామ్. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు. విశ్వ మానవుడిగా ఎదుగుదల ఐబీ విద్య విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశి్నంచడం అలవాటు చేస్తుంది. ఇది సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించే సామర్థాన్ని ఇస్తుంది. రాయడం, మాట్లాడటం, ప్రెజెంటేషన్ సహా వివిధ మార్గాల్లో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే నైపుణ్యాలు బోధిస్తారు. వారి చదువు, కెరీర్‌ను మరింత విజయవంతం చేసేందుకు దోహదం చేస్తుంది. ఐబీ విద్యార్థులు విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల గురించి నేర్చుకుంటారు. ఇది వారికి మరింత సహనాన్ని, ఇతరులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా తయారు చేస్తారు. ప్రపంచంలో ఏమూల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అక్కడ సానుకూల మార్పును తీసుకురావడానికి ఈ విద్య సహాయపడుతుంది. అంతర్జాతీయంగా అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో 210 ఐబీ స్కూళ్లు వాస్తవానికి ఇంటర్నేషనల్ బాకలారియెట్ చదువులు చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముస్సోరి, కొడైకెనాల్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పరిధిలో 210 ఐబీ వరల్డ్ స్కూల్స్ ఉన్నా యి. వాటిల్లో ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (3–12సం.) మాత్రమే అందిస్తుండగా, కొన్ని కొన్ని మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ (11–16 సం.) వరకు, అతి తక్కువ స్కూళ్లు మాత్రం డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) వరకు బోధిస్తున్నాయి. -
సీబీఎస్ఈ బోధన... ఇకపై తెలుగులో కూడా
భువనేశ్వర్: ఉన్న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి. -
రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు అమలు చేస్తోందని పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్ చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 259 పాఠశాలలు సీబీఎస్ఈకి అనుబంధంగా ఉంటే ఇప్పుడు 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యావిధానం అమలు చేయడం సీబీఎస్ఈ చరిత్రలోనే మైలురాయిగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ నిర్మాణాత్మక బోధన అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌కు నాలుగు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్కరణల్లో భాగంగా సీబీఎస్ఈ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యతో పాటు సరైన మూల్యాంకనం, విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సమైక్యంగా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారని చెప్పారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు, విద్యావిధానాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (క్రిస్‌్ప) కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, మోడల్ స్కూల్ కార్యదర్శి ఎం.వి.కృష్ణారెడ్డి, వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల ప్రిన్సిపల్స్, ఏపీ, తెలంగాణ ఎస్సీఈఆరీ్ట, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్, రూమ్ టూ రీడ్, అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
Annamayya District: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ పాఠాలు
మదనపల్లె సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మెరుగైన ర్యాంకులు తప్పకుండా సాధించాలి. ఇందుకు జాతీయ స్థాయి విద్యా విధానం (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కీలకంగా మారింది. ఈ తరుణంలో నగరాలు, పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితౖమైన సీబీఎస్ఈ సిలబస్ ఇక మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అందనుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్ లక్ష్యంగా మరింత నాణ్యమైన, ఖరీదైన విద్య చేరువ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సీబీఎస్ఈ సిలబస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా బడుల్లో ప్రధానోపాధ్యాయులు, సహాయ ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు. ప్రస్తుతం జాతీయస్థాయి పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సీబీఎస్ఈ సిలబస్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ను సీబీఎస్ఈ సిలబస్‌లో పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తా చాటేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరో తరగతిలో చేరితే +2 (ఇంటర్) విద్య వరకు విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. పది అంశాలపై నివేదిక సీబీఎస్‌ఈను అమలు చేయనున్న పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా పది అంశాలపై కేంద్ర విద్యామండలికి నివేదిక అందజేసింది. పాఠశాలల గుర్తింపు, ఫైర్‌సేఫ్టీ, ధ్రువపత్రం, పాఠశాల యాజమాన్య కమిటీ, ఈపీఎఫ్ గుర్తింపు సంఖ్య, ఏకో ఫ్రెండ్లీ వాతావరణం, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విద్యార్హతలు, వెబ్సైట్ తదితర వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల పరిధిలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన అమలు కానుంది. అనంతరం సాధ్యాసాధ్యాలను పరిశీలించి మిగిలిన పాఠశాలల్లో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లాలో సీబీఎస్ఈకి ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ విధాననం ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో కూడా లేదు. కార్పొరేట్ పాఠశాలల్లో తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనుంది. పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ విధానం విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు కార్పొరేట్, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే ఉన్న ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావడం శుభపరిణామం. కేంద్ర విద్యా మండలి నిబంధనల మేరకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న పాఠశాలల ఎంపిక వెబ్సైట్ ద్వారా జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 9 వ తరగతి నుంచి ఈ విధానం అమలు చేసేందుకు ఇప్పటి నుంచే 8వ తరగతి విద్యార్థులను సన్నద్దం చేస్తున్నాం. – క్రిష్ణప్ప, డివైఈఓ, మదనపల్లె మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య అందే అవకాశం ఉంటుంది. – పి.మహమ్మద్‌ఖాన్, టీచర్, జెడ్పీహెచ్ఎస్,మదనపల్లె -
ఏపీ సర్కారీ స్కూళ్లలోనూ సీబీఎస్ఈ.. 1000 పాఠశాలలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రవేశానికి అడుగులు ముందుకు పడ్డాయి. మొదటి దశలో 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులిచ్చింది. దీంతో ఈ స్కూళ్లన్నిటిలో రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతి విద్యార్థులంతా సీబీఎస్ఈ విధానంలో చదువుతారు. అత్యున్నత మూల్యాంకన, బోధనా విధానాలున్న సీబీఎస్ఈ విధానాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లన్నిటిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పిల్లలే. వీరంతా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అన్ని రాష్ట్రాలకన్నా ముందుగా ఫౌండేషనల్ విద్యావిధానానికి బాటలు వేసింది. మరోవైపు సీబీఎస్ఈ విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తే విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు అందుకోగలుగుతారని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ముందుగా గుర్తించింది. మొదటి దశలో మొత్తం 1,308 ప్రభుత్వ స్కూళ్లకు అనుమతుల కోసం సీబీఎస్ఈ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ స్కూళ్లలో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వీటిలో జిల్లా పరిషత్ స్కూళ్లు 417, మునిసిపల్ స్కూళ్లు 71, ఏపీ గురుకుల విద్యా సంస్థలు 39, ఏపీ మోడల్ స్కూళ్లు 164, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 352, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 179, బీసీ గురుకుల సంక్షేమ విద్యా సంస్థలు 26, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 45, ఆశ్రమ్ స్కూళ్లు 15 ఉన్నాయి. వీటికి సీబీఎస్ఈ అనుమతుల కోసం రూ.5.88 కోట్లను విద్యా శాఖ సీబీఎస్ఈ బోర్డుకు చెల్లించింది. గుర్తింపునకు అవసరమైన పత్రాలను కూడా ఆన్లైన్లో సమర్పించింది. ఈ స్కూళ్లలో 1,229 స్కూళ్లకు అఫ్లియేషన్ నంబర్ వచ్చినా చివరకు 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ స్కూళ్లల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేసింది. వీటిని తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో ఉండేలా మిర్రర్ ఇమేజ్‌లు రూపొందించి అందించింది. మిగతా స్కూళ్లకు చర్యలు వేగవంతం.. కాగా రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ స్కూళ్లలోనూ సీబీఎస్ఈ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్ తదితరులు చర్యలు వేగవంతం చేశారు. శుక్రవారం సీబీఎస్ఈ బోర్డు అధికారులతో వెబ్ఎక్స్ సమావేశంలో వీటిపై చర్చించారు. సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా సిద్ధం చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 83,466 మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. సీబీఎస్ఈ విధానంతో విద్యార్థులకు ప్రయోజనాలు ఇవే.. సీబీఎస్ఈ విధానం అమలుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. – సీబీఎస్ఈ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ. అత్యున్నత విద్యా విధానాలు అమలు చేస్తున్న సీబీఎస్ఈకి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. – ఈ విద్యా విధానంలో చదివిన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు లభిస్తోంది. – దేశంలో ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్, జిప్మర్, సీఎంసీ వంటి సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ, నీట్ వంటివి సీబీఎస్ఈ సిలబస్‌తోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల దశ నుంచే సీబీఎస్ఈ విధానంలో చదివినవారు జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు కొల్లగొడుతున్నారు. – సీబీఎస్ఈ విధానం విద్యార్థుల్లో బలమైన పునాదులు వేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో విద్యార్థి తన ఆసక్తిని అనుసరించి చదువులు కొనసాగించే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంటున్నారు. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండదని వివరిస్తున్నారు. – దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థులు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగించవచ్చు. – సీబీఎస్ఈ విద్యావిషయక అంశాల్లోనే కాకుండా విద్యార్థి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా సమస్యను తనంతట తాను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు తమంతట తాముగా చదువుకోగలిగే నైపుణ్యాలను కూడా అందిస్తుందని పేర్కొంటున్నారు. జిల్లా సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఖ్య శ్రీకాకుళం 64 విజయనగరం 64 పార్వతీపురం మన్యం 40 విశాఖపట్నం 19 అనకాపల్లి 41 అల్లూరి సీతారామరాజు 35 కాకినాడ 33 కోనసీమ 12 తూర్పు గోదావరి 15 పశ్చిమ గోదావరి 16 ఏలూరు 34 కృష్ణా 9 ఎన్టీఆర్ 27 గుంటూరు 11 బాపట్ల 21 పల్నాడు 66 ప్రకాశం 63 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 40 చిత్తూరు 22 తిరుపతి 30 వైఎస్సార్ 30 అన్నమయ్య 49 కర్నూలు 90 నంద్యాల 69 అనంతపురం 51 శ్రీసత్యసాయి 49. -
ఎస్సీ గురుకులాల్లో సీబీఎస్ఈ బోధన
సాక్షి, అమరావతి: ఎస్సీ సంక్షేమ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యాబోధన ప్రారంభించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సీబీఎస్ఈ విధానంలో విద్యాబోధన కోసం టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో విద్యాబోధన మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ గురుకులాల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రారంభించామన్నారు. కొత్త విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు గురుకులానికి చెందిన ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు. గురుకుల విద్యార్థులకు బోధన మరింత సరళీకృతం చేసేందుకు డిజిటల్ క్లాస్ రూములు, వర్చువల్ క్లాస్ రూముల ద్వారా పాఠాలు చెప్పేందుకు ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. పరీక్షల విధానంలోనూ మార్పులను తెచ్చామన్నారు. ముఖ్యంగా 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ప్రతివారం పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, ముందుగా రెండు టెస్ట్‌లు నిర్వహించాకే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ విధంగా వారాంతపు పరీక్షలు కాకుండా ప్రధానమైన ఏడు టెస్టులు, పరీక్షలు పెట్టడం ద్వారా విద్యార్థులు వారు విన్న పాఠాలను పూర్తిగా అవగతం చేసుకుని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థుల్లో పాజిటివ్ దృక్పథం కోసం అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ సంస్థలు ముందుకొచ్చాయని, వాటితో త్వరలోనే ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి, డిప్యూటీ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ బీవీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో.. సీబీఎస్ఈ పాఠాలు
కడప ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నాడు– నేడు పనులతో ఇప్పటికే ఊరి బడిని ఆధునిక హంగులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. తాజాగా రానున్న విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్ బోధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగా వైఎస్సార్ జిల్లాలో సౌకర్యాలు ఉన్న 35 పాఠశాలల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే బోధన ప్రారంభించనున్నారు. అందుబాటులోకి ఖరీదైన విద్య ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందుబాటులోకి రానుంది. సీబీఎస్ఈ సిలబస్‌తో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవడం సులభం అవుతుంది. 35 పాఠశాలల్లో అమలు సీపీఎస్ఈ విధానం ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్‌కు మారనున్నాయి. ఇందులో కడప డివిజన్లో 17, ప్రొద్దుటూరు డివిజన్లో 8, రాయచోటి డివిజన్లో 10 హైస్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ బోధించనున్నారు. ఇందులో ఆరో తరగతిలో చేరితే ఇంటర్ విద్య వరకు ఇక్కడే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అత్యాధునిక పద్ధతిలో బోధన సీబీఎస్ఈ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ బోధన కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు జేఈఈ, నీట్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తారు. విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు పెంచేలా సిలబస్ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండటం ప్రత్యేకత. మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నతస్థాయి విద్య అందే అవకాశం ఉంటుంది. – మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, సంబేపల్లి హైస్కూల్ పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ సిలబస్‌తో బోధన పేద విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రమే ఉన్న సీబీఎస్ఈ సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మారుమూల పల్లెకు కూడా చేరనుంది. – నారాయణ, ఎంఈవో, కడప ఉన్నతాధికారులకు నివేదిక పంపాం సీబీఎస్ఈ సిలబస్ బోధనకు అనుగుణంగా ఉన్న 35 స్కూళ్ల వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తాం. – శైలజ, డీఈవో, కడప -
AP: ప్రభుత్వ బడిలో సీబీఎస్ఈ సిలబస్.. ప్రయోజనాలు ఇవే..
విజయనగరం అర్బన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం విద్యా సంస్కరణలు చేస్తోంది. ఇప్పటికే నాడు–నేడు పనులతో ఊరి బడికి ఆధునిక హంగులు అద్దింది. ఆహ్లాదకరంగా తీర్చిదింది. తాజాగా సీబీఎస్ఈ (సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి సిలబస్ బోధించేలా కార్యా చరణ ప్రణాళికను రూపొందిస్తోంది. పేద విద్యార్థులకు వరం.. సీబీఎస్ఈ సిలబస్ అమలుకు జిల్లాలో 90 పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నిరు పేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందుబాటులోకి రానుంది. సీబీఎస్ఈ సిలబస్‌తో పది, ఇంటర్ పూర్తి చేస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తాచాటే అవకాశం దక్కుతుంది. ఈ విధానం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో అందుబాటులో ఉండగా... ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలుచేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సిలబస్ వల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రభుత్వ పాఠశాలల నుంచి దరఖాస్తులు వెళ్తున్నా యి. పాఠశాల విస్తీర్ణం రెండెకరాలకు పైబడి ఉన్నవాటికి తొలిప్రాధాన్యం కల్పిస్తున్నారు. చదవండి: అమ్మ కంట ఆనందభాష్పాలు.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు తొలుత 10 పాఠశాలల్లో అమలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమం ఉన్న కేజీబీవీ, మోడల్ స్కూల్స్, సంక్షేమ వసతి పాఠశాల లతో పాటు జిల్లాలోని తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలున్న మరో 10 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనున్నారు. వీటిలో వెయ్యి మంది పైబడి విద్యార్థులున్న రామభద్రపురం, మక్కువ, చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. నూతన విద్యావిధానం అమలులోభాగంగా 3, 4, 5వ తరగతులను విలీనం చేసిన జొన్నవలస, పాంచాలి, బుడతనాపల్లి, మెట్టపల్లి, గంట్యాడ, బలిజిపేట, కుమరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. బోధనలో నూతనత్వం.. సీబీఎస్ఈ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆరో తరగతి నుంచే జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థి అభ్యసనా సామ ర్థ్యాలు పెంచేలా సిలబస్ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, ఆటస్థలం ఉండటం వీటి ప్రత్యేకత. ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా బోధన సిలబస్‌లో ఇమిడి ఉంటుంది. ప్రయోజనాలు ఇవీ....: ► విద్యార్థికి స్నేహపూర్వకంగా ఉంటుంది. కోర్సు నిర్మాణం ఒత్తిడిని ఎదుర్కోకుండా చేస్తుంది. పుస్తకాలు ఆసక్తికరంగా, విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో రూపొందిస్తారు. ఉల్లాసభరితమైన విద్యాబోధన ఉంటుంది. ► పోటీ పరీక్షల్లో విద్యార్థుల మేధస్సుకు పదును పట్టేలా ఉంటాయి. యాంత్రిక విద్యకు దూరంగా ఉంటాయి. వాస్తవాలకు దగ్గరగా విద్యను బోధిస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతానికి ప్రాధా న్యం కల్పించరు. ఎంత నేర్చుకున్నారో పరీక్షించే విధంగా ప్రశ్న పత్రాలు రూపొందిస్తారు. ఫలితాలు అనుకూలంగా వస్తాయి. తక్కువ మంది పరీక్షల్లో విఫలమవుతారు. ► ఐఐటీ, ఎయిమ్స్ వంటి కేంద్రీకృత సంస్థ నుంచి భవిష్యత్ అధ్యయనాలను కొనసాగించాలను కుంటే సీబీఎస్ఈ పాఠ్యాంశాలు చాలా సహాయ పడతాయి. ఈ సంస్థల ప్రాథమిక పరీక్షలు సీబీఎస్ఈ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య విద్యాలయాల్లో సీబీఎస్ఈ బోధన అమలుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకంటరీ ఎడ్యుకేషన్ అనుమతులు ఇచ్చింది. ► 2024–25 విద్యా సంవత్సరానికి సీబీఎస్ఈ సిలబస్‌తో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్ని విద్యార్థులు రాసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విద్యార్థులకు ఉపయుక్తం సీబీఎస్ఈ సిలబస్ విద్యార్థులకు ఉపయుక్తం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మరింత ప్రతిభ చూపి మంచి ఫలితాలు సాధించవచ్చు. జిల్లాలో ఎంపిక చేసిన 90 స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుంది. – డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జేసీ (అభివృద్ధి) విలీన స్కూల్ నుంచి ప్రారంభిస్తే మంచిది ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ మంచిదే. అన్ని తరగతులకు ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రవేశ పెట్టాలి. మరో వైపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఉన్న తెలుగు మాధ్యం విద్యార్థులకు చదువు క్లిష్టతరం అవుతుంది. నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలలను ఇటీవల విలీనం చేసిన జెడ్పీహెచ్ స్కూళ్లలో తొలి దశగా అమలు చేయాలి. – టి.సన్యాసిరాజు, హెచ్ఎం, బొండపల్లి జెడ్పీహెచ్‌స్కూల్ -
బంగారు భవిష్యత్తుకే ‘సీబీఎస్ఈ’
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా మార్పులు తెచ్చి రాష్ట్ర విద్యార్థులు పోటీ పడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తరఫున రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో 61,208 పాఠశాలలు ఉండగా 44,639 (73 శాతం) ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో 43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 6,13,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ప్రవేశం పొందారు. వీరిలో దాదాపు 4 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రాగా రెండు లక్షల మంది కొత్తగా ప్రవేశం పొందారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం, అదికూడా కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రవేశాలు పొందడం చరిత్రాత్మకం. వీరందరికీ బంగారు భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. సీబీఎస్ఈకి దేశ విదేశాల్లో 25,000కి పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా బోర్డుకు అనుసంధానించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 2024 – 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు ద్వారా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపడుతుంది’ అని పేర్కొన్నారు. -
50శాతం తగ్గనున్న సీబీఎస్ఈ, సీఐఎస్సీ సిలబస్?
న్యూఢిల్లీ : విద్యా ప్రమాణాలు అధికంగా ఉండే సీఐసీసీఈ జూన్‌లో 2020-21 ఏడాదికి సిలబస్ తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అసాధారణ (కరోనా) పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్ సిలబస్‌తో విద్యార్థులకు బోధించలేమని భావించి 9 నుంచి 12వ తరగతులకు సిలబస్ 30 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సీఐసీసీఈ తర్వాత సీబీఎస్ఈ కూడా అదే బాటలో 30 శాతం సిలబస్ తగ్గించింది. తొలగించిన సిలబస్ నుంచి పరీక్షలో ప్రశ్నలు ఏవీ రావని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈని అనుసరించి అనేక రాష్ట్ర బోర్డులు కూడా వారి సిలబస్‌లో 25శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించాయి. చదవండి: 30% తగ్గనున్న సీబీఎస్ఈ సిలబస్ కాగా తాజాగా ఈ ఏడాది బోర్డు పరీక్షలను సులభతరం చేసేందుకు సిలబస్‌ను మరింత తగ్గించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ఆలోచనలు చేస్తున్నాయి. ఇంతకు ముందు నిర్ణయించినట్లు 30 శాతానికి బదులు 50 శాతం సిలబస్ తగ్గించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయంపై సీబీఎస్‌ఈఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ..పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రానందున ఈ ఏడాది బోర్డు పరీక్షలు 70శాతం లేదా 50 శాతం సిలబస్‌తో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు , దీనిపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చదవండి: రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య.. ఇప్పటికీ పాఠశాలలు తెరుచుకోకపోవడం, ఆన్లైన్ తరగతులు కొనసాగుతుండటం వల్ల జాతీయ విద్యా బోర్డులు కూడా పరీక్షలను 45 నుంచి 60 రోజులు ఆలస్యం చేయాలని ఆలోచిస్తున్నాయి. బోర్డు పరీక్షలను ఏప్రిల్‌కు మార్చే అవకాశం ఉంది. అయితే వీటిపై ఇంకా విధానాన్ని ఖరారు చేయలేదు. కాగా పాఠశాలలు, కళాశాలలను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. నాన్-కంటైనర్ జోన్లలో అక్టోబర్ 15 నుంచి దశలవారీగా పాఠశాలలను తిరిగి తెరవవచ్చని పేర్కొంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. కానీ ఇప్పటికీ భారత్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నందున చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపంచేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఇప్పట్లో స్కూళ్లకు పూర్తి స్థాయి హాజరు ఉండకపోవచ్చు. -
రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య..
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఈ విద్యా సంవత్సరానికి గాను సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ స్పందించారు. ఈ విషయాన్ని తప్పుగా చిత్రీకరించడం ద్వారా సంచలనం సృష్టించేందుకు అజ్ఞానంతో చేస్తున్న వ్యాఖ్యలని గురువారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘సమాఖ్యవాదం, జాతీయవాదం, స్థానిక ప్రభుత్వాలు వంటి పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ నుంచి తొలగించడం వాస్తవమే. నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల సూచనల మేరకే ఈ చర్య చేపట్టాం. అయితే, ఇది ఈ ఒక్క సబ్జెక్టుకే పరిమితం కాదు. బయాలజీలో న్యూట్రిషన్, డైజెషన్ వంటి వాటిని, ఫిజిక్స్‌లో రేడియేషన్, రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజిన్ వంటి అంశాలను, ఆర్థిక శాస్త్రంలో చెల్లింపుల లోటు వంటి అంశాలను ఈ ఏడాదికి మాత్రమే తొలగించాం. వీటిపైనా ప్రతిపక్షాలు స్పందించాలి’అని ఆయన కోరారు. ‘విద్యారంగ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని రాజకీయం చేయొద్దు’ అని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్–19తో తలెత్తిన అసాధారణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు 30 శాతం వరకు పాఠ్యాంశాలను సీబీఎస్ఈ సిలబస్ నుంచి తగ్గించనున్నట్లు ప్రకటించడం, ఈ అంశంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రత్యేక సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికే ప్రజాస్వామ్యం, బహుళత్వం వంటి అంశాలను కేంద్రప్రభుత్వం విద్యార్థుల సిలబస్ నుంచి తొలగించిందని పేర్కొన్నాయి. (సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్) -
30% తగ్గనున్న సీబీఎస్ఈ సిలబస్
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా సకాలంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 విద్యా సంవత్సరంలో 9 నుంచి12వ తరగతి వరకు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. ‘దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులపై భారం తగ్గించి, కరిక్యులమ్ రివైజ్ చేయాలని సీబీఎస్ఈని కోరాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ తెలిపారు. దీనిపై గత వారం సూచనలు కోరగా విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో స్పందించారన్నారు. వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, 30 శాతం మేర సిలబస్‌ను హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. ఈమేరకు మార్పులను సీబీఎస్ఈ పరిపాలక మండలి కూడా ఆమోదించిందన్నారు. తగ్గించిన సిలబస్ పాఠ్యాంశాలను కూడా విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని పాఠశాలలకు, ఉపాధ్యాయులకు సూచించామన్నారు. అయితే, ఇంటర్నల్స్, వార్షిక పరీక్షల్లో తగ్గించిన సిలబస్‌లోని అంశాలపై ప్రశ్నలుండవని వివరించారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రత్యామ్నాయ కేలండర్‌ను రూపొందించి, ప్రకటించిందన్నారు. -
సీబీఎస్ఈ సిలబస్ కుదింపు!
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్‌ను కుదించే దిశగా అడుగులు పడుతున్నాయి. కోవిడ్–19, లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో 2019–20 విద్యా సంవత్సరం క్యాలెండర్ అమలు అస్తవ్యస్తంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు ముగియకపోవడం, 12వ తరగతి (ఇంటర్మీడియెట్ ) పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ఈ ప్రభావం వచ్చే విద్యా సంవత్సరంపై పడుతోంది. ఈ దృష్ట్యా కొత్త విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణ ఆలస్యం కానుందని.. దీనికి అనుగుణంగా సిలబస్‌ను కొంతమేర కుదించే యోచనలో ఉన్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఆన్లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమం రెండో రోజైన బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. జూలైలో వార్షిక పరీక్షలు! ► ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలు జూలైలో పెట్టే అవకాశముంది. దీనివల్ల 2020–21 విద్యా సంవత్సరాన్ని సకాలంలో ప్రారంభించే అవకాశం లేదు. ► వచ్చే విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో తక్కువ రోజులు ఉండటంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ► విద్యార్థులు ఏ మేరకు కాలాన్ని నష్టపోతున్నారనేది పరిగణనలోకి తీసుకుని సిలబస్‌ను కుదిస్తారు. దీనిపై సీబీఎస్ఈ కోర్సు కమిటీ అధ్యయనం చేస్తోంది. ► జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని సిలబస్ కుదింపు అంశాలు ఉంటాయని కేంద్రమంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేశారు. తగిన సమయం ఇచ్చాకే పది పరీక్షలు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒంగోలు: లాక్డౌన్ ఎత్తేశాక విద్యార్థులకు తగిన సమయం ఇచ్చాకే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఒంగోలులో బుధవారం మత్య్సకార భరోసా కార్యక్రమానికి హాజరైన ఆయనను ఫ్యాప్టో నేతలు జీఎస్ఆర్ సాయి, రఘుబాబు, పీవీ సుబ్బారావు కలిశారు. ఈ సందర్భంగా కోవిడ్ విధుల్లో ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని వారు కోరగా ఆ మేరకు మంత్రి హామీ ఇచ్చారు. -
ఇక ఒత్తిడి లేని చదువులు
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ అనగానే నోటి నుంచి వచ్చే పదం ‘వేరీ టఫ్’. ఎక్కువ సబ్జెక్టు, లోతైన విషయ పరిజ్ఞానం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పాఠ్య పుస్తకాలను రూపొందించడంతో ఈ సిలబస్ ఎంచుకునే వారిపై సహజంగా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణంలో బోధన, అభ్యసన కార్యక్రమాలు సాగేలా సీబీఎస్ఈ అకడమిక్ ప్లాన్‌లో భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని సంకల్పించిన బోర్డు.. పాఠ్యాంశంలో అనవసర భాగాన్ని తొలగిస్తూ చదవాల్సిన భాగానికి ప్రాధాన్యత ఇచ్చింది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు విశ్లేషణా సామర్థ్యం, తార్కిక సామర్థ్యాల పెంపునకు ఆస్కారం కల్పించింది. పరీక్షల నిర్వహణలోనూ విద్యార్థులకు ‘చాయిస్–ఆప్షన్’ఇచ్చింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రక్రియ.. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేలా కార్యాచరణ రూపొందించింది. మార్పులు.. చేర్పులు.. సీబీఎస్ఈ పాఠశాలల్లో నిర్వహించే బోధన కార్యక్రమాల్లో ఆర్ట్ (కళ) అంశాన్ని జోడిస్తున్నారు. టీచర్లు బోధించే అంశాలతో పరిమితం కాకుండా విద్యార్థుల అనుభవాత్మకమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వా లని బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో అనవసర భాగాన్ని తొలగించింది. దీంతో విద్యార్థుల అభ్యనస సమయం తగ్గడంతో.. ఈ సమయాన్ని ఇతర కార్యక్రమాలకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించింది. ప్రతి సబ్జెక్టులో ఆర్ట్ ఎడ్యుకేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిన బోర్డు.. సబ్జెక్టు ద్వారా విద్యార్థి నేర్చుకున్న అంశానికి ఈ ఆర్ట్‌ను జోడించింది. దీంతో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత పెరగడం తోపాటు లోతుగా విషయం తెలుసుకునే వీలుంటుంది. విద్యార్థికి విశ్లేషణా సామర్థ్యం తో పాటు తార్కిక సామర్థ్యం పెరుగుతుంది. జీవన విధానంలో ప్రధాన అంశాలపైనా దృష్టి పెట్టింది. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. యోగా అభ్యాసంతో పాటు క్రీడలు నిర్వహించాలని సూచించింది. పరీక్షల్లో ‘చాయిస్–ఆప్షన్’ విధానం పరీక్షల విధానంలో సీబీఎస్ఈ ప్రత్యేక విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పరీక్షల్లో చాయిస్ లేకుండా ప్రతి ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉండేది. తాజాగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ప్రవేశపెడుతోంది. దీంతో జవాబులు రాయడం సులభతరం కావడంతో విద్యార్థికి ఎక్కువ మార్కులు స్కోర్ చేసే వీలుంది. ఇందులో ఇంటర్నల్ అసిస్‌మెంట్‌కు ప్రాధాన్యత కలగనుంది. ఆప్షన్ విధానంలో భాగంగా మరిన్ని అవకాశాలు కల్పించింది. గతంలో 20 శాతం ఆప్షన్ కింద ఉండగా.. ఇప్పుడు 33 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఐదింటా మూడింటికి సమాధానాలు రాసేలా ఆప్షన్లు పెరగనున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ కీలకం.. సీబీఎస్ఈ సిలబస్‌లో తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని జోడించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించే అంశంగా దీన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ అంశాన్ని అవగాహన వరకే పరిమితం చేసిన బోర్డు.. త్వరలో సబ్జెక్టుగా ప్రవేశపెట్టడంతోపాటు పరీక్షలు సైతం నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీకి ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో పాఠశాల విద్య నుంచే ఈ అంశాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాల సాధన సులభతరమవుతుందని ఎల్బీ నగర్ సమీపంలోని ఓ సీబీఎస్ఈ పాఠశాల ప్రిన్స్‌పాల్ గోపాల కృష్ణ ‘సాక్షి’తో అన్నారు. -
టెన్త్ సోషల్ నుంచి 5 చాప్టర్ల తొలగింపు
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్ సైన్స్) సబ్జెక్ట్ నుంచి ఐదు అధ్యాయాలను తీసేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ప్రజాస్వామ్య సవాళ్లు (చాలెంజెస్ టు డెమోక్రసీ), రాజకీయ పోరాటాలు, ఉద్యమాలు (పొలిటికల్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్), ప్రజాస్వామ్యం, భిన్నత్వం (డెమోక్రసీ అండ్ డైవర్సిటీ), అడవులు, వన్యప్రాణులు (ఫారెస్ట్ అండ్ వైల్డ్‌లైఫ్), నీటి వనరులు (వాటర్ రిసోర్సెస్) అనే ఐదు అధ్యాయాలను సాంఘిక శాస్త్రం నుంచి సీబీఎస్ఈ తొలగించనుంది. 2021లో పీసా (ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్)లో పాల్గొనాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందనీ, అందుకు తగ్గట్లుగా విద్యార్థుల మూల్యాంకన పద్ధతుల మార్చాల్సి ఉందని గత నెలలోనే పాఠశాలలకు సీబీఎస్ఈ తెలిపింది. -
హీరో విజయ్ మరో ఘనత..
సాక్షి, చెన్నై: ఇళయ దళపతిగా అభిమానులు నెత్తిన పెట్టుకుని మోస్తున్న హీరో విజయ్ తాజాగా వారికి ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని కలిగించారు. విజయ్ ఫొటో సీబీఎస్ఈ సిలబస్ పాఠ్యపుస్తకంలో చోటుచేసుకుంది. ఇలా పాఠ్యపుస్తకంలో నటుడి ఫొటో చోటుచేసుకోవడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. అదీ విద్యార్థులకు ఒక పాఠంగా ఆ ఫొటో మారడం విశేషమే అవుతుంది. విషయం ఏమిటంటే.. విజయ్ తాజాగా నటించిన చిత్రం మెర్శల్లో ఆయన ఒక వైద్యుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆయన ఉత్తమ సేవలకుగానూ విదేశంలో అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఆ వేడుకకు విజయ్ తమిళ సంప్రదాయ దుస్తులు చొక్కా, దోవతి కట్టుకుని వెళ్తారు. అయితే ఆయన వేషధారణ చూసిన అక్కడి సెక్యూరిటీ అనుమానంతో సోదా చేస్తారు. ఆ తరువాత ఆయన ప్రముఖ వైద్యుడని తెలిసి క్షమాపణ చెప్పి గౌరవిస్తారు. ఈ సన్నివేశంలో తమిళ సంప్రదాయానికి గౌరవాన్ని ఆపాదించిన విజయ్ ఫొటోనూ మూడవ తరగతి సీబీఎస్ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. తమిళుల ఘనతను, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఆ పాఠ్యపుస్తకంలోని పుటల్లో చొక్కా, పంచెతో కూడిన విజయ్ ఫొటోను పొందుపరిచారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు ఆనందంలో మునిగి పోతున్నారు. -
మెడికల్ అభ్యర్థులకు 'నీట్' వేదన
- ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ లేకపోవడంతో ఆందోళన - సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్‌లో పరీక్షతో అయోమయం - వేల రూపాయలు వెచ్చించి తీసుకున్న కోచింగ్ వృథా - మళ్లీ ‘నీట్’ శిక్షణ కోసం వేల రూపాయల భారం! - స్థానిక భాషలో పరీక్ష నిర్వహణపై అస్పష్టతతో గందరగోళం సాక్షి, హైదరాబాద్: ఇంటర్ చదివి ఎంసెట్‌కు సిద్ధమవుతున్న నీలిమకు బైపీసీ ఆప్షనల్స్‌లో 600కు 596 మార్కులు వచ్చాయి.. ఎంసెట్‌లో కొంచెం మార్కులు తగ్గినా ఇంటర్లో తనకు వచ్చిన గరిష్ట మార్కులతో మంచి ర్యాంకు సాధించవచ్చని ఆశపడింది. కానీ ఆశలపై ‘నీట్’ పిడుగు పడింది. ఇంటర్లో ఎంతో కష్టపడి చదివినా ఆ మార్కులకు ప్రయోజనం లేకుండా పోతుందేమోనని ఆవేదనలో పడిపోయింది. ‘నీట్’ను సీబీఎస్ఈ సిలబస్‌లో, ఇంగ్లిష్ భాషలో నిర్వహించే అవకాశం ఉండడమే దీనికి కారణం. ఇలా నీలిమ ఒక్కరే కాదు వేలాది మంది విద్యార్థులు ఆందోళనలో కూరుకుపోయారు. రెండేళ్లుగా ఇంటర్మీడియెట్ సబ్జెక్టులపై పెంచుకున్న పట్టు, వేల రూపాయలు ఖర్చుపెట్టి తీసుకున్న కోచింగ్ ‘నీట్’తో వృథా అవుతోందని బాధపడుతున్నారు. మళ్లీ ‘నీట్’కు కోచింగ్ తీసుకోవడానికి వేల రూపాయలు ఖర్చవుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లు చదివాక ఇదా ఫలితం ఎంసెట్‌కు తగ్గట్టుగా రెండేళ్ల పాటు ఇంటర్ పాఠ్యాంశాల ఆధారంగా సిద్ధమైన విద్యార్థులకు సరిగ్గా ఎంసెట్‌కు వారం ముందు ‘నీట్’ మాత్రమే రాయాలనడం ఏ మాత్రం మింగుడుపడటం లేదు. నీట్ సిలబస్ సీబీఎస్ఈ పాఠ్యాంశాల ఆధారంగా ఉంటుంది. ఇది రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలిగించనుంది. ఇక నీట్ ర్యాంకుల ద్వారానే ప్రభుత్వ, ప్రైవేటు నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లను భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్నారై సీట్లను కూడా నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. ఎన్నారై కేటగిరీకి సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా మినహాయింపేమీ ఇవ్వలేదని వివరించారు. వెయిటేజీపై అధికారుల అసహనం ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ, ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఇప్పటివరకు ఖరారు చేసేవారు. కానీ ఇక నుంచి ఇంటర్ మార్కులకు ఎటువంటి వెయిటేజీ ఉండదు. అయితే దేశవ్యాప్తంగా నీట్ అనేది అత్యున్నతమైన ప్రవేశపరీక్ష. అందులో రాష్ట్ర విద్యార్థులు పొందిన ర్యాంకులను ప్రకటించాక... వాటికి ఇంటర్ వెయిటేజీ ఇచ్చి ఇక్కడ సీట్లు భర్తీ చేసే విషయాన్ని రాష్ట్ర అధికారులు గమనంలోకి తీసుకోవడం లేదు. అలా చేస్తే నీట్ స్ఫూర్తిని దెబ్బతీసినట్లేనని, అవకతవకలకు దారి తీస్తుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక భాషపై అస్పష్టత! స్థానిక భాషలో నీట్ పరీక్ష ఉండాలన్న విషయంపై ఇంకా అస్పష్టత నెలకొంది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలో పేర్కొన్న అధికార భాషలన్నింటిలో నీట్ పరీక్ష నిర్వహించాల్సి వస్తే... ప్రశ్నపత్నం చేతులు మారి లీక్ కావచ్చొనే ఆందోళన నీట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే స్థానిక భాషలో ప్రశ్నపత్రం అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులను ఇంగ్లిషులోనే చదవాల్సి ఉన్నందున ప్రశ్నపత్రం ఇంగ్లిషులో ఉంటే తప్పేంటన్న వాదనలు కూడా ఉన్నాయి. పైగా స్థానిక భాషలో రాసేవారు 10 శాతానికి మించి ఉండరని వైద్య వర్గాల అంచనా. ఇక స్థానిక భాషలో రాసే విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇంగ్లిషులో ఉంటాయని, వాటిని సరిగా అర్థం చేసుకుని నాలుగు ఆప్షన్లలో ఒకదాన్ని గుర్తించడం కష్టమన్న చర్చ జరుగుతోంది.