AP: ప్రభుత్వ బడిలో సీబీఎస్‌ఈ సిలబస్‌.. ప్రయోజనాలు ఇవే.. | CBSE Syllabus In Government Schools At Vizianagaram District | Sakshi
Sakshi News home page

AP: ప్రభుత్వ బడిలో సీబీఎస్‌ఈ సిలబస్‌.. ప్రయోజనాలు ఇవే..

Published Thu, Dec 9 2021 1:06 PM | Last Updated on Thu, Dec 9 2021 1:06 PM

CBSE Syllabus In Government Schools At Vizianagaram District - Sakshi

విజయనగరం అర్బన్‌: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం విద్యా సంస్కరణలు చేస్తోంది. ఇప్పటికే నాడు–నేడు పనులతో ఊరి బడికి ఆధునిక హంగులు అద్దింది. ఆహ్లాదకరంగా తీర్చిదింది. తాజాగా సీబీఎస్‌ఈ (సెంట్రల్‌బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) సిలబస్‌ అమలుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ బోధించేలా కార్యా చరణ ప్రణాళికను రూపొందిస్తోంది.  

పేద విద్యార్థులకు వరం..  
సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు జిల్లాలో 90 పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నిరు పేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందుబాటులోకి రానుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పది, ఇంటర్‌ పూర్తి చేస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తాచాటే అవకాశం దక్కుతుంది. ఈ విధానం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో అందుబాటులో ఉండగా... ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలుచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సిలబస్‌ వల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రభుత్వ పాఠశాలల నుంచి దరఖాస్తులు వెళ్తున్నా యి. పాఠశాల విస్తీర్ణం రెండెకరాలకు పైబడి ఉన్నవాటికి తొలిప్రాధాన్యం కల్పిస్తున్నారు.

చదవండి:  అమ్మ కంట ఆనందభాష్పాలు.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

తొలుత 10 పాఠశాలల్లో అమలు  
ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమం ఉన్న కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్, సంక్షేమ వసతి పాఠశాల లతో పాటు జిల్లాలోని తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాలున్న మరో 10 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయనున్నారు. వీటిలో వెయ్యి మంది పైబడి విద్యార్థులున్న రామభద్రపురం, మక్కువ, చీపురుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. నూతన విద్యావిధానం అమలులోభాగంగా 3, 4, 5వ తరగతులను విలీనం చేసిన జొన్నవలస, పాంచాలి, బుడతనాపల్లి, మెట్టపల్లి, గంట్యాడ, బలిజిపేట, కుమరాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.  

బోధనలో నూతనత్వం..  
సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆరో తరగతి నుంచే జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థి అభ్యసనా సామ ర్థ్యాలు పెంచేలా సిలబస్‌ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు, కంప్యూటర్, సైన్స్‌ ల్యాబ్‌లు, ఆటస్థలం ఉండటం వీటి ప్రత్యేకత. ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా బోధన సిలబస్‌లో ఇమిడి ఉంటుంది.   

ప్రయోజనాలు ఇవీ....: 
విద్యార్థికి స్నేహపూర్వకంగా ఉంటుంది. కోర్సు నిర్మాణం ఒత్తిడిని ఎదుర్కోకుండా చేస్తుంది. పుస్తకాలు ఆసక్తికరంగా, విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో రూపొందిస్తారు. ఉల్లాసభరితమైన విద్యాబోధన ఉంటుంది.  
► పోటీ పరీక్షల్లో విద్యార్థుల మేధస్సుకు పదును పట్టేలా ఉంటాయి. యాంత్రిక విద్యకు దూరంగా ఉంటాయి. వాస్తవాలకు దగ్గరగా విద్యను బోధిస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతానికి ప్రాధా న్యం కల్పించరు. ఎంత నేర్చుకున్నారో పరీక్షించే విధంగా ప్రశ్న పత్రాలు రూపొందిస్తారు. ఫలితాలు అనుకూలంగా వస్తాయి. తక్కువ మంది పరీక్షల్లో విఫలమవుతారు.  
► ఐఐటీ, ఎయిమ్స్‌ వంటి కేంద్రీకృత సంస్థ నుంచి భవిష్యత్‌ అధ్యయనాలను కొనసాగించాలను కుంటే సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలు చాలా సహాయ పడతాయి. ఈ సంస్థల ప్రాథమిక పరీక్షలు సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య విద్యాలయాల్లో సీబీఎస్‌ఈ బోధన అమలుకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకంటరీ ఎడ్యుకేషన్‌ అనుమతులు ఇచ్చింది.  
► 2024–25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్ని విద్యార్థులు రాసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 

విద్యార్థులకు ఉపయుక్తం  
సీబీఎస్‌ఈ సిలబస్‌ విద్యార్థులకు ఉపయుక్తం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మరింత ప్రతిభ చూపి మంచి ఫలితాలు సాధించవచ్చు. జిల్లాలో ఎంపిక చేసిన 90 స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుంది.  
– డాక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్, జేసీ (అభివృద్ధి) విలీన స్కూల్‌ నుంచి 

ప్రారంభిస్తే మంచిది 
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ మంచిదే. అన్ని తరగతులకు ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రవేశ పెట్టాలి. మరో వైపు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో ఉన్న తెలుగు మాధ్యం విద్యార్థులకు చదువు క్లిష్టతరం అవుతుంది. నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలలను ఇటీవల విలీనం చేసిన జెడ్పీహెచ్‌ స్కూళ్లలో తొలి దశగా అమలు చేయాలి.        
 – టి.సన్యాసిరాజు, హెచ్‌ఎం, బొండపల్లి జెడ్పీహెచ్‌స్కూల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement