సర్కారు బడుల్లో.. సీబీఎస్‌ఈ పాఠాలు | CBSE Lessons in Andhra Pradesh Govt Schools | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో.. సీబీఎస్‌ఈ పాఠాలు

Published Thu, Mar 10 2022 5:51 AM | Last Updated on Thu, Mar 10 2022 9:52 AM

CBSE Lessons in Andhra Pradesh Govt Schools - Sakshi

కడప ఎడ్యుకేషన్‌: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నాడు– నేడు పనులతో ఇప్పటికే ఊరి బడిని ఆధునిక హంగులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. తాజాగా రానున్న విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) సిలబస్‌ బోధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగా వైఎస్సార్‌ జిల్లాలో సౌకర్యాలు ఉన్న 35 పాఠశాలల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే బోధన ప్రారంభించనున్నారు.  

అందుబాటులోకి ఖరీదైన విద్య 
ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందుబాటులోకి రానుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవడం సులభం అవుతుంది. 


35 పాఠశాలల్లో అమలు 
సీపీఎస్‌ఈ విధానం ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈ సిలబస్‌కు మారనున్నాయి. ఇందులో కడప డివిజన్‌లో 17, ప్రొద్దుటూరు డివిజన్‌లో 8, రాయచోటి డివిజన్‌లో 10 హైస్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించనున్నారు. ఇందులో ఆరో తరగతిలో చేరితే ఇంటర్‌ విద్య వరకు ఇక్కడే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. 

అత్యాధునిక పద్ధతిలో బోధన 
సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్‌ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్‌ బోధన కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు జేఈఈ, నీట్‌ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తారు. విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు పెంచేలా సిలబస్‌ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండటం ప్రత్యేకత.

మంచి నిర్ణయం 
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నతస్థాయి విద్య అందే అవకాశం ఉంటుంది. 
– మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, సంబేపల్లి హైస్కూల్‌

పేద విద్యార్థులకు వరం 
సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధన పేద విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రమే ఉన్న సీబీఎస్‌ఈ సిలబస్‌ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మారుమూల పల్లెకు కూడా చేరనుంది. 
– నారాయణ, ఎంఈవో, కడప

ఉన్నతాధికారులకు నివేదిక పంపాం 
సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధనకు అనుగుణంగా ఉన్న 35 స్కూళ్ల వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తాం.
    – శైలజ, డీఈవో, కడప  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement