సాక్షి, చెన్నై: ఇళయ దళపతిగా అభిమానులు నెత్తిన పెట్టుకుని మోస్తున్న హీరో విజయ్ తాజాగా వారికి ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని కలిగించారు. విజయ్ ఫొటో సీబీఎస్‌ఈ సిలబస్ పాఠ్యపుస్తకంలో చోటుచేసుకుంది. ఇలా పాఠ్యపుస్తకంలో నటుడి ఫొటో చోటుచేసుకోవడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. అదీ విద్యార్థులకు ఒక పాఠంగా ఆ ఫొటో మారడం విశేషమే అవుతుంది.
విషయం ఏమిటంటే.. విజయ్ తాజాగా నటించిన చిత్రం మెర్శల్‌లో ఆయన ఒక వైద్యుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆయన ఉత్తమ సేవలకుగానూ విదేశంలో అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఆ వేడుకకు విజయ్ తమిళ సంప్రదాయ దుస్తులు చొక్కా, దోవతి కట్టుకుని వెళ్తారు. అయితే ఆయన వేషధారణ చూసిన అక్కడి సెక్యూరిటీ అనుమానంతో సోదా చేస్తారు.
ఆ తరువాత ఆయన ప్రముఖ వైద్యుడని తెలిసి క్షమాపణ చెప్పి గౌరవిస్తారు. ఈ సన్నివేశంలో తమిళ సంప్రదాయానికి గౌరవాన్ని ఆపాదించిన విజయ్ ఫొటోనూ మూడవ తరగతి సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. తమిళుల ఘనతను, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఆ పాఠ్యపుస్తకంలోని పుటల్లో చొక్కా, పంచెతో కూడిన విజయ్ ఫొటోను పొందుపరిచారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు ఆనందంలో మునిగి పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment