Mershal
-
హీరో విజయ్ మరో ఘనత..
సాక్షి, చెన్నై: ఇళయ దళపతిగా అభిమానులు నెత్తిన పెట్టుకుని మోస్తున్న హీరో విజయ్ తాజాగా వారికి ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని కలిగించారు. విజయ్ ఫొటో సీబీఎస్ఈ సిలబస్ పాఠ్యపుస్తకంలో చోటుచేసుకుంది. ఇలా పాఠ్యపుస్తకంలో నటుడి ఫొటో చోటుచేసుకోవడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. అదీ విద్యార్థులకు ఒక పాఠంగా ఆ ఫొటో మారడం విశేషమే అవుతుంది. విషయం ఏమిటంటే.. విజయ్ తాజాగా నటించిన చిత్రం మెర్శల్లో ఆయన ఒక వైద్యుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆయన ఉత్తమ సేవలకుగానూ విదేశంలో అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఆ వేడుకకు విజయ్ తమిళ సంప్రదాయ దుస్తులు చొక్కా, దోవతి కట్టుకుని వెళ్తారు. అయితే ఆయన వేషధారణ చూసిన అక్కడి సెక్యూరిటీ అనుమానంతో సోదా చేస్తారు. ఆ తరువాత ఆయన ప్రముఖ వైద్యుడని తెలిసి క్షమాపణ చెప్పి గౌరవిస్తారు. ఈ సన్నివేశంలో తమిళ సంప్రదాయానికి గౌరవాన్ని ఆపాదించిన విజయ్ ఫొటోనూ మూడవ తరగతి సీబీఎస్ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. తమిళుల ఘనతను, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఆ పాఠ్యపుస్తకంలోని పుటల్లో చొక్కా, పంచెతో కూడిన విజయ్ ఫొటోను పొందుపరిచారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు ఆనందంలో మునిగి పోతున్నారు. -
మెర్శల్‌కు ట్రేడ్‌మార్క్
తమిళసినిమా: మెర్శల్ చిత్రం పలు విశేషాలతో అభిమానుల్లో జోష్ పెంచేస్తోంది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్న ఇందులో సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తెరి వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్ను అట్లీ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ చిత్రం మెర్శల్. సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మెర్శల్ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా ఇందులో మెజీషియన్ పాత్ర కోసం విజయ్ ప్రత్యేకంగా మ్యాజిక్‌ను నేర్చుకుని మరీ నటించారట. ఈ పాత్ర ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తుందంటున్నారు. మరో విషయం ఏమిటంటే మెర్శల్ చిత్రం కోసం ట్విట్టర్లో ప్రత్యేక ఇమోజీలను ప్రవేశపెట్టారు. తాజాగా మరో విశేషాన్ని మెర్శల్ చిత్రం సంతరించుకుంది. మెర్శల్ పేరుకు ట్రేడ్‌మార్క్‌ను చిత్ర నిర్మాతలు పొందారు. ఇలా ట్రేడ్‌మార్క్‌ను చిత్ర టైటిల్‌కు పొందడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రప్రథమం అవుతుంది. ట్రేడ్‌మార్క్ కారణంగా మెర్శల్ పేరును ఏ ఇతర వాణిజ్య ప్రకటనకు వాడినా వారు ఈ చిత్ర నిర్మాతకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా లక్షలాది రూపాయల లబ్ధి పొందడానికే శ్రీ తేనాండాళ్ ఫిలింస్ అధినేతలు మెర్శల్ చిత్రానికి ట్రేడ్‌మార్క్‌ను పొందినట్లు సమాచారం. -
విజయ్ అభిమానులకు గుడ్‌న్యూస్
తమిళసినిమా: ఇళయదళపతి విజయ్ కొత్త చిత్రం రావడమే ఆయన అభిమానులకు సంతోషకరమైన వార్త అవుతుంది. అదీ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషనల్లో చిత్రం వస్తుందంటే మరీ ఆనందం. అలా త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న చిత్రం మెర్శల్. విజయ్ నటిస్తున్న 61వ చిత్రం ఇది. ఈ చిత్రం పలు ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పవచ్చు. ఇందులో విజయ్‌కు జంటగా కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్ ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక వైగైపుయల్ వడివేలు, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతుండడం మరో విశేషం. ఇక తెరి వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత విజయ్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం మెర్శల్. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మిస్తున్న శత చిత్రం ఇది కావడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో కూడుకున్న ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అన్న ఆసక్తి ఆయన అభిమానుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ నెలకొనడం సహజమే. అంతకన్నా ముందు చిత్ర ఆడియోను ఈ నెల 20వ తేదీన చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం. కాగా ఈ వేడుకలో మరో విశేషం ఏమిటంటే సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత కచేరిని నిర్వహించనున్నారట. ఇది విజయ్ అభిమానులకు వీనులవిందైన వార్తే అవుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.