సాక్షి, అమరావతి: ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలో విప్లవాత్మక విద్యాసంస్కరణలు అమలు చేస్తోందని పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్ చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 259 పాఠశాలలు సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉంటే ఇప్పుడు 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విద్యావిధానం అమలు చేయడం సీబీఎస్‌ఈ చరిత్రలోనే మైలురాయిగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ నిర్మాణాత్మక బోధన అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌కు నాలుగు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్కరణల్లో భాగంగా సీబీఎస్‌ఈ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యతో పాటు సరైన మూల్యాంకనం, విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సమైక్యంగా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షలు సీబీఎస్‌ఈ విధానంలో రాయనున్నారని చెప్పారు.
ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు, విద్యావిధానాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ (క్రిస్‌్ప) కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, మోడల్ స్కూల్ కార్యదర్శి ఎం.వి.కృష్ణారెడ్డి, వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల ప్రిన్సిపల్స్, ఏపీ, తెలంగాణ ఎస్‌సీఈఆరీ్ట, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్, రూమ్ టూ రీడ్, అజీమ్‌ప్రేమ్‌జీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment