![Malayalam film industry to go on strike from June 1 onwards over double taxation on movie tickets](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Suresh_Kumar.jpg.webp?itok=63Q8rfhj)
నటీనటుల పారితోషికం తగ్గాలి
పన్ను రద్దు చేయాలి
‘‘మలయాళ చిత్రపరిశ్రమ(Malayalam film industry) తీవ్ర సంక్షోభంలో ఉంది... ఇలానే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది’’ అంటూ మాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలు శాఖలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు కొన్ని మార్పులు చేయకపోతే... జూన్ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకొచ్చాయి.
కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం... ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మలయాళ అగ్రనిర్మాత, కథానాయిక కీర్తీ సురేష్ తండ్రి సురేష్‌కుమార్(Suresh Kumar) ప్రకటించారు.
60 శాతం పారితోషికాలకే...
‘‘సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఇలా 30 శాతం పన్ను విధింపబడుతున్న ఇండస్ట్రీ ఏదీ లేదు. ఈ 30 శాతంలో జీఎస్‌టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను రద్దు చేయాలి. అలాగే ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు బాగా పెరిగిపోయాయి.
వాటిని తగ్గించాలి. సినిమాకి అవుతున్న బడ్జెట్‌లో 60 శాతం యాక్టర్ల పారితోషికాలకే కేటాయిస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా వస్తున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల సినిమా నిర్మాణం అనేది లాభదాయకంగా లేదు’’ అని సురేష్‌కుమార్ పేర్కొన్నారు.
50 రోజుల్లో పూర్తి చేయకుండా...
ఇంకా సినిమా నిర్మాణానికి అవుతున్న సమయం గురించి పేర్కొంటూ... ‘‘50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలకు కూడా 150 రోజులు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపో తోంది. ఇలా తక్కువ రోజుల్లో పూర్తి చేయలేకపోవడంతో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేస్తోంది’’ అన్నారు.
176 చిత్రాలు... అపజయంపాలు...
బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ సినిమా పరిశ్రమని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయని చెబుతూ – ‘‘2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ నష్టం సినిమా కోసం తెరవెనుక పని చేస్తున్న నిపుణుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది’’ అని పేర్కొన్నారు సురేష్‌కుమార్.
ఇక తాజాగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం... వంటి విషయాల్లో సరైన పరిష్కారం లభించకపోతే జూన్ 1 నుంచి షూటింగ్స్, సినిమాకి సంబంధించిన ఇతర కార్యకలాపాలు నిలిపివేయడం ఖాయం అని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరి... మలయాళ చిత్రాల షూటింగ్స్ ఆగుతాయా? చర్చలు సజావుగా జరిగి, పరిష్కార మార్గం వెతుక్కుని షూటింగ్స్ చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment