Malayalam films
-
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళం నటుడు కొల్లం అజిత్ కన్నుమూశారు. ఆయన 500లకుపైగా సినిమాల్లో నటించారు. కడుపు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లం అజిత్ గత కొన్నిరోజులుగా కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1983లో పరన్ను పరన్ను పరన్ను సినిమాతో ఆరంగేట్రం చేసిన కొల్లం అజిత్.. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. కొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించారు. 1989లో విడుదలైన అగ్నిప్రవేశం సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. యువజనోత్సవం, నడోడికట్టు, నంబర్ 20 మద్రాస్ మెయిల్, నిర్ణయం, ఆరం థంపురన్, ఒలింపియన్ ఆంతోనీ యాడం, వల్లీత్తన్ తదితర సినిమాల్లో మంచి నటన కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు. కాలింగ్ బెల్, పకల్ పోలె వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా ఆయన 2012లో ఇవాన్ అర్ధనారి సినిమాలో కనిపించారు. ఆయనకు భార్య ప్రమీల, కూతురు గాయత్రి, కొడుకు శ్రీహరి ఉన్నారు. -
మరో స్టార్ వారసుడొస్తున్నాడు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన కొడుకు ప్రణవ్ను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమకే చెందిన మరో స్టార్ హీరో మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్‌ను వెండితెరపై పరిచయం చేసిన తరహాలో మోహన్ లాల్ కూడా తన కొడుకును గ్రాండ్‌గా తీసుకురావాలనుకుంటున్నట్టు సన్నిహితులు చెప్పారు. ప్రణవ్ కోసం మోహన్ లాల్ స్క్రిప్టులు వింటున్నట్టు సమాచారం. కాగా ప్రణవ్ ఇదివరకే బాలనటుడిగా నటించాడు. 2002 కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇక ప్రణవ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. లైఫ్ ఆఫ్ జోసుట్టి సినిమాకు దర్శకుడు జీతు జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. సల్మాన్ 26 ఏళ్ల వయసులో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు ప్రణవ్ వయసు కూడా 26 ఏళ్లే. ప్రణవ్‌పై అంచనాలు భారీగా ఉంటాయని, దీనికి తగినట్టుగా ప్రాజెక్టు ప్లాన్ చేయాలని మోహన్ లాల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
'మలయాళీ' డామినేషన్ తగ్గిపోయిందా?
తిరువనంతపురం: ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. కథాబలమున్న చిత్రాలు తీసే మలయాళీ చిత్ర పరిశ్రమ ప్రభ ఈ మధ్య కాలంలో తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు జాతీయ అవార్డులంటే మలయాళ సినిమానే గుర్తుకొచ్చేది. ప్రధాన పురస్కారాల్లో ఎక్కువభాగం మలయాళ చిత్రాలకే దక్కేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది కేవలం నాలుగు పురస్కారాలు మాత్రమే దక్కాయి. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మలయాళ చిత్రాలు అంతంతమాత్రం గుర్తింపును మాత్రమే తెచ్చుకున్నాయి. ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ బాల నటుడు, ఫీచర్ సినిమాల కేటగిరీల్లో ప్రత్యేక ప్రస్తావనలు తప్ప ఈ ఏడాది చెప్పుకోదగ్గ అవార్డులు లభించలేదు. 'ఎన్ను నింతే మొదీన్' చిత్రంలో 'కథుయిరున్నే కథుయిరున్నే' పాటకు సంగీతమందించినందుకు ఎం జయచంద్రన్ కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది. 'బెన్' చిత్రంలో అద్భుతమైన భావోద్వేగాలు పండించిన పదేళ్ల బాలుడి పాత్ర పోషించినందుకు గౌరవ్ మీనన్ కు ఉత్తమ బాలనటుడి అవార్డు దక్కింది. 'లక్క చుప్పి', 'సు.. సు.. సుధి వథ్మీకం' సినిమాల్లో నటనకుగాను నటుడు జయసూర్య స్పెషల్ మెన్షన్‌కు నామినేట్ అయ్యారు. పర్యావరణం మీద తీసిన ఉత్తమ చిత్రంగా 'వలియా చిరాకుల్ల పక్షికల్' (పెద్ద రెక్కల పక్షి) నిలిచింది. నాన్ ఫీచర్ సెక్షన్ 'అమ్మ' సినిమా దర్శకుడు నీలన్ కూడా స్పెషల్ మెన్షన్‌కు నామినేట్ అయ్యారు. ఇక ఉత్తమ షార్ట్ ఫిలింగా మలయాళ చిత్రం 'కముకి' నిలిచింది. గత ఏడాది కూడా జాతీయ పురస్కారాల్లో మలయాళ చిత్రసీమకు పెద్దగా పురస్కారాలు లభించలేదు. కేవలం నాలుగు పురస్కారాలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు కూడా పెద్దగా ప్రధాన పురస్కారాలు రాకపోవడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రయోగాలు, కథాబలమున్న చిత్రాల సంఖ్య తగ్గిపోవడమే జాతీయ చలనచిత్రాల్లో మలయాళ ప్రభ తగ్గిపోవడానికి కారణమని పలువురు భావిస్తున్నారు.