'మలయాళీ' డామినేషన్ తగ్గిపోయిందా?
తిరువనంతపురం: ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. కథాబలమున్న చిత్రాలు తీసే మలయాళీ చిత్ర పరిశ్రమ ప్రభ ఈ మధ్య కాలంలో తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు జాతీయ అవార్డులంటే మలయాళ సినిమానే గుర్తుకొచ్చేది. ప్రధాన పురస్కారాల్లో ఎక్కువభాగం మలయాళ చిత్రాలకే దక్కేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది కేవలం నాలుగు పురస్కారాలు మాత్రమే దక్కాయి. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మలయాళ చిత్రాలు అంతంతమాత్రం గుర్తింపును మాత్రమే తెచ్చుకున్నాయి.
ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ బాల నటుడు, ఫీచర్ సినిమాల కేటగిరీల్లో ప్రత్యేక ప్రస్తావనలు తప్ప ఈ ఏడాది చెప్పుకోదగ్గ అవార్డులు లభించలేదు. 'ఎన్ను నింతే మొదీన్' చిత్రంలో 'కథుయిరున్నే కథుయిరున్నే' పాటకు సంగీతమందించినందుకు ఎం జయచంద్రన్ కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది. 'బెన్' చిత్రంలో అద్భుతమైన భావోద్వేగాలు పండించిన పదేళ్ల బాలుడి పాత్ర పోషించినందుకు గౌరవ్ మీనన్ కు ఉత్తమ బాలనటుడి అవార్డు దక్కింది. 'లక్క చుప్పి', 'సు.. సు.. సుధి వథ్మీకం' సినిమాల్లో నటనకుగాను నటుడు జయసూర్య స్పెషల్ మెన్షన్‌కు నామినేట్ అయ్యారు. పర్యావరణం మీద తీసిన ఉత్తమ చిత్రంగా 'వలియా చిరాకుల్ల పక్షికల్' (పెద్ద రెక్కల పక్షి) నిలిచింది. నాన్ ఫీచర్ సెక్షన్ 'అమ్మ' సినిమా దర్శకుడు నీలన్ కూడా స్పెషల్ మెన్షన్‌కు నామినేట్ అయ్యారు. ఇక ఉత్తమ షార్ట్ ఫిలింగా మలయాళ చిత్రం 'కముకి' నిలిచింది.
గత ఏడాది కూడా జాతీయ పురస్కారాల్లో మలయాళ చిత్రసీమకు పెద్దగా పురస్కారాలు లభించలేదు. కేవలం నాలుగు పురస్కారాలతోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు కూడా పెద్దగా ప్రధాన పురస్కారాలు రాకపోవడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రయోగాలు, కథాబలమున్న చిత్రాల సంఖ్య తగ్గిపోవడమే జాతీయ చలనచిత్రాల్లో మలయాళ ప్రభ తగ్గిపోవడానికి కారణమని పలువురు భావిస్తున్నారు.