National film awards 2023 :అల్లు అర్జున్‌... ఉత్తమ నటుడు | National film awards 2023: 69 National Film Awards have been announced In Winners Updates | Sakshi
Sakshi News home page

National film awards 2023: అల్లు అర్జున్‌... ఉత్తమ నటుడు

Published Fri, Aug 25 2023 5:06 AM | Last Updated on Fri, Aug 25 2023 11:50 AM

National film awards 2023: 69 National Film Awards have been announced In Winners Updates - Sakshi

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. మొత్తం పది అవార్డులతో ‘ఎత్తర జెండా’ అంటూ తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప... ఫైర్‌’ అంటూ అల్లు అర్జున్‌ రికార్డ్‌ సాధించారు. ఆస్కార్‌ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆరు అవార్డులతో సిక్సర్‌ కొట్టింది. వీటిలో ‘హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌’ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సొంతం అయింది.

2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 లోపు సెన్సార్‌ అయి, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ సభ్యులు అవార్డులను ప్రకటించడం జరిగింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ‘గంగూబాయి కతియావాడి’లో వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్, ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించిన కృతీ సనన్‌  నిలిచారు.

ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ఆర్‌. మాధవన్‌ టైటిల్‌ రోల్‌ చేసి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా మరాఠీ ఫిల్మ్‌ ‘గోదావరి’కి గాను నిఖిల్‌ మహాజన్‌ అవార్డు సాధించారు. ఇంకా పలు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ అవార్డులను ప్రకటించింది.  ఆ విశేషాలు ఈ విధంగా...


69వ జాతీయ అవార్డులకు గాను 28 భాషలకు చెందిన 280 చలన చిత్రాలు  పోటీపడ్డాయి. మొత్తం 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. సుకుమార్‌ దర్శకత్వంలోని ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా తొలి అవార్డు లభించింది. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డు సాధించారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమాకు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి.

జాతీయ హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గాను ఎంఎం కీరవాణి, ఇదే చిత్రానికి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస్‌ మోహనన్, ‘నాటు నాటు..’ పాట కొరియోగ్రఫీకి ప్రేమ్‌ రక్షిత్, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘కొమురం భీముడో..’ పాటకు మేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌గా కాలభైరవ, ఇదే చిత్రానికి  స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా కింగ్‌ సాల్మన్‌లకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ‘నాటు.. నాటు’కి రచయితగా తొలి ఆస్కార్‌ అవార్డు అందుకున్న చంద్రబోస్‌ ‘కొండపొలం’లోని ‘ధంధం ధం.. తిరిగేద్దాం...’ పాటకు జాతీయ అవార్డు అందుకోనున్నారు.

దర్శకుడిగా తన తొలి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో ఉన్నారు ‘ఉప్పెన’ను తెరకెక్కించిన బుచ్చిబాబు సన. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్‌ ఎర్నేని నిర్మించిన ‘ఉప్పెన’ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం. పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. రెండేళ్లుగా ‘మిసిమి’ మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తూ, పలు వ్యాసాలు రాశారు పురుషోత్తమాచార్యులు.

ఇక ఆలియా భట్‌కి ‘గంగూబాయి కతియావాడి’ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కేలా చేయడంతో పాటు మరో నాలుగు విభాగాల్లో (బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్, మేకప్, ఎడిటింగ్‌) అవార్డులు వచ్చేలా చేసింది. అలాగే విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన బయోగ్రఫికల్‌ డ్రామా ‘సర్దార్‌ ఉద్దమ్‌’కు  ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మొత్తం నాలుగు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ప్రొడక్షన్‌ డిజైన్, కాస్ట్యూమ్‌ డిజైన్‌) అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి సూజిత్‌ సర్కార్‌ దర్శకుడు. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కడైసీ వివసాయి’, మలయాళంలో ‘హోమ్‌’, కన్నడంలో ‘777 చార్లీ’ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంకా పలు భాషల్లో పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి.

ఇదొక చరిత్ర
–  నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌
అల్లు అర్జున్‌గారికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదొక చరిత్ర ‘పుష్ప’ షూటింగ్‌ సమయంలోనే అల్లు అర్జున్‌ తప్పకుండా నేషనల్‌ అవార్డ్‌ కొడతారని సుకుమార్‌గారు అనేవారు.. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్‌ గార్లకు థ్యాంక్స్‌. దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డ్‌ రావడం హ్యాపీ. అలాగే మా ‘ఉప్పెన’కి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు, టీమ్‌కి అభినందనలు. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉంది.
– నవీన్‌ యెర్నేని, నిర్మాత

మా మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ‘ఉప్పెన, పుష్ప’ చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌గారు చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. ‘ఉప్పెన, పుష్ప’ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్‌గారిదే. ‘ఆర్‌ఆర్‌ఆర్, కొండపొలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది.  
– వై. రవిశంకర్, నిర్మాత

‘‘నా తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్‌గారికి, రవిగారికి, మా గురువుగారు సుకుమార్‌ గారికి కృతజ్ఞతలు. సినిమా చూడ్డానికి మా ఇంట్లో నన్ను పంపించేవాళ్లు కాదు. అలాంటిది నేను ఒక సినిమాకి డైరెక్ట్‌ చేయడం, నా ఫస్ట్‌ సినిమాకే నేషనల్‌ అవార్డు రావడం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మా అమ్మగారికి నేషనల్‌ అవార్డు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ అవార్డు గురించి ఆమెకి చెప్పాలంటే. ‘ఇండియాలోనే పెద్ద అవార్డు వచ్చింది’ అని చెప్పాలి’’ అంటున్న బుచ్చిబాబు సనని తదుపరి చిత్రం గురించి అడగ్గా.. ‘‘రామ్‌చరణ్‌గారి కోసం మంచి రా అండ్‌ రస్టిక్‌ స్టోరీ రాశాను. నా మనసుకి బాగా నచ్చి, రాసుకున్న కథ ఇది. జనవరిలో షూటింగ్‌ ఆరంభిస్తాం’’ అన్నారు.
– బుచ్చిబాబు సన, దర్శకుడు

పది అవార్డులతో తొలి రికార్డ్‌
ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్‌ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది.

69వ చలనచిత్ర జాతీయ అవార్డు విజేతలు
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప)
ఉత్తమ నటి: ఆలియా భట్‌ (గంగూబాయి..) – కృతీసనన్‌ (మిమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్‌ (హిందీ)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి– మరాఠీ సినిమా)
ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్‌ కో (గుజరాతీ)
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (నేపథ్య సంగీతం): ఆర్‌ఆర్‌ఆర్‌æ– ఎమ్‌ఎమ్‌ కీరవాణి
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప– దేవిశ్రీ ప్రసాద్‌
ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్‌ఆర్‌ఆర్‌ –ప్రేమ్‌ రక్షిత్‌
ఉత్తమ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌ – కొమురం భీముడో..)
ఉత్తమ లిరిక్స్‌: చంద్రబోస్‌– కొండపొలం
ఉత్తమ యాక్షన్‌  డైరెక్షన్‌  అవార్డ్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ): ఆర్‌ఆర్‌ఆర్‌– కింగ్‌ సాల్మన్‌
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ఆర్‌ఆర్‌ఆర్‌– శ్రీనివాస్‌ మోహనన్‌
ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (ద కశ్మీరీ ఫైల్స్‌– హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠీ (మిమీ– హిందీ)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: ప్రీతిశీల్‌ సింగ్‌ డిసౌజా (గంగూబాయి కతియావాడి–హిందీ)
ఉత్తమ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: శ్రేయా ఘోషల్‌ (ఇరవిన్‌ నిళల్‌– తమిళ్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: వీరా కపూర్‌ ఏ (సర్దార్‌ ఉద్ధమ్‌–హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్‌  డిజైన్‌ : ది మిత్రీ మాలిక్‌ – మాన్సి ధ్రువ్‌ మెహతా (సర్దార్‌ ఉద్ధమ్‌) (హిందీ)
ఉత్తమ ఎడిటింగ్‌: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి–హిందీ)
ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్‌  సౌండ్‌ రికార్డిస్ట్‌): అరుణ్‌ అశోక్‌ – సోనూ కేపీ (చవిట్టు మూవీ–మలయాళం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే(అడాప్టెడ్‌): సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే (ఒరిజినల్‌): షాహీ కబీర్‌ (నాయట్టు సినిమా–మలయాళం)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే (డైలాగ్‌ రైటర్‌): ప్రకాశ్‌ కపాడియా – ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్‌ ముఖోపాధ్యాయ్‌ (సర్దార్‌ ఉద్ధమ్‌ మూవీ–హిందీ)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: భవిన్‌ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ)
ఉత్తమ ఫిలిం ఆన్‌  ఎన్విరాన్‌మెంట్‌ కన్‌జర్వేషన్‌ : అవషావ్యూహం (మలయాళం)
ఉత్తమ ఫిలిం ఆన్‌  సోషల్‌ ఇష్యూస్‌: అనునాద్‌–ద రెజోనెన్‌ ్స (అస్సామీ) ఉత్తమ పాపులర్‌ ఫిలిం ఆన్‌  ప్రొవైడింగ్‌
హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌:  ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌): అనీష్‌ బసు (జీలీ మూవీ– బెంగాలీ)
ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డిస్ట్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): సినోయ్‌ జోసెఫ్‌ (సర్దార్‌ ఉద్ధమ్‌–హిందీ)
ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌: మెప్పాడియన్‌ (మలయాళం)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: షేర్‌ షా (హిందీ) (డైరెక్టర్‌ విష్ణువర్థన్‌)

నర్గీస్‌ దత్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌: ద కశ్మీరీ ఫైల్స్‌ (హిందీ)
 
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ తెలుగు చిత్రం    :    ఉప్పెన
ఉత్తమ తమిళ్‌ చిత్రం    :    కడైసి వివసాయి (ద లాస్ట్‌ ఫార్మర్‌)
ఉత్తమ కన్నడ చిత్రం    :    777 చార్లి
ఉత్తమ మలయాళ చిత్రం    :    హోమ్‌
ఉత్తమ హిందీ చిత్రం    :    సర్దార్‌ ఉద్దామ్‌
ఉత్తమ గుజరాతీ చిత్రం    :    లాస్ట్‌ ఫిల్మ్‌ షో (ఛెల్లో షో)
ఉత్తమ మరాఠీ చిత్రం    :    ఏక్డా కే జాలా

ఉత్తమ మీషింగ్‌ చిత్రం    :    బూంబా రైడ్‌
ఉత్తమ అస్సామీస్‌ చిత్రం    :    అనూర్‌ (ఐస్‌ ఆన్‌ ది సన్‌ షైన్‌)
ఉత్తమ బెంగాలీ చిత్రం    :    కల్కొకో–హౌస్‌ ఆఫ్‌ టైమ్‌

ఉత్తమ మైథిలీ చిత్రం    :    సమాంతర్‌
ఉత్తమ ఒడియా చిత్రం    :    ప్రతీక్ష్య (ద వెయిట్‌)
ఉత్తమ మెయిటిలాన్‌ చిత్రం    :    ఈఖోయిగీ యమ్‌ (అవర్‌ హోమ్‌)

‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం సంతోషం. తొలిసారి ఈ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కి అభినందనలు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయి. అదే విధంగా పాన్‌ ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఈ అవార్డులు దక్కటం ప్రశంసనీయం. డైరెక్టర్‌ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్‌ (పుష్ప), ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్‌ (కొండపొలం) జాతీయ అవార్డుకు ఎంపికవడం అభినందనీయం.
– వైఎస్‌ జగన్‌  మోహన్‌  రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.

తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ (అల్లు అర్జున్‌)కి శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది. రాజమౌళి విజన్‌లో ఆరు అవార్డులు సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు, రెండు అవార్డులు సాధించిన ‘పుష్ప’కు, ‘ఉప్పెన’ టీమ్‌కు, సినీ విమర్శకులు పురుషోత్తమచార్యులకు శుభాకాంక్షలు.   
– చిరంజీవి

 ఇట్స్‌ సిక్సర్‌.. జాతీయ అవార్డులు సాధించినందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూనిట్‌ అందరికీ శుభాకాంక్షలు. ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. ‘పుష్ప’.. తగ్గేదేలే... బన్నీకి, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు ‘పుష్ప’ టీమ్‌కి శుభాకాంక్షలు. బోస్‌ (చంద్రబోస్‌)గారికి మళ్లీ శుభాకాంక్షలు. ‘గంగూబాయి కతియావాడి’తో అవార్డు గెల్చుకున్న మా ‘సీత’ (‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా భట్‌ సీత పాత్రలో నటించారు)కు కంగ్రాట్స్‌. ‘ఉప్పెన’ టీమ్‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్నవారికీ శుభాకాంక్షలు.   
– రాజమౌళి

నా నేపథ్య సంగీతాన్ని గుర్తించి, నాకు జ్యూరీ సభ్యులు అవార్డును ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను . చంద్రబోస్‌గారికి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ.. మా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు శుభాకాంక్షలు.       
– కీరవాణి

ఈ జాతీయ అవార్డు మీదే (సంజయ్‌ సార్, గంగూబాయి.. టీమ్‌.. ముఖ్యంగా ప్రేక్షకులు). ఎందుకంటే... మీరు లేకుంటే నాకు ఈ అవార్డు దక్కేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని  ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఇంకా కష్టపడతాను. ‘మిమి’ సినిమాలో నీ ( కృతీ సనన్‌ని ఉద్దేశించి) నటన నిజాయితీగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. ఉత్తమ నటి అవార్డుకు నువ్వు అర్హురాలివి.           
– ఆలియా భట్‌.
ఏఏఏ
69 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి రాని ఆ అద్భుతాన్ని తీసుకొచ్చిన ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్యంగా మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకుని వెళ్లిన మా అబ్బాయికి (అల్లు అర్జున్‌ ) కృతజ్ఞతలు.      
– అల్లు అరవింద్‌

ఇంకా వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ తదితరులు తమ ఆనందం వ్యక్తం చేశారు.


పది అవార్డులతో తొలి రికార్డ్‌
ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్‌ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది.


‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’
భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్‌ నారాయణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్‌’ సినిమా రూపొందింది. ఇస్రోలో చేరిన నారాయణన్‌ స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్‌ చేసిన క్రయోజెనిక్‌ ఇంజ¯Œ ్సని భారత్‌కి తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తా¯Œ కు భారత రాకెట్‌ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్‌ అవుతారు నారాయణన్‌.

అరెస్ట్‌ తర్వాత కేరళ పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? ఆ తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల నుంచి నారాయణన్‌ ఎలా విముక్తి పొందారు? అనే నేపథ్యంలో ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్‌’ సినిమా రూపొందింది. నంబియార్‌ నారాయణన్‌ పాత్ర చేయడంతో పాటు మాధవన్‌ దర్శకత్వం వహించారు. నారాయణన్‌ సతీమణి మీన క్యారెక్టర్‌లో హీరోయిన్‌ సిమ్రాన్‌ చక్కగా నటించారు. ప్రత్యేకించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్‌. హీరో సూర్య అతిథి పాత్రలో మెరవడం కూడా ఈ సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది.

నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను – ఎంఎం శ్రీలేఖ
‘‘ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం’’ అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు.

అవార్డులు ప్రకటించిన అనంతరం ఎంఎం శ్రీలేఖ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘మామూలుగా ఫైనల్‌ ప్యానల్‌లో భోజ్‌పురి వాళ్లు ఉంటారు. వారికి మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుంది? అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి. ఇక జ్యూరీ సభ్యులకు ఒత్తిడి ఉంటుందనుకుంటారు.. అలాంటిదేమీ లేదు. నిజాయతీగా నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను’’ అన్నారు.

ఉప్పెన
 మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో వైష్ణవ్‌ తేజ  ఒకరు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సన డైరెక్టర్‌గా, కృతీశెట్టి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్‌ డేస్‌ నుంచే బేబమ్మ (కృతీశెట్టి) మీద ఇష్టం పెంచుకున్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణవ్‌ తేజ్‌) నిత్యం తననే ఆరాధిస్తూ ప్రేమిస్తుంటాడు.

ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్‌ సేతుపతి). ఆయన కూతురు బేబమ్మ కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తన మనసులోని ప్రేమను బేబమ్మకి చెబుతాడు ఆశీర్వాదం. తన స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న బేబమ్మ కూడా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం శేషారాయనంకి తెలుస్తుంది. దీంతో ఆశీర్వాదం–బేబమ్మ కలిసి ఊరి నుంచి వెళ్లిపోతారు.

ఈ విషయం బయటకి తెలిస్తే తన పరువు పోతుందని ఆర్నెళ్ల పాటు తన కూతుర ు ఇంట్లోనే ఉందని ఊరి జనాలను నమ్మిస్తాడు రాయనం. ఆరు నెలల తర్వాత అయినా బేబమ్మ ఇంటికి తిరిగొచ్చిందా? తన కులం కానివాడు తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఆశీర్వాదంని శేషారాయనం ఏం చేశాడు? ఆశీర్వాదం–బేబమ్మ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది ‘ఉప్పెన’ కథ. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement