69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ సత్తా చాటింది. ఈ అవార్డుల విషయంలో సౌత్ ఇండియాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంటుందనే విమర్శ గతంలో ఎక్కువగా వినిపించేది. అందులో టాలీవుడ్‌కు మరింత అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే పలువురు జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులపైనే కామెంట్లు చేశారు. 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోకి ఉత్తమ నటుడి అవార్డు దక్కలేదు.
(ఇదీ చదవండి: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?)
తాజాగ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్,నాగేశ్వరావు,కృష్ణ,చిరంజీవి ఇలా ఎందరో సినీ చరిత్రలో గొప్ప నటులున్నా ఇప్పటివరకూ ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదు. దీంతో ఒక్కోసారి జ్యూరీ సభ్యులపై కూడా విమర్శలు వచ్చేవి. ఈ విభాగంలో తొలి అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కువగా నార్త్ నుంచే ఆధిపత్యం ఉందని చెప్పవచ్చు.
నార్త్ హీరోలకే ఎక్కువ అవార్డులు
ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో బాలీవుడ్ నటులు 27, మలయాళం 13, తమిళ్ 9, బెంగాలీ నుంచి ఐదుగురు ఉన్నారు. కన్నడ, మరాఠీ నటులకు మూడేసి చొప్పున అవార్డులను దక్కించుకున్నారు. అత్యధికంగా అమితాబ్ బచ్చన్ నాలుగుసార్లు, కమల్‌హాసన్,అజయ్‌దేవగణ్, మమ్ముట్టి మూడుసార్లు అవార్డు దక్కించుకున్నారు. మోహన్‌లాల్, ధనుష్,మిథున్‌చక్రవర్తి, సంజీవ్‌కుమార్, నసీరుద్దీన్‌షా, ఓంపురి కూడా రెండేసిసార్లు అవార్డు గెలుచుకున్నారు. విక్రమ్,సూర్య, ప్రకాశ్‌రాజ్,సురేష్‌గోపి,ఎంజీ రామచంద్రన్ వంటివారు కూడా ఈ పురస్కారాన్ని ఒకసారి అందుకున్నారు.
శంకరాభరణం చిత్రానికి 4 అవార్డులు
టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సినిమా అయిన శంకరాభరణం చిత్రానికి అప్పట్లో అత్యధికంగా 4 జాతీయ అవార్డులు దక్కగా మేఘ సందేశం సినిమాకు కూడా 4 పురస్కారాలు దక్కాయి. ఆప్పటి నుంచి టాలీవుడ్‌కు అంతగా జాతీయ అవార్డులు వరించలేదనే చెప్పవచ్చు. తాజాగ RRR మూవీకి 6 అవార్డులతో పాటు మొత్తంగా టాలీవుడ్‌కు 11 అవార్డులు దక్కాయి. జాతీయ చలన చిత్ర పురస్కారాల కమిటీ సభ్యుల ముందు తెలుగు చిత్రాల గళాన్ని గట్టిగా వినిపించే వారు ఉంటే తప్పక టాలీవుడ్‌కు న్యాయం జరుగుతుందని ఎంఎం శ్రీలేఖ నిరూపించారనే చెప్పవచ్చు.
జ్యూరీ సభ్యురాలిగా ఎంఎం శ్రీలేఖ
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఉన్నారు. ఈసారి టాలీవుడ్ సినిమాల ప్రత్యేకత గురించి కమిటీ సభ్యుల ముందు ఆమె గట్టిగానే గళం వినిపించారు. అవార్డుల అనౌన్స్‌మెంట్ తర్వాత ఎంఎం శ్రీలేఖ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు.
'ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం' అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు.
మామూలుగా ఫైనల్ ప్యానల్‌లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని శ్రీలేఖ తెలిపారు. వాళ్లకు తెలుగు రాదు అలాంటప్పుడు మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుందని ఆమె గుర్తుచేశారు. అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలని పేర్కొన్నారు. 'ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి.' అని ఎంఎం శ్రీలేఖ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment