MM srilekha
-
జాతీయ అవార్డుల విషయంలో టాలీవుడ్ గళాన్ని వినిపించిన శ్రీలేఖ
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ సత్తా చాటింది. ఈ అవార్డుల విషయంలో సౌత్ ఇండియాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంటుందనే విమర్శ గతంలో ఎక్కువగా వినిపించేది. అందులో టాలీవుడ్‌కు మరింత అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే పలువురు జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులపైనే కామెంట్లు చేశారు. 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోకి ఉత్తమ నటుడి అవార్డు దక్కలేదు. (ఇదీ చదవండి: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?) తాజాగ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. టాలీవుడ్లో ఎన్టీఆర్,నాగేశ్వరావు,కృష్ణ,చిరంజీవి ఇలా ఎందరో సినీ చరిత్రలో గొప్ప నటులున్నా ఇప్పటివరకూ ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదు. దీంతో ఒక్కోసారి జ్యూరీ సభ్యులపై కూడా విమర్శలు వచ్చేవి. ఈ విభాగంలో తొలి అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కువగా నార్త్ నుంచే ఆధిపత్యం ఉందని చెప్పవచ్చు. నార్త్ హీరోలకే ఎక్కువ అవార్డులు ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో బాలీవుడ్ నటులు 27, మలయాళం 13, తమిళ్ 9, బెంగాలీ నుంచి ఐదుగురు ఉన్నారు. కన్నడ, మరాఠీ నటులకు మూడేసి చొప్పున అవార్డులను దక్కించుకున్నారు. అత్యధికంగా అమితాబ్ బచ్చన్ నాలుగుసార్లు, కమల్‌హాసన్,అజయ్‌దేవగణ్, మమ్ముట్టి మూడుసార్లు అవార్డు దక్కించుకున్నారు. మోహన్‌లాల్, ధనుష్,మిథున్చక్రవర్తి, సంజీవ్‌కుమార్, నసీరుద్దీన్‌షా, ఓంపురి కూడా రెండేసిసార్లు అవార్డు గెలుచుకున్నారు. విక్రమ్,సూర్య, ప్రకాశ్‌రాజ్,సురేష్‌గోపి,ఎంజీ రామచంద్రన్ వంటివారు కూడా ఈ పురస్కారాన్ని ఒకసారి అందుకున్నారు. శంకరాభరణం చిత్రానికి 4 అవార్డులు టాలీవుడ్ ఎవర్గ్రీన్ సినిమా అయిన శంకరాభరణం చిత్రానికి అప్పట్లో అత్యధికంగా 4 జాతీయ అవార్డులు దక్కగా మేఘ సందేశం సినిమాకు కూడా 4 పురస్కారాలు దక్కాయి. ఆప్పటి నుంచి టాలీవుడ్‌కు అంతగా జాతీయ అవార్డులు వరించలేదనే చెప్పవచ్చు. తాజాగ RRR మూవీకి 6 అవార్డులతో పాటు మొత్తంగా టాలీవుడ్‌కు 11 అవార్డులు దక్కాయి. జాతీయ చలన చిత్ర పురస్కారాల కమిటీ సభ్యుల ముందు తెలుగు చిత్రాల గళాన్ని గట్టిగా వినిపించే వారు ఉంటే తప్పక టాలీవుడ్‌కు న్యాయం జరుగుతుందని ఎంఎం శ్రీలేఖ నిరూపించారనే చెప్పవచ్చు. జ్యూరీ సభ్యురాలిగా ఎంఎం శ్రీలేఖ 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఉన్నారు. ఈసారి టాలీవుడ్ సినిమాల ప్రత్యేకత గురించి కమిటీ సభ్యుల ముందు ఆమె గట్టిగానే గళం వినిపించారు. అవార్డుల అనౌన్స్మెంట్ తర్వాత ఎంఎం శ్రీలేఖ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు. 'ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం' అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని శ్రీలేఖ తెలిపారు. వాళ్లకు తెలుగు రాదు అలాంటప్పుడు మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుందని ఆమె గుర్తుచేశారు. అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలని పేర్కొన్నారు. 'ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి.' అని ఎంఎం శ్రీలేఖ తెలిపారు. -
అందుకే శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది: విజయేంద్ర ప్రసాద్
‘‘చిన్నప్పుడు నేను శ్రీలేఖకు ఒక ఆశ చూపించాను. ఆ ఆశ కోసమే తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. మంచి పాటలతో ప్రేక్షకులను అలరించింది. శ్రీలేఖ అన్న కీరవాణి సంగీతంలో ఆస్కార్ రేసులో ఉన్నారు. తన అన్నలానే శ్రీలేఖ కూడా ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలి’’ అన్నారు రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్. ‘నాన్నగారు’ (1994) సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయమైన శ్రీలేఖ ఇప్పటి వరకూ 5 భాషల్లో 80 చిత్రాలకుపైగా సంగీతం అందించారు. ఆమె సినిమా రంగంలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25 దేశాల్లో 25మంది సింగర్స్‌తో ఈ నెల 17 నుంచి ‘వరల్డ్ మ్యూజిక్ టూర్’ని స్టార్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఆస్తులు సంపాదించకపోయినా నా పాటలతో ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
25 దేశాల్లో వరల్డ్ మ్యూజిక్ టూర్.. రాజమౌళి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ సినిమా రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 25 దేశాల్లో వరల్డ్ మ్యూజికల్ టూర్‌ని మార్చి 17 నుంచి ప్రారంభిస్తున్నారామె. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ. తను ఎంతో సాధించినందుకు అభినందనలు’’ అన్నారు. ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి అన్న చేతుల మీదగా నా వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలీ సీరియల్ ‘శాంతినివాసం’కి నేను సంగీతం అందించాను. రవి మెలోడీస్ బ్యానర్ ద్వారా ఇన్వెస్టర్ గ్రోవ్స్ సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలయ్యే వరల్డ్ మ్యూజిక్ టూర్ 25 దేశాల్లో జరుగుతుంది. ఈ టూర్లో 25 మంది సింగర్స్ పాల్గొంటారు’’ అన్నారు. -
అలా డైరెక్టర్ అయ్యాను
‘‘ప్రసాద్‌గారికి ‘నటన’ కథ చెప్పాను. నచ్చింది కానీ, నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. అలా నేను డైరెక్టర్ అయ్యాను. లీడ్ క్యారెక్టర్‌కి భానుచందర్‌గారి పేరుని నిర్మాతగారే చెప్పారు. ఆయన్ని కలవగానే సినిమా చేయడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్. జీవితం గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అని డైరెక్టర్ భారతీబాబు పెనుపాత్రుని అన్నారు. మహిధర్, శ్రావ్యారావు జంటగా భవిరిశెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మీ సమర్పణలో గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నటన’. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నటులు శివాజీరాజా, భానుచందర్ విడుదల చేశారు. కుబేర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటన’ గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం. భారతీబాబు చక్కగా తెరకెక్కించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ పాటని పాడి, సంగీతం అందించాను. మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ఎం.ఎం.శ్రీలేఖ. ‘‘చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు భానుచందర్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు ప్రవీణ్, నటుడు కాశీ విశ్వనాథ్, గురుచరణ్, రఘు, మహిధర్, శ్రావ్యారావు తదితరులు పాల్గొన్నారు. -
అలా దర్శకుడినయ్యా!
‘‘188 సినిమాలకు రచయితగా పనిచేశాను. 1600 పాటలు రాశాను. గురుచరణ్‌గారు నాకు అన్నయ్యలాంటివారు. కుబేర ప్రసాద్‌గారితో కలసి ఓ సినిమా చేయబోతున్నాం. కథ, స్క్రీన్‌ప్లే రాయమన్నారు. తీరా రాసాక ‘నువ్వే దర్శకత్వం వహించాలి’ అన్నారు. అలా నేను ఈ సినిమాకు దర్శకుడినయ్యా’’ అని భారతీబాబు పెనుపాత్రుని అన్నారు. మహిధర్, శ్రావ్యారావు జంటగా నటించిన చిత్రం ‘నటన’. భవిరి శెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మి సమర్పణలో గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుబేర ప్రసాద్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ పి.రామ్మోహన్ రావు రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్ మేల్ వెర్షన్‌ను రచయిత జేకే భారవి, ఫిమేల్ వెర్షన్‌ను చాంద్ మాస్టర్ విడుదల చేయగా, ప్రొడక్షన్ లోగోను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ ఆవిష్కరించారు. భారతీబాబు పెనుపాత్రుని మాట్లాడుతూ– ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహాయం లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమాలో మూడు పాటలు ఉండగా మరో పాట పెట్టాలనిపించింది. శ్రీలేఖగారిని ఈ పాటకు సంగీతం చేయమని కోరగా, పదినిముషాల్లో చేసి ఇచ్చారు. ఈ నెలలో పూర్తి ఆడియో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన కుబేర ప్రసాద్, భారతీబాబు గార్లకు థ్యాంక్స్’’ అన్నారు మహిధర్. -
హృదయ నివేదన
దేవుడికి నివేదించడానికి భౌతికమైన మార్గాలు చాలా ఉన్నాయి. కాని ఆత్మికమైన మార్గం హృదయ సంభాషణే అంటారు శ్రీలేఖ. మన మనసుతో మౌనంగా దేవునితో చేసే ప్రతి సంభాషణ ఆయన వరకూ చేరుతుందని నమ్ముతారు ఆమె.లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం సమంగా గడపడమే తన మార్గం అంటారు శ్రీలేఖ. ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్ తప్పనిసరి అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను. అలా మా అబ్బాయి ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఫస్ట్ టైమ్ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. నేటి తెలుగు సినీపరిశ్రమలో ఒకే ఒక్క మహిళా సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ. మధురమైన∙సంగీతం, పాటలతో తెలుగువారికి ఆమె సుపరిచితురాలు అయ్యారు. పన్నెండేళ్ల వయసులోనే ‘తాజ్‌మహల్’ సినిమాకు సంగీత దర్శకత్వం అందించి ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. బాలీవుడ్‌లోనూ తన బాణీలతో అలరించారు. సాయంసంధ్య వేళ హైదరాబాద్ మణికొండలోని ఎమ్.ఎమ్.శ్రీలేఖ ఇంటి ముందున్నాం. లోపలి నుంచి ‘మహీం మూలాధారే కమపి మణిపూరే..’ కమ్మని స్వరంలో అమ్మవారి సౌందర్యలహరి వినిపిస్తోంది. అడుగుపెడితే హాల్లో ఏడాది వయసున్న పిల్లవాడిని ఒళ్లోకూర్చోబెట్టుకొని పాడుతున్నారు ఎమ్.ఎమ్.శ్రీలేఖ. ‘మా అబ్బాయి మహిమాన్.. ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి శ్లోకాలు పాడితే చాలు అల్లరి మానేసి కామ్‌గా వింటూ వుంటాడు’ అంటూ నవ్వారు. ఆ సంగీత దర్శకురాలితో భక్తి సంగీతం మీదుగా ‘నేను– నా దైవం’ ఫీచర్‌కు ఇంటర్వ్యూ మొదలైంది. మీకు సినిమా పాటలే అనుకున్నాం. భక్తి గీతాలు కూడా కంఠతా వచ్చన్నమాట.. అదేమిటి అలా అంటారు. సినిమా వాళ్లకు భక్తి పాటలు కూడా వస్తాయి. నేనైతే చిన్నప్పటినుంచీ వీటిని వింటూ పెరిగాను. చాలా భక్తి గీతాలు అలవోకగా వంటపట్టేశాయి. నాకు ఒకప్పటి జోలపాట ఇప్పుడు మా అబ్బాయికి లాలిపాట. మీ హాల్లో చాలా దేవతా పటాలు కనిపిస్తున్నాయి.... మా ఇంట్లో ఈ పటాలకు ఎప్పుడూ అలంకరణ ఉంటుంది. పూమాలలను చూశారుగా. మా వారు (పుట్టా వీరవరప్రసాద్) పూజలు చేస్తుంటారు. నేను ఆయనతో పాటు పాల్గొంటుంటాను. అందరి దేవుళ్లకు నేను అభిమానినే. ఎవ్వరినీ తక్కువ చేయను. కానీ, మూకాంబికా అమ్మవారిని మా ఇంట్లో అందరూ భక్తిగా కొలుస్తుంటారు. మూకాంబిక ఆలయం ఉన్నది కర్ణాటకలో.. మీరెలా ఆ అమ్మవారి భక్తులయ్యారు? నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని రాయచూర్‌కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో. అప్పట్లో కరెంట్, వైద్య సదుపాయం లేని ఊరు అది. మా కుటుంబం అక్కడే వ్యవసాయం చేస్తుండేది. అర్థరాత్రి నేను పుట్టిందే పూజ గదిలోనట. ఇప్పుడు ఈ హాల్‌కి రెండింతలు ఉంటుంది ఊళ్లో ఆ పూజగది. అంత పెద్ద పూజగదిలో మా పెదనాన్న శివశక్తిదత్త (ఎమ్.ఎమ్.కీరవాణి తండ్రి) వేసిన దేవతామూర్తుల చిత్రపటాలు ఎన్నో ఉండేవి. పుట్టాక గంటవరకు నేను ఏడ్వలేదట. పెద్దవాళ్లు భయపడి మూకాంబికా అమ్మవారికి నమస్కరించుకొని ఆమె కుంకుమ నా నుదుటన పెట్టాక నాలో కదలిక వచ్చి, ఏడ్చానట. అలా నా పుట్టుక గురించి తెలుసుకున్నప్పుడు ఒక అలౌకికమైన శక్తి ఏదో నా చుట్టూ ఉందని అర్థమైంది. అమ్మా నాన్నలకు ఒక్కత్తే కూతుర్నని మా నాన్నగారు (బోసు), అమ్మ (విజయలక్ష్మి భరణి) నన్ను భక్తికి దగ్గరగా ఉండేలా పెంచారు. మంగళ, శుక్రవారాలు మౌనవ్రతంలో ఉండేదాన్ని. పౌర్ణమి, అమావాస్యలైతే నాచేత నిష్టగా, కఠిన నియమాలు పాటింపజేసేవారు నాన్నగారు. నేను వేసుకునే డ్రెస్ కలర్‌ని బట్టి ఆ రోజు ఏ వారమో తెలిసిపోయేది. పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు ఉప్పుకారాలు లేకుండా తులసి ఆకులతో పెంచారంటే నమ్ముతారా! ఒక సన్యాసిని ఎలా ఉంటుందో అలా ఉండేదాన్ని. ఇంతటి కఠిన నియమాలా! .. ఉల్లంఘించాలనిపించలేదా? నాన్నగారు ఏదో కారణం లేకుండా ఇలా చేయరు అనుకునేదాన్ని. కాకపోతే లోపల ఓ సంఘర్షణ ఉండేది. ఎందుకుచేయాలి ఇవన్నీ అని. కానీ ఎప్పుడూ అడగలేదు. కీరవాణి అన్నయ్య, మా పెదనాన్న, చిన్నాన్న... మా ఇంట్లో ఆయనకు ఎవరూ ఎదురుచెప్పేవారు కాదు. ఆయన ఎంత చెబితే అంత. ఆయన ద్వారానే ధ్యానం, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ అలవడ్డాయి. స్ప్రిచ్యువల్ పవర్ గురించి కూడా ఆయన ద్వారానే నాకు తెలిసింది. పాజిటివ్‌గా ఉంటే అంతా మంచే వస్తుందనే నమ్మకం ఏర్పడింది. దేవుడు ఉన్నాడని మీరెలా నమ్ముతారు? దైవం మానుష రూపేణా అనేది నేను నూరు శాతం నమ్ముతాను. ఏదైనా చిన్న అవకాశం వచ్చినా అది మనిషి ద్వారానే రావాలి. మనం దారి తప్పినప్పుడు ఒక మనిషి దారి చూపిస్తాడు. దేవుడే ఆ మనిషిని పంపుతాడు. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరో అన్నం పెడతాడు. దైవమే ఆ మనిషిని ఏర్పాటు చేసి ఉంటాడు. నాకు దాసరి నారాయణరావుగారి ద్వారా మొదటి అవకాశం వచ్చింది. ఆ అవకాశమే దేవుడు. పన్నెండేళ్ల వయసులో నేనేంటి... ఆ పాటలేంటి? ఆ ప్రేమ పాటలకు బాణీలేంటి? దేవుణ్ణి మనిషిలా చూడాలి... మనిషిని దేవుడిలా చూడాలి. అప్పుడు అందరూ మనకు ఆప్తులై జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కళ కూడా దైవమే అంటారా? దేవుని ఉనికే కళ. నాకు ఆ కళ ఇచ్చి తన ఉనికిని తెలియచేశాడు దేవుడు. దాన్ని పట్టుకొని ఈ జీవితాన్ని నెగ్గుకొస్తున్నాను. ఇప్పటికీ కీ బోర్డు దగ్గర కూర్చున్నానంటే ఏదో అలౌకికమైన శక్తి నన్ను ఆవరిస్తున్నట్టుగా ఉంది. అలవోకగా బాణీలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు దైవానికి సంబంధించి ఎలాంటి నియమాల పాటిస్తున్నారు? ఏదైనా చిన్న సమస్య వచ్చినా చాలు క్షణం క్షణం సినిమాలో శ్రీదేవిలా ‘దేవుడా దేవుడా దేవుడా..’ అని మొక్కేసుకుంట. కాని ఫలానా దేవుడికే మొక్కాలి అనే నియమం కూడా లేదు. నేను జీసస్నూ నమ్ముతాను. మా నాన్నగారు 300 వరకు జీసస్ పాటలు రాశారు. కొన్నింటికి నేనూ బాణీలు కట్టాను. తిరుమలకు వెళతాను. అలాగే కడప దర్గాకు వెళతాను. దైవాన్ని నమ్మడానికి కులం, మతం తేడాలే లేవు. దైవం అనేది ఒక సుప్రీం పవర్. అన్నింటికీ అతీతమైనది. మీ నాన్నగారిలాగ మీరూ మీ అబ్బాయికి ఆధ్యాత్మికతను చేరువ చేస్తున్నారా? కొన్ని లక్షణాలు జన్మతః వచ్చేస్తుంటాయి. అందులో ఆధ్యాత్మిక శక్తి కూడా ఒకటి. మా అబ్బాయిని ‘అమ్మ ఏది’ అంటే చాలు మూకాంబికా అమ్మవారి ఫోటో చూపిస్తాడు. ప్రసవం సమయంలో నాకు ఆపరేషన్ తప్పనిసరి అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటే నేను సౌందర్యలహరి పాడుతూ ఉన్నాను. అలా వాడు ఆ సౌందర్యలహరి వింటూ పుట్టాడు. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఫస్ట్ టైమ్ తల్లి పాట పాడుతూ బిడ్డకు జన్మనివ్వడం అన్నారు. దేవుడిని ఎలా ఫీల్ అవుతుంటారు? మనం తెలిసో, తప్పకనో.. తప్పులు చేస్తూనే ఉంటాం. అది అవసరమో, అనవసరమో, అహంకారమో కూడా తెలియదు. జీవనశైలిలో ఇవన్నీ భాగమే. పడుకునే ముందు చేసే ధ్యానంలో నా వల్ల ఈ రోజు ఎవరైనా హర్ట్ అయి ఉంటే వారికి సారీ అని చెప్పుకుంటాను. టెలీపతి ద్వారా మన మనసులోని భావం వారికి చేరుతుందని నా నమ్మకం. అలాగే దేవుడికి కూడా నా మనసులోని భావం చేరుతుందని నా నమ్మకం. అందుకే చాలా విషయాలు ఆయనకు చెప్పుకుంటూ ఉంటాను. జీవితంలో అన్నీ ఉండాలి. బంధువులు, మిత్రులు, పని. అయితే, దేని కోసం దేన్నీ వదులుకోకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. వచ్చిన పని గొప్పగా చేయాలి. మంచి మంచి పాటలకు సంగీతం అందించాలి. ఇదే దైవాన్ని కోరుకునేది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
‘సాక్షి ఎరినావన్ స్కూల్ ఫెస్ట్ గ్రాండ్ ఫినాలే’
-
నా సలహా అదొక్కటే!
‘‘ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ అంటారు కానీ, నాకు ఎప్పుడూ ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. నేనెప్పుడూ అలా ఫీలవలేదు కూడా! నేను ఎప్పుడైనా పని గురించే ఆలోచిస్తాను కానీ మేలా, ఫిమేలా అనే ఆలోచనే కూడా రాదు. ప్రస్తుతం నేను ‘మౌనం’, ‘వల్లి’ చిత్రాలకు సంగీతం అంది స్తున్నా. ఏ రంగంలో అయినా పోటీ అనేది తప్ప కుండా ఉంటుంది. అప్పుడే మనం ఏమిటో నిరూపించుకుంటే ప్రత్యేక గుర్తింపుంటుంది. మహిళ లకు నేనిచ్చే సలహా ఒక్కటే.... అందరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అదేంటో తెలుసుకుని దాన్ని చేరుకు నేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు - ఎం.ఎం. శ్రీలేఖ, సంగీత దర్శకురాలు -
'ఎప్పుడొచ్చినా పాదగయను దర్శించుకుంటాను'
పిఠాపురం టౌన్ : గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని పాదగయ క్షేత్రాన్ని సినీ సంగీత దర్శకురాలు, గాయని ఎంఎం శ్రీలేఖ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు క్షేత్ర మాహాత్మ్యాన్ని ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా పాదగయ క్షేత్రాన్ని దర్శించుకుంటానని తెలిపారు. పుష్కరాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినట్టు తెలిపారు. రాజమండ్రి, నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆమె తెలిపారు. చిన్న వయసులోనే 75 సినిమాలకు సంగీతాన్ని అందించిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సలో తన పేరు నమోదైందని, జాతీయ అవార్డు సాధించానని తెలిపారు. సినీరంగానికి మరిన్ని సేవలు అందించాలన్నదే తన కోరికని శ్రీలేఖ తెలిపారు.